భవానిదాసు గొప్ప కవి. అతనిది కవితా హృదయం. అరణ్యంలోకి పోయి, ప్రకృతిని చూసి పులకిస్తూ అద్భుతమైన కవితా ఖండికలు రచించేవాడు. పిట్టలు పాడినా, ఆకులు అల్లలాడినా, గాలి పాడినా, వంకల్లో నీళ్ళు జలజల పారినా అతని మనసు పరవళ్ళెత్తి కవిత్వాన్ని చిలకరించేది.

భవానిదాసు భార్య దుర్గ గట్టిది. రకరకాల పనులు చేసుకుంటూ సంసారాన్ని ఈదుకొస్తున్నది. ముగ్గురు పిల్లల్ని, అత్తమామల్ని పోషిస్తున్నది- భర్తతో పాటు.

భవానిదాసుకు ఏనాడూ సరైన 'సంపాదన'లేదు. కావ్యాలు, పురాణాలు చదువుతూ, పద్యాలు వల్లిస్తూ కాలం గడిపేవాడు. మొదట్లో వారికి చిన్నపాటి ఆస్తులేవో ఉండినై గానీ, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్లు, రాను రాను పేదరికం చుట్టుకున్నది వాళ్లని.

ఒకరోజు వాళ్ల చిన్నపాప లలితకు తీవ్రమైన జబ్బు చేసింది. వైద్యానికి చేతిలో డబ్బులు లేఫు. వైద్యులు ఖరీదైన వైద్యం సూచించారు. ప్రాణపాయ స్థితి! చివరికి దుర్గ తన తాళిబొట్టు అమ్మి లలితను బ్రతికించుకోవలసి వచ్చింది. దాంతో చలించి పోయాడు భవానిదాసు- "దుర్గా! ఇన్నాళ్ళూ నేను ఇంటిని పట్టించుకోలేదు. నన్ను క్షమించు. నా కళ్ళు తెరచుకున్నాయి.

ఇప్పుడే రాజుగారి దగ్గరకు వెళ్తాను. నా కావ్యాలను చూపించి, మన సంసారానికి కావలసినంత ధనం తీసుకువస్తాను. నువ్వేమీ దిగులుపడకు" అంటూ ఓదార్చి, రాజుగారి ఆస్థానానికి బయలు దేరాడు.

అయితే రాజుగారి కోట ముందున్న కావలివాళ్ళు అతన్ని ఆపేసారు. "అయ్యా! నేను భవానిదాసు కవిని! రాజుగారి దర్శనం కోసం వచ్చాను. దయ ఉంచి వారి దర్శనం చేసుకోనివ్వండి" అంటూ ప్రార్థించాడు.

"పంచె కట్టిన ప్రతి వాడు కవే! నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకునేది, 'నాలాంటి పండితుడు లేడు' అని విర్రవీగుతూ రాజుగారి దగ్గరికి వచ్చేది! పో పోవయ్యా!" సుబ్బయ్య అనే భటుడు అన్నాడు.

"ఓ దాసూ! యవ్వనంలో ఉన్నావు. శుభ్రంగా పని పాటలు చేసుకోకుండా, ఈ కవిత్వం పిచ్చి నీకెందుకయ్యా! కవిత్వం కూడు పెడుతుందా, గుడ్డనిస్తుందా?" వీరయ్య అనే భటుడు ఇంకొకడు హితబోధ చేశాడు.

"ఈ భవానిదాసు అంటే ఏమనుకుంటున్నారు. రాజుగారు నాకు గండపెండేరం తొడిగి, ఏనుగు మీద ఊరేగిస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు- కవిత్వం విలువ ఏంటో!" చెప్పాడు దాసు.

"సరేగాని, నిన్ను పోనిస్తే మాకేం‌ లాభం చెప్పు?" అన్నాడు సుబ్బయ్య.

"రాజుగారు నాకిచ్చిన దానిలో కాస్తో కూస్తో యిస్తాలే!"

"అబ్బే అలా కుదరదు. రాజుగారు నీకిచ్చే బహుమతిలో నాలుగో వంతునాకు, నాలుగోవంతు అతనికి యివ్వు. మిగతా సగం నీకు" వీరయ్య చెప్పాడు పరిష్కారం.

గత్యంతరం లేక, భవానిదాసు అందుకు ఒప్పుకుని లోనికి ప్రవేశించాడు.

విక్రమవర్మ మహారాజులవారు గొప్ప రసజ్ఞులు. అనేకమంది కవులను, కళారులను ఆయన పోషిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ అన్ని వేళలా కవులు, పండితులు, కళాకారులు ఉంటారు. విక్రమవర్మ 'రామశర్మ' అనే పేరొందిన కవి రచించిన కావ్యాన్ని ఆస్వాదిస్తుండగా భవానిదాసు సభలోనికి ప్రవేశ పెట్టబడ్డాడు. కావ్యగానం అయింతర్వాత విక్రమవర్మ అడిగాడు.

"తమరు ఎవరు? ఏ పనిమీద వచ్చారు?"

"మహాప్రభూ! నేను ఒక చిన్న కవిని, భవానిదాసు నామధేయుడ్ని! చిన్నప్పటి నుండి కవిత్వం రాయడమే వృత్తిగా పెట్టుకున్న వాడిని. తమరికి నా కవిత్వం వినిపిద్దామని వచ్చాను" వినయంగా చెప్పాడు.

"ఓహో. రాయటం కాక మరేమి చేస్తుంటారు?" అడిగాడు మంత్రి.

"ఇంకో వృత్తి అంటూ వేరే ఏదీ లేదండి. రచనయే నా వృత్తి, ప్రవృత్తీనీ" చెప్పాడు భవానిదాసు.

"ఎంత దాకా చదువుకున్నావు?" మంత్రి అడిగాడు.

"మహారాజా! మా గ్రామంలో విద్యా సౌకర్యాలు అంతంత మాత్రమే. నేను రామాయణ భారత పురాణాలు మాత్రం చదువుకున్నాను. గొప్ప గొప్ప కవుల గ్రంథాలు మాకు అలభ్యం!" సిగ్గుపడుతూ చెప్పాడు భవానిదాసు.

"మహారాజా! వీడెవడో మూర్ఖునిలా ఉన్నాడు. చదువుకొనలేదట; కవి పండితుల రచనలు, కావ్యాలు చదవనే లేదట; తాను మాత్రం కవిత్వం రాస్తాడట. కూపస్థ మండూకం అన్నమాట. తాను రాసిందే గొప్ప కవిత్వం!" ఆస్థానకవి పుల్లయ్య అన్నాడు పుల్ల విరుపుగా.

"మన్నించాలి మహారాజా! కవిత్వం రాయడానికి అమ్మవారి దయ, అభినివేశం, స్పందించే హృదయం ఉంటేచాలు. గొప్ప కవుల కావ్యాలు చదవకపోయినా చక్కటి-చిక్కటి కవిత్వం రాయవచ్చు" సమర్థించుకున్నాడు భవానిదాసు.

"అయితే నీ కవిత్వం ప్రయోగం మా మీదే మొదలెడతావా?" విక్రమవర్మ భయపడుతూ అడిగాడు.

"వద్దు వద్దు. మహారాజు గార్కి ఎన్నో పనులున్నాయి. వారి ఆరోగ్యం మాకు మహాభాగ్యం. కాబట్టి ఇతగాడి కవిత్వాన్ని ముందుగా మా పండిత బృందానికి వినిపించమనండి. అతడి కవిత్వంలో 'నస లేదు; పస ఉంది' అని మేము భావిస్తే, అప్పుడు అతన్ని తమ ముందుకు తెస్తాం " అన్నాడు కవి పుల్లయ్య.

మంత్రికి అది నచ్చింది. "అవును ప్రభూ! అడ్డమైన చెత్తాచెదారం తమ చెవిన ఎందుకు పడాలి? మన పండితులు ఇతడి కవిత్వాన్ని కాచి వడబోస్తారు. ఆణిముత్యాలనే తమకు వినిపింప చేస్తారు" మంత్రి చెప్పాడు.

విక్రమవర్మ అందుకు సమ్మతించాడు.

ఆ రకంగా భవానిదాసు ఒక పండిత ప్రాంగణంలో ముందస్తుగా తన కవిత్వం వినిపించాల్సి వచ్చింది కొన్ని రోజులపాటు. రోజూ అతను తాళపత్రాలు తీసి చదవడం, దానిపైన ఎవరో ఒకరు ఏదో ఒక వ్యాఖ్య చేయడం జరుగుతున్నది.

"అరే! ఇది కాళిదాసు కావ్యంలోని ఫలానా ప్రకరణానికి అనుకరణ కదూ!" అని ఒక పండితుడంటాడు.

"ఈ కథ మూలం సంస్కృతంలో ఉంది. దీన్ని నువ్వు కొత్తగా రాసిందేముంది?" అని ఇంకో పండితుడంటాడు.

"భవానీ! నీ కవిత్వంలో ఛందో దోషాలున్నాయి. వ్యాకరణం సరిగాలేదు" ఒక వైయాకరిణుడు అంటాడు.

"అరే ఇదేం కవిత్వమయ్యా! చాలా నీరసంగా ఉంది" ఒక కవి.

"చూడు దాసూ! కవిత్వం వింటే మనసు ఎగిరి గంతులెయ్యాలి. వయసు తగ్గి, యవ్వనం ఉరకలు వెయ్యాలి. ఇలా ముసలి వాసనలు రాకూడదు" అన్నాడు పుల్లయ్య కవి, భవానీ కవిత్వాన్ని తీసి పడేస్తూ.

చివరికి భవానిదాసు కళ్లనీళ్ల పర్యంతం అయినాడు "మహానుభావులారా! బుద్ధిలేక ఇక్కడికి వచ్చాను. ఎలాగూ వచ్చాను; రాజుగారికి నా కవిత్వం వినిపించకుండా పోతే నా పరువు పోతుంది. అందుకని నాకు ఒక్క అవకాశం ఇప్పించండి. ఆయన నాకిచ్చే బహుమానంలో సగం మీకిస్తాను" అన్నాడు.

ఇది పండితులకు, కవులకు నచ్చింది. మరుసటి రోజున రాజుగారి దగ్గరికి ప్రవేశ పెడతామన్నారు.

భవానిదాసు ఆ రోజు రాత్రల్లా మేలుకొని ఒక తిట్టు కవిత్వాన్ని రచించాడు. అది అంతా ఆక్షేపణ కవిత్వం; రాజులను, సిరిగలవారిని నిరసించే కవిత్వం. బీదలపాట్లు వారికి తెలియవని, పేదల శ్రమశక్తిని రాజులు దోచుకు తింటున్నారని, రాజులు తమ స్వార్థం కోసం యుద్ధాలు చేయిస్తుంటే వాటిలో పాల్గొని సామాన్య ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, రాజులు విలాస జీవితం గడుపుతూ ప్రజల ఉసురుపోసుకుంటున్నారని రాసి, దాన్నంతా తీసుకెళ్ళి రాజుగారి ముందు సభలో చదివాడు.

విక్రమవర్మ మొహం నల్లబడిపోయింది.

పండితులు మొహాలు వాడిపోయాయి.

కవులు కంగారు పడిపోయారు.

"ఓరీ భవానిదాసు! నన్ను ఆక్షేపించేందుకు నీకెన్ని గుండెలు?! కవి పక్షపాతిని కాబట్టి, నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను- చిన్న శిక్షతో. ఎవరక్కడ?! వీడికి నూరు కొరడాదెబ్బలు ప్రసాదించండి. కొరడా దెబ్బలు తిన్నాక వీడిని గాడిదనెక్కించి మన పొలిమేరలు దాటించండి" కఠినంగా తీర్మానించారు విక్రమవర్మవారు.

"క్షమించాలి మహారాజా! మీరిచ్చే బహుమానానికి నేనొక్కడినే అర్హుడిని కాను. నాకిచ్చే దానిలో సగం ఈ పండితులకు, కవులకు ఇస్తానని వాగ్దానం చేశాను. అలాగే నాలుగో వంతు తమ ద్వారపాలకులయిన సుబ్బయ్య, వీరయ్యలకు ఇస్తానని మాట ఇచ్చాను. కాబట్టి మీరిచ్చే ఈ బహుమానాన్ని వీరందరికీ ధర్మంగా పంచండి" అంటూ పాదాలమీద వ్రాలాడు భవానిదాసు.

విక్రమవర్మ, మంత్రి అయోమయంలో పడిపోయారు.

'ఇదే సరియైన సమయం' అని ఎంచిన భవానిదాసు విక్రమవర్మ గురించి ఆశువుగా, అనర్గళంగా వంద పద్యాలు చదివాడు. ఆయన్ని ఇంద్రుడితోటి, చంద్రుడితోటి, విక్రమార్క మహారాజుతోటీ పోల్చి, తన కవిత్వంతో ఆకాశానికి ఎక్కించాడు. అతని కవిత్వం మృదు మధురంగా, స్వచ్ఛంగా, ఉపమాది అలంకారాలతో అమితంగా శోభిల్లింది. కవితాగానంలో కూడా సిద్ధహస్తుడైన భవానీ పద్యాలు విక్రమవర్మను ఇట్టే ఆకర్షించాయి. ఆయన సంతోషాన్ని చూసిన సభికులు కార్యక్రమాన్నంతా తమ చప్పట్లతో మారు మ్రోగించి రక్తి కట్టించారు.

"మంత్రిగారూ! ఈ భవానిదాసుకు విధించిన శిక్షను ఏం చేయాలి?" అన్నాడు పునరాలోచనలో, విక్రమవర్మ.

"తప్పకుండా అమలు పరచాల్సిందే! అతని తోటివారికి ఎవరి భాగాలు వారికి ఇవ్వాల్సిందే" మహామంత్రి తేల్చి చెప్పాడు, పండితులను, కవులను, భటులను చూస్తూ.

మహారాజుల వారు తలారిని పిలిపించారు. కొరడా తెప్పించారు. కవి పండితులు భయంతో గజగజ వణికిపోతున్నారు. సుబ్బయ్య, వీరయ్యలు తలలొంచుకుని నిల్చున్నారు.

"మహారాజా! మన్నించండి! కవికి కవే శత్రువు! ఎవరు ఎంత బాగా రాసినా సమ కాలికులైన తోటి కవులు వారిని మెచ్చరు. కాళిదాసును కూడ విమర్శించారట. భవభూతిని కూడ వదిలిపెట్టలేదట! అలాగే పోతన కవిత్వాన్ని ఎంతో మంది నిరసించారట, మొల్ల రామాయణాన్ని కూడ హేళన చేశారట! కానీ ఆ కావ్యాలన్నీ కాలానికి నిలిచాయి. కువిమర్శల ధాటికి తాళలేక, సున్నిత మనస్కులైన కవులు ఎందరో తమ తదుపరి జీవితాలలో ఘంటం పట్టలేదు! కొంత మంది మహాకవులు తమ కావ్యాలను అగ్నికి ఆహుతి చేశారు!

కవి కవిత్వానికి గీటురాయి విమర్శకులు, పండితులు, తోటి కవులు కాదు. కేవలం పాఠకులే కవికి నిజమైన భుజకీర్తులు! పాఠకులు ఆదరించిన కవిత్వమే కవిత్వం! అసూయా ద్వేషాలతో విమర్శించే విమర్శకులని, పండితులను పట్టించుకోకూడదు.

మీవంటి రసజ్ఞులకు- నా బోటి కవులకు మధ్య ఎన్ని అవాంతరాలున్నాయో గ్రహించాలనే నేను ఇలా సాహసించాను. నన్ను, నాతోపాటు వీరందరినీ కూడా క్షమించాలి" అంటూ వినయంగా చెప్పాడు భవానిదాసు. తన కావ్యాలను బయట పెడుతూ.

అటుపైన విక్రమవర్మ భవానిదాసు కవనాన్నంతా శ్రద్ధగా విన్నాడు. అతని కవిత్వాన్ని మెచ్చుకొని అతన్ని ఘనంగా సన్మానించాడు. అతని దారిద్ర్యాన్ని పారద్రోలాడు.