చాలా కాలం క్రితం పిల్లులు కూడా అడవిలోనే ఉండేవి. అప్పట్లో ఒకసారి ఓ పిల్లి తనుండే చోటును విడిచిపెట్టి, తన అన్న సింహాన్ని చూడడానికి వెళ్లింది. సింహం దాన్ని చూడగానే, "వచ్చావా, మంచిది మంచిది" అన్నది తప్ప, ఇంక మళ్ళీ‌ మధ్యాహ్నం వరకూ పట్టించుకోలేదు.

ఇంక మధ్యాహ్నం అవుతుండగా, సభ చాలించి వచ్చి, అది పిల్లిని పిలిచింది.

పిల్లి రాగానే అది గట్టిగా గర్జిస్తూ "ఏంటి, ఇది?! నా భోజన సమయమయ్యింది కదా? నువ్వు నాకు ఇంక ఆకు కూడా వేయలేదు! ఇంత సోమరి తనం ఐతే ఎట్లా?" అన్నది.

పిల్లి వెంటనే పోయి ఓ అరటి ఆకు కోసుకొని వచ్చి సింహం ముందు వేసింది.

వెంటనే సింహం "ఏదీ?! ఈ వేళ ఉదయమే నేను ఓ తోడేలును పట్టుకొని తెచ్చాను కదా?! ఆ మాంసాన్ని వడ్డించు! వెంటనే!!" అంది.

పిల్లి గుహలోకి పోయి, తోడేలు మాసం తీసుకొచ్చి వడ్డించింది.

సింహం దాన్నంతా మెక్కేసి, "ఆహా! ఆనందంగా ఉంది. నా కడుపు నిండింది" అని త్రేన్చుతూ, పిల్లిని పిలిచి "ఇదిగో! అంతా శుభ్రం చేసేయ్!" అని చెప్పి, వెళ్ళి పోయింది. పిల్లి గుహనంతా శుభ్రం చేసి, ఆ తర్వాత తిందామని చూసుకుంటే గిన్నెలన్నీ‌ ఖాళీగా ఉన్నాయి! పిల్లి కోసం కొంచెం మాంసాన్ని కూడా వదలలేదు సింహం.

మరుసటి రోజుకల్లా పిల్లికి నీరసం వచ్చింది; సింహానికి జ్వరం వచ్చింది. ఎంత జ్వరం వచ్చిందంటే, సింహం‌ ఇక లేవలేక, సొమ్మసిల్లి, గుహలోనే పడుకుని మూలిగింది! ఆ రోజు సాయంత్రంగా అడవిలోని జంతువులన్నీ దాన్ని పరామర్శించటానికి వచ్చాయి. ఆహారం లేక తనకు ఎంత నీరసంగా ఉన్నా, వచ్చిన జంతువులన్నిటినీ ఉత్సాహంగా పలక-రించింది పిల్లి.

జంతువులతో‌ మాట్లాడే సరికి సింహానికి మళ్ళీ ఆకలైంది.

వెంటనే అది పిల్లిని పిల్చి, "సోదరా! వెళ్లి అల్పాహారం తయారు చేయి!" అని ఆజ్ఞాపించింది.

పిల్లి దిబ్బ మొహం పెట్టి, "ఇంట్లో దినుసులు ఏమీ లేవు!" అంది. తన రాజ్యపు జంతువులముందు అట్లా అనే సరికి సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది.

అది గట్టిగా గర్జిస్తూ "పిల్లీ! వెంటనే పరుగెత్తు! మనుషులు నివసించే చోటుకి పో! నీకు కనిపించిన ఇంట్లోంచి 'కొన్ని దినుసులు, ఓ నిప్పున్న కట్టె' తీసుకొని రా! వెళ్ళు!" అని అరిచింది.

నీరసించిన పిల్లి ఆ అరుపుకు గడగడ వణుక్కుంటూ అడవి దాటి, మనుషులు నివసించే ఊర్లోకి వెళ్లింది. పిల్లికి మనుషులు కొత్త; వాళ్ళ ఇళ్ళు కొత్త; వాళ్ల తీరు తెన్నులూ‌ కొత్తే.

అది అనుమానంగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయి, ఆ దగ్గర్లో ఆడుకుంటున్న పిల్లల కంట పడింది. పిల్లలు చటుక్కున లేచి దాని వెంట పడ్డారు. అది పరుగు పెట్టాలని చూసిందిగానీ, అప్పటికి రెండు రోజులుగా భోజనం‌ లేదుకదా, అందుకని వాళ్ళ చేతికి చిక్కింది.

పిల్లలంతా తనని దొరకబుచ్చుకోవటం, ముఖంలో ముఖం పెట్టి చూడటంతో పిల్లికి చాలా భయం వేసింది. "ఏయ్! నువ్వు ఏమీ భయపడకు! నిన్ను మేం ఏమీ చెయ్యములే" అని బుజ్జగించి వాళ్ళు దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. "అబ్బ! "ఎంత మృదువుగా ఉందో! ఎంత అందంగా ఉందో!" అంటూ పిల్లలు అందరూ దాన్ని చాలా ముద్దు చేసారు. ఒక్కొక్కరూ దాన్ని సున్నితంగా ఎత్తుకున్నారు; నవ్వారు; నవ్వించాలని చూసారు. వాళ్లలో ఒకడు వెళ్ళి దానికి పాలు తీసుకొచ్చి పోసాడు. అది ఆత్రంగా తాగుతుంటే పిల్లలంతా చుట్టూ చేరి వింతగా చూసారు!ఆ హడావిడిలో పిల్లి తను వచ్చిన పనిని మర్చిపోయింది.

'నాకు ఎన్నడూ, ఎవ్వరి నుండీ కూడా ఇంత ప్రేమ దొరకలేదు!" అని చాలా సంతోషపడుతూ ఉండిపోయింది.

అంతలో ఒక్క సారిగా అడవిలోంచి సింహ గర్జన వినబడింది. పిల్లలంతా భయపడిపోయారు. పిల్లి కూడా భయంతో వణికిపోయింది: తను ఊళ్ళోకి ఎందుకు వచ్చిందో అప్పుడు గుర్తుకు వచ్చింది దానికి!

వెంటనే అది గబగబా ఒక ఇంట్లోకి దూరి, మండుతున్న ఓ కట్టెను తీసుకొని పొదలు, రాళ్ళు దూకుతూ అడవిలోకి పరుగు పెట్టింది.

ఊళ్ళో ఉన్న పిల్లలంతా దాని వెంట పడ్డారు. పిల్లి సింహం గుహ చేరుకునే సరికి కోపంతో, ఎర్రబడిన కళ్లతో ఉన్న సింహం‌ కనిపించింది దానికి. దాన్ని చూసే సరికి పిల్లికి ఎంత భయం వేసిందంటే, అది తన చేతిలో ఉన్న కట్టెను అక్కడే పడేసి వెనక్కి తిరిగి ఊళ్ళోకే పారి పోయింది. అప్పుడు అంటుకున్న గడ్డిని ఆర్పేసరికి అడవిలోని జంతువుల తలప్రాణం తోకకు వచ్చింది! అట్లా ఇక ఆ రోజు నుండి పిల్లి ఊళ్ళో పిల్లల దగ్గరే ఉండిపోయింది.

కొత్తగా ఎవర్ని చూసినా హిందీలో- "మై ఆవూఁ.. (నేను రానా?)" అని అడగటం మొదలెట్టింది. అప్పుడంతా పిల్లలు దాన్ని రమ్మని, ముద్దు చేసి, "పిల్లీ! నువ్వు మళ్ళీ ఎక్కడికీ వెళ్లవు కదా?" అని అడిగే వాళ్ళు. "లేదు- నేను ఇంక ఎక్కడికీ వెళ్లను!" అని తల ఊపేది పిల్లి!