ఒకప్పుడు కాశీనగరంలో సంపన్న వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను, అతని భార్య సంతానం కోసం తిరగని తావు లేదు; దర్శించని క్షేత్రమూ లేదు. అయినప్పటికీ వాళ్లకు పిల్లలు పుట్టలేదు. చూసి చూసి, బంధువుల పోరు పడలేక, వ్యాపారి ఇంకొకామెను పెళ్ళి చేసుకున్నాడు.

అయితే భార్యలు ఇద్దరికీ‌ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది: ఒకరంటే ఒకరికి ఏమాత్రం సరిపడేది కాదు. దాంతోపాటు వాళ్ళు ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద, చివరికి వ్యాపారి మీద- తీర్చుకోటం మొదలుపెట్టారు. దాంతో వ్యాపారి బ్రతుకు దుర్భరమయింది; ఆరోగ్యం పాడైంది; వ్యాపారం దెబ్బతిన్నది; అతనిలో పశ్చాత్తాపం మొదలయింది.

అయితే ఆలోగా భార్యలిద్దరూ ఒకరినొకరు చంపుకునేందుకు కూడా పథకాలు రచించడం మొదలుపెట్టారు!

సరిగ్గా ఆ సమయంలో మొదటి భార్య గర్భం ధరించింది. అసూయతో రగిలిపోయిన రెండవ భార్య, ఆమెను చిత్ర విచిత్రంగా హింసించేందుకు పూనుకున్నది. ఇక అప్పుడు మొదటి భార్య తనని, తన గర్భాన్ని కాపాడుకోవటం కోసం చిన్న ఆమెను పూర్తిగా అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించింది!

ఆ విధంగా పెద్దభార్య పన్నిన కపటోపాయంతో చిన్న ఆమె నిజంగానే చనిపోయింది- కానీ అనుకోకుండా పెద్దభార్య కూడా పురిటిలోనే కన్ను మూసింది!

శరీరాలు రెండూ నశించినై. కానీ, సవతులిద్దరి వైరం మటుకు అలా కొనసాగుతూనే పోయింది. తరువాతి జన్మలో వాళ్లిద్దరూ ఒకరు కోడి గానూ, మరొకరు పిల్లిగాను పుట్టారు. కోడి గుడ్లను పిల్లి ఎత్తుకుపోయేది; పిల్లిని కోడి తరిమేది! వాటి మధ్య వైరం అలా కొనసాగాక, తరువాతి జన్మలో అవే- ఒకటి పావురం గానూ, మరొకటి చిరుతపులి గానూ- జన్మించాయి. అయినా వాటి వైరం అలాగే కొనసాగుతూ పోయింది!

ఆ విధంగా 'జన్మ శత్రువులు' అయిన ఆ రెండూ బుద్ధుడు జీవించి ఉండిన సమయంలో కూడా తమ పోరాటాన్ని కొనసాగించుకునేందుకు పుట్టాయి. శ్రావస్తీ నగరంలో ఒక వ్యాపారికి కూతురుగా ఒకామె పుట్టగా, ఆ ప్రక్కనే గల అడవిలో తిరుగాడే యక్షిణిగా మరొకామె జన్మించింది.

వ్యాపారి కూతురికి పెళ్లై ఒక బిడ్డ పుట్టేసరికి, యక్షిణి ఆమెను, ఆమెకు పుట్టిన పిల్లను పీడించటం మొదలు పెట్టింది. అనేక రోగాలు, రొష్టులు, దు:ఖాలకు గురైన వ్యాపారి కూతురు, తిరగబడింది. తను కూడా యక్షిణిని దెబ్బ తీసేందుకు గట్టిగా ప్రయత్నించింది. కానీ అసమానమైన శక్తులు కలిగి ఉండి, అనేక జన్మలుగా వచ్చిన వైరంతో కుతకుతలాడిపోతున్న యక్షిణి బలం ముందు ఆమె ప్రయత్నాలేమీ ఫలించలేదు.

అలాంటి ఆ సమయంలో వ్యాపారికి ఎవరో చెప్పారు, బుద్ధుడి గురించి: "దు:ఖానికి కారణం ఏంటో చూశాడట ఆయన. నీ కూతురి దు:ఖాన్ని పోగొట్టే ఉపాయం ఆయన వద్ద ఉంటుందేమో, ప్రయత్నించరాదూ?" అని.

ఒక చేతిలో బిడ్డను పట్టుకొని, అదృశ్యంగా కలయక్షిణి వెంటరాగా, వ్యాపారి కూతురు దీనంగా బుద్ధుడిని సమీపించి తనకు విముక్తి కల్పించమని వేడుకున్నది.

ఆమెను, ఆమె వెనక అదృశ్యంగా వచ్చిన యక్షిణిని, వారిద్దరి గతాన్ని కూడా దర్శించిన బుద్ధుడు చిరునవ్వుతో- "తల్లీ-

నహి వేరేన వేరాని సమ్మంతీథ కుదాచనం
అవేరేనచ సమ్మంతి ఏసధమ్మో సనంతనో

"లోకంలో ఎప్పుడైనాగాని ద్వేషాన్ని ద్వేషంతో శాంతింపజేయలేము. ప్రేమతోటీ, సద్భావన తోటీ మాత్రమే వైరాన్ని జయించగలం. ఇది ఏనాటికీ వర్తించే న్యాయం- సనాతన ధర్మం"

"మీ ఇద్దరికీ మధ్య పెరుగుతూన్న వైరానికి ఇకనైనా స్వస్తి పలకండి. 'ఒకరినొకరు ద్వేషించడం, ఒకరినొకరు దెబ్బ తీసుకోవడం' అన్న ఆలోచనను ప్రక్కన పెట్టి మీ మీ మనసులను నిష్కల్మసంగా చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి" అని, సులభమైన ధ్యాన మార్గాన్ని బోధించాడు.

ఆ బోధను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండిన కలయక్షిణి అప్రయత్నంగానే శ్రోతాపన్నురాలైంది. ఆమెలోని క్రోథం, ద్వేష భావం శాంతించాయి. స్నేహ సద్భావనల కారణంగా అనేక జన్మల వైరం అంతమైంది.

అటుపైన వ్యాపారి కూతురు కూడా ధర్మ మార్గంలో పయనించి తన మనసును ద్వేష రహితంగా చేసుకున్నది!