చాలాకాలం క్రితం రామచంద్రమూర్తి అనే గొప్ప సంగీత ఆచార్యులు ఒకరు వుండేవారు. ఆయన దగ్గర ప్రతిభావంతులైన విద్యార్థులు చాలామంది ఉండేవారు.

అయితే వాళ్ళందరిలోనూ 'మాధురి', 'గాయత్రి' అనే యిద్దరు విద్యార్థినులు అసామాన్యమైన ప్రతిభ చూపుతూ అందరికన్నా మిన్నగా కనిపించేవారు. గురువుగారి ఇల్లు తమ ఇల్లేనన్నట్లుగా స్వతంత్రంగా తిరుగుతూ గురుపత్నికి ఇంటి పనులలో సహాయం చేస్తూ ఎప్పుడూ అక్కడే వుండేవారు. గురువుగారూ ఆయన భార్య జానకమ్మా కూడా వాళ్ళిద్దరినీ ఎంతో వాత్సల్యంగా కన్నబిడ్డలలాగా చూసు-కునేవారు.

వారి విద్య మరికొన్నాళ్ళలో పూర్తి అవుతుందనగా, ఒక రోజు రాత్రి పూట తీరికగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నపుడు జానకమ్మగారు భర్తని అడిగారు- “మీకు మాధురి కన్నా గాయత్రి అంటే ఎక్కువ యిష్టమా?” అని.

“అదేమిటి? అలా అడిగావు?”

“మాధురి అలా అనుకుంటోంది. మధ్యాహ్నం నాతో అంది”

“నువ్వేమన్నావు?”

“అదేమీ లేదు, గురువుగారికి మీ యిద్దరూ సమానమే అన్నాను.”

“ఒప్పుకుందా?”

“ఒప్పుకోలేదు.” అంటూ ఆవిడ నవ్వింది. “ఇద్దరిమీదా సమానంగా యిష్టం వుండకూడదట. అలా వుంటే కూడా తప్పేనట.

ఎందుకంటే తను మనల్ని గాయత్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందట. కాబట్టి మనకు కూడా తనంటే ఎక్కువ యిష్టం ఉండాలట!”

ఆ మాటలకి రామచంద్రమూర్తిగారు పెద్దగా నవ్వారు. “అలాగా! అయితే రేపు తేల్చేద్దాములే, ఆ విషయం. మాధురి సందేహాలన్నీ తీర్చేద్దాము” అన్నారు.

అన్నట్లుగానే మర్నాడు గాయత్రినీ మాధురినీ పిలిచి “మీకొక చిన్న పరీక్ష పెడతానివాళ” అని చెప్పారు.

“నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇపుడు నేను మీ యిద్దరి పేర్లు మారుస్తున్నాను” అన్నారు. మొదట మాధురి వైపు చూస్తూ “నీ పేరు రామలక్ష్మి” అన్నారు. తర్వాత గాయత్రి వైపు తిరిగి “నీ పేరు సుబ్బలక్ష్మి” అన్నారు.

“నేను ఈ పేర్లతో పిలిస్తే పలకాలి మీరు. పలుకుతారా!” అని అడిగారు. ఇద్దరూ సరేనంటూ తలలూపారు.

“ఎవరి పేరు వాళ్ళు సరిగా గుర్తు పెట్టుకుంటారా! మర్చిపోయి నాకు కోపం తెప్పిస్తారా?” అడిగారు గురువుగారు.

“మర్చిపోము. అస్సలు మర్చిపోము” అని యిద్దరూ గట్టిగా చెప్పారు.

“సరే చూస్తాను. చెప్పాను కదా, ఇది మీకొక పరీక్ష. నాకు కొంచెం పనుంది. మీరు వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోండి. సంగీత పాఠం కొంచెం సేపయ్యాక చెప్తాను.”

గురువుగారు చెప్పిన మాటలు విని మాధురీ- గాయత్రీ యిద్దరూ జానకమ్మగారి దగ్గరకి వెళ్ళారు. ఆవిడ వంట చేసుకుంటుంటే చూస్తూ కబుర్లు చెప్తూ ఆవిడ దగ్గరే కూర్చున్నారు.

కాసేపటి తర్వాత బయటినుంచి గురువుగారి పిలుపు వినిపించింది. “వెంకటలక్ష్మీ, వెంకటలక్ష్మీ” అంటూ.

పిల్లలిద్దరూ మొహాలు చూసుకున్నారు. గాయత్రి లేచి బయటకి వెళ్ళబోయింది.

“నీ పేరు 'వెంకటలక్ష్మి' అని పెట్టారా, మీ గురువుగారు?” అని అడిగింది జానకమ్మ.

“కాదు, సుబ్బలక్ష్మి అని పెట్టారు”

“మరి 'వెంకటలక్ష్మి' అని పిలిస్తే నువ్వెందుకు వెళ్తున్నావు?” గాయత్రి సమాధానం చెప్పేలోపల “వెంకటలక్ష్మీ ఎక్కడున్నావు? త్వరగా రా...” అంటూ గురువుగారు మరొకసారి అరిచారు.

గాయత్రి బయటకి పరుగెత్తుతుంటే మాధురి మాత్రం కదలకుండా అలాగే కూర్చుంది.

గాయత్రి వెళ్ళి “ఏం కావాలి గురువుగారూ!” అని అడుగుతుంటే ఆమె వెనకే మాధురీ, జానకమ్మగారూ కూడా బయటికి నడిచారు.

“ఏమీ లేదు, ఊరికే పిల్చాను” అన్నారు గురువుగారు.

“నాకు తెలుసు- మాకు మా పేర్లు గుర్తు ఉన్నాయో లేదో చూద్దామని పిల్చారు కదా! చూడండి గురువుగారూ, గాయత్రి తన
పేరు మర్చిపోయింది- కాబట్టి పరీక్షలో ఓడిపోయినట్లే!” అంది మాధురి.

“లేదు- నేను నా పేరు మర్చిపోలేదు” అంది గాయత్రి.

“మర్చిపోకపోతే, మరి వేరే పేరుతో పిల్చినపుడు రాకూడదు కదా!”

“ఎందుకు రాకూడదు?! సుబ్బలక్ష్మి మాత్రం నా అసలు పేరా ఏమిటి? అది కూడా గురువుగారు పెట్టిన పేరే కదా? 'సుబ్బలక్ష్మి' అని పిలిస్తే పలికినపుడు 'వెంకటలక్ష్మి' అని పిలిచినా పలకచ్చు. అయినా అది ముఖ్యం కాదు: గురువుగారు పిలవగానే వెళ్ళడం ముఖ్యం.”

వాళ్ళిద్దరి మాటలనీ జానకమ్మగారు, రామ-చంద్రమూర్తిగారు నవ్వుతూ వింటున్నారు.

“కానీ ఇది పరీక్ష కదా గాయత్రీ?! ఒక పేరుకి బదులు ఇంకో పేరుకి పలికితే గురువుగారికి కోపం వస్తుంది కదా? నువ్వు ఓడిపోయినట్లే అవుతుంది!” అన్నారు జానకమ్మగారు.

“అయితే అవుతుందిలేమ్మా, ఓడిపోతే ఓడిపోతాను! గురువుగారికి కోపం వచ్చి తిడితే తిడతారు! అట్లాగని పిలిస్తే పలకకుండా ఎలా వుంటాను? ఎందుకు పిల్చారో ఏమిటో? దాహం వేసి పిల్చారేమో; ఏమన్నా పని వుండి పిల్చారేమో?! నేను గెలవడం కోసం గురువుగారి మాట విననట్లుగా ఎలా కూర్చుంటాను?”

గాయత్రి మాటలు పూర్తి అవుతుండగానే గురువుగారు ఆమెని దగ్గరికి తీసుకుని తల నిమిరారు. “ఇదేనమ్మా, ఇవాళ మీకు పెట్టిన పరీక్ష!” అన్నారు.

మాధురికి తన తప్పు తెలిసింది. పరీక్షలో గాయత్రి గెలిచిందనీ అర్థమయింది. చిన్నబుచ్చుకుని తల వాల్చుకున్న మాధురిని మరొక చేత్తో దగ్గరికి తీసుకున్నారు గురువుగారు.

“అమ్మానాన్నలనీ గురువులనీ దేవుడ్నీ ప్రేమించవలసింది ఇలాగేనమ్మా! నేర్చుకుం-టావా?!” అన్నారు. ఆమె తల మీద చేయి వేసి “బంగారు తల్లివి కదా, నేర్చేసుకుంటావు, నాకు తెలుసు.” అన్నారు మళ్ళీ ఆయనే.

మాధురి సంతోషంగా తలవూపింది. “పాఠం పూర్తయిపోయింది కదా, రండి అందరికీ పరమాన్నం ప్రసాదం పెడతాను.” అన్నారు జానకమ్మగారు.

ఆవిడ చిరునవ్వుతో లోపలికి వెళ్తుంటే ఆమె వెనుక చెట్టాపట్టాలు వేసుకుని మాధురీ, గాయత్రీ పరుగెత్తారు. వాళ్ళిద్దరినీ వాత్సల్యంగా చూస్తూ గురువుగారు మనసులోనే ఆశీర్వదించారు.