"ఆగస్టు పదిహేను వచ్చేస్తోందిరా! పాత చీమ కథ ఒకటి గుర్తొస్తోంది!" గొణిగాడు తాతయ్య.
పిల్లలంతా గడబిడగా తాతయ్య చుట్టూ చేరి కూర్చున్నారు "ఊఁ. చెప్పు తాతయ్యా" అంటూ.
తాతయ్య నవ్వి, "ఇది మీకు తెల్సిన కథేరా, నేను మొదలు పెడితే, తర్వాతి వరసలు మీరే నాకు చెబుతారు" అని మొదలు పెట్టాడు:
"అనగనగా ఒకరాజుకు ఏడుగురు కొడుకులు.
ఆ ఏడుగురూ ఒకరోజున వేటకెళ్లి, ఏడు చేపలు పట్టుకొచ్చారు."
"ఆ ఏడు చేపల్ని ఎండలో పెట్టారు. అన్నీ ఎండాయి కానీ ఒక చేప మాత్రం ఎండలేదు" చెప్పాడు ఏడో తరగతి సోము.
తాతయ్య నవ్వాడు. "అవునురా, అదే కథ- చేపా, చేపా! నువ్వెందుకు ఎండలేదు? అని వాళ్లు ఆ చేపని అడిగారు."
"నాకు గడ్డి మోపు అడ్డమొచ్చింది, అందుకే ఎండలేదు! అన్నది చేప."
"మరైతే గడ్డి మోపూ! గడ్డి మోపూ! ఎందుకు అడ్డమొచ్చావు?" అని వాళ్లు గడ్డి మోపుని అడిగారు.
"నన్ను ఆవు మేయలేదు కదా! అందుకే అడ్డమొచ్చాను అన్నది గడ్డిమోపు"- చెప్పింది చిట్టి.
"అవును. అప్పుడు వాళ్ళు ఆవు దగ్గరికి వెళ్ళి అడిగారు- "ఆవూ, ఆవూ! నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?" అని.
"-గొడ్లు కాసే చిన్నోడు నన్ను వదలలేదు అన్నది ఆవు"- చెప్పింది సుధ.
తాతయ్య నవ్వుతూ "ఆఁ.. మరి- చిన్నోడా చిన్నోడా! ఆవును ఎందుకు వదలలేదు?" అని అడిగాడు చిన్నోడిని.
"అవ్వ నాకు బువ్వపెట్టలేదు" అన్నాడు చిన్నోడు, బుంగమూతి పెట్టుకొని.
అంతలోనే అవ్వ అక్కడికి వచ్చింది.
వెంటనే పిల్లలందరూ అరిచారు- "అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు?" అని.
అవ్వకు కూడా కథ తెలుసల్లే ఉంది- "చంటోడు ఏడ్చాడు ఇంక బువ్వ ఎట్లా వండేది?!" అన్నది.
పిల్లలందరూ అవ్వకేసి చాలా గౌరవంగా చూసారు.
"మరి, చంటోడా చంటోడా ఎందుకు ఏడ్చావు?" అడిగాడు తాతయ్య చంటోడిని.
"నన్ను చీమ కుట్టింది! అందుకే ఏడ్చాను!" అన్నాడు చంటోడు ఏడుపు ముఖం పెట్టి.
"వద్దులే నాన్నా, ఏడవకు!" అని వాడిని సముదాయించి, మరి "చీమా, చీమా! ఎందుకు కుట్టావు?" అంటూ అందరికేసీ చూసాడు తాతయ్య.
"నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?" అరిచారు పిల్లలంతా నవ్వు ముఖాలతో.
"అవునవును. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? అన్నది చీమ!" చెప్పాడు తాతయ్య మళ్ళీ, తను కూడా నవ్వుతూ.
వెంటనే చిట్టి, చిన్నోడు, చంటోడు లేచి బయటికి పరుగు పెట్టారు.
ఆ తర్వాత మెల్లగా "అయినా తాతయ్యా! దీనికీ- ఆగస్టు పదిహేనుకూ ఏంటి, లంకె?!" అడిగింది సుధ. తను పెద్ద పిల్ల కదా, అందుకని తాతయ్య మాటలన్నీ బాగా అర్థమౌతాయి తనకు.
"అదా, నవ్వాడు తాతయ్య. "నువ్వు చెప్పు, చిన్నోడు పుట్టలో వేలు పెడితే మటుకు చీమ ఎందుకు కుట్టాలి?! ఊరికే కథని అట్లా‌ ముగిస్తారు కానీ?!"
సుధ ఆలోచిస్తూ అన్నది "తన పుట్టలో వేరేవాళ్ళెవరో వేలు పెడితే, మరి చీమకి అసౌకర్యంగా ఉంటుంది కదా తాతయ్యా?!" అంది.
"అదేనమ్మా, స్వాతంత్ర్యపు రహస్యం! తన పుట్టలో వేరేవాళ్లెవరో వేలు పెడితే చీమలాంటి స్వతంత్రజీవి ఊరుకోదు- కుడుతుంది! మనమూ అదేగా, చేసింది?! బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశంలోకి దూరితే మనమూ ఊరుకోలేదు. పోట్లాడాం. కొందరం శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు చేసాం. జైలుకెళ్ళాం. కోర్టుల్లో వాదించాం. పత్రికలు నడిపాం. కొందరం తుపాకులు పట్టుకున్నాం. చివరికి బ్రిటిష్ వాళ్లకి అర్థమైంది- "వీళ్ళు కళ్ళు తెరిచారు; ఇంక ఊరుకోరు; పోదాం!" అని పెట్టే బేడా సర్దుకొని, వాళ్ల దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు!" చెప్పాడు తాతయ్య.
"మరి ఇప్పుడు మళ్ళీ మనమే వాళ్లని రమ్మని అడుక్కుంటున్నాంగా, తాతయ్యా! 'విదేశీ పెట్టుబడులు' అంటే వాళ్ళు వచ్చి మన దేశంలో వ్యాపారం చేయటమేగా? మళ్ళీ ఇదివరకులాగే అయితే ఎలాగ?!" అడిగింది సుధ.
"అదేనమ్మా! -అయితే ఇప్పుడు మీలాంటి కుర్ర చీమలు అసంఖ్యాకంగా ఉన్నై తల్లీ మన దేశంలో! తెలివిమాలిన పరాయివాళ్ళు గత అనుభవాల్ని మర్చిపోయి, మళ్ళీ ఓసారి పుట్టలో వేలు పెడితే, అప్పుడు మీ చీమలు ఏం చేస్తాయి, నువ్వే చెప్పు?!"
"మళ్ళీ కుడతాయి! ఎందుకు ఊరుకుంటాయి?! ఈసారి మరింత గట్టిగా కుడతాయి!" అన్నది సుధ.
"అదేనమ్మా, నేనూ అదే అనుకున్నాను!" అన్నాడు తాతయ్య, సుధ భుజం తట్టి పైకి లేస్తూ.