ఇక ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళంతా తమ ప్రాణాలు కాపాడిన క్వేకుజిన్‌ని చాలా గౌరవంగా చూడటం మొదలు పెట్టారు. ఎవర్ని చూసినా క్వేకుజిన్‌ని మెచ్చుకునే-వాళ్ళే: అందరూ కాదు లెండి- ఒక్కడు తప్పిస్తే అందరూ. వాడెవరో తెలుసా? అనాన్సీ! అనాన్సీకి ఒక్కడికీ తన కొడుకు ఇట్లా తనకంటే గొప్ప పేరు సంపాదించుకోవటం ఏమాత్రం నచ్చలేదు. "నాకే గనక అట్లాంటి డప్పు ఉంటే నేను క్షణంలో‌ ధనికుడినైపోదును!" అనుకుని అతను దహించుకు పోయాడు.

కొడుకుకు మంచిపేరు వస్తే తనకీ వచ్చినట్లే కదా, కొడుకుకు వచ్చిన సంపద తనకీ‌ వచ్చినట్లే కదా? అయినా అసూయ ఎట్లా ఉంటుందో చూడండి- ప్రతిరోజూ అనాన్సీ కొడుకుని పీడించుకొని తినటం మొదలు పెట్టాడు: "నీకు ఈ డప్పు ఎట్లా దొరికింది చెప్పు!" అని.

"రేపు చెప్తాను- ఎల్లుండి చెప్తాను- మళ్ళీ చెప్తాను" ఇట్లా చాలా రోజులు తప్పించుకున్నాడు క్వేకుజిన్.

అయినా పిల్లవాడు కదా, పంతం వీడని తండ్రికి ఒక రోజున లొంగే పోయాడు. "భూమి అడుగున ఉండే ముసలమ్మ కథ అంతా చెప్పేశాడు. అంతే కాదు, వాడు అనాన్సీకి చెట్టుబొరియ కూడా చూపించేశాడు!

మరుక్షణం అనాన్సీ బొరియలోంచి లోనికి దూకేశాడు! అంతకుముందు క్వేకుజిన్ తిరిగినట్లుగానే అనాన్సీ కూడా ఊరంతా తిరుగుతూ "ఎవరది? ఎవరున్నారు, ఇక్కడ?" అంటూ అరిచాడు.

చివరికి అతనికి తోటలో కూర్చున్న ముసలమ్మ కనబడనే కనబడింది. అనాన్సీ ఆమె దగ్గరకు పోతూనే మొరటగా "ఓ ముసలమ్మా! లే! ఇంకా దేనికోసం చూస్తున్నావు? నాకు అవతల చాలా పని ఉంది. తొందరగా తినేందుకు ఏదైనా పెట్టు!" అన్నాడు.

ముసలవ్వ సన్నగా నవ్వుతూ "ఇంటి వెనకున్న తోటలోకి పో, నాయనా! అక్కడున్న చిలకడ దుంపల కయ్యలోకి పో. ఆ చిలకడ దుంపలు ఏమంటున్నాయో జాగ్రత్తగా విను: "నన్ను తవ్వి తీసుకెళ్లు!" అని ప్రాధేయపడే వాటిని అసలు ముట్టుకోకు. అట్లా కాక "నన్నేం చేయకు- నన్ను తవ్వకు" అని మొత్తుకునే చిలకడ దుంపలు కనబడగానే వాటిని త్రవ్వి నా దగ్గరికి తీసుకురా" అన్నది.

అయితే అనాన్సీ చాలా అనుమానస్తుడు. "నాకేమైనా తిక్క అనుకుంటున్నావా, ఓ ముసలి తొక్కూ?! నీ మాయలన్నీ నాకు తెలుసు! 'నన్ను పీకకు' అని మొత్తుకునే చిలకడ దుంపని పీకానంటే నాకు ఏదో తెలీని నష్టం జరిగిపోతుంది- అదే కదూ, నీ పథకం? నువ్వు నన్ను మోసం చేయలేవు!" అనుకుంటూ తోటలోకి పోయాడు.

అతన్ని చూడగానే చాలా చిలకడ దుంపలు "రా! నన్ను త్రవ్వి తీసుకెళ్లు!" అని అరవటం మొదలెట్టాయి. వాటిలో‌ తన చేతికందిన ఓ నాలుగైదింటిని పీకి ముసలమ్మ దగ్గరికి పోయాడు అనాన్సీ.

ముసలమ్మ దానిని గమనించనట్లే చూసింది. అంతకు ముందు క్వేకుజిన్‌కు చెప్పినట్లే ఇతనికి కూడా "ఆ దుంపని వొలిచెయ్యి. చెక్కునేమో కుండలో వేసి వండు, లోపల ఉన్న తెల్లటి గుజ్జులాంటి భాగాన్ని పారేయ్" అని చెప్పింది.

"ఎంత తెలివి తక్కువ పని!" అనుకున్నాడు అనాన్సి. "ఎవరైనా తొక్కలు తిని గుజ్జులు పారేస్తారా?!" అని అతను ముసలమ్మ చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు.

అతను వండే సరికి చిలకడ దుంప లోపల భాగమంతా బండరాయి లాగా గట్టిపడింది. అయినా అతను దానినే తెచ్చి ముసలమ్మ ఇచ్చి తినమన్నాడు.

"అటు తిరిగి నిలబడు! నేను తింటున్నప్పుడు నాకేసి చూడకు!" అన్నది ముసలమ్మ.

కానీ మొరటు అనాన్సీ ఏమన్నాడో తెలుసా? "నువ్వు బండరాయిని తింటూంటే చూసి కడపారా నవ్వకపోతే ఇంక నేను ఇక్కడి కొచ్చి ఏం ప్రయోజనం?" అని అవ్వకేసే చూస్తూ నిలబడ్డాడు!

అవ్వ ఆ రాళ్ళని కరకరా నమిలి తినేసి, గట్టిగా త్రేన్చుతూ "ఆ, ఇప్పుడు పో, మళ్లీ తోటలోకి! అక్కడ నుండి డప్పును తీసుకురా! అయితే ఆ డప్పు "డిబ్ డబ్ అనాలి, డబ్ డిబ్ అనకూడదు" అన్నది.

"డిబ్ డబ్ అట! అట్లా అంటుందా, ఏ డప్పు అయినా? అసలు అదేం డప్పు?!" అని అనాన్సీ పోయి "డబ్ డిబ్" అనే డప్పునే పట్టుకొచ్చాడు.

అవ్వ దానిని చూసి "సరే ఇంక దీన్ని మీ ఊరికి తీసుకుపో- నీకు అవసరమున్నప్పుడు ఈ డప్పును వాయించు-" అని ఇంకేమో‌ చెప్పబోయింది.

అయితే ఆనాన్సీ ఆమె చెప్పబోతున్నదేమిటో అసలు విననే లేదు- "అదీ, ఇప్పుడు చెప్పావు అసలైన మాట!" అని గంతులు వేసి, ముసలమ్మ చేతిలోంచి డప్పును లాక్కొని, ఆమెకు కనీసం వెళ్ళొస్తానని కూడా‌ చెప్పకుండా కాకర తీగ దగ్గరికి పరుగెత్తాడు. దాన్ని పట్టుకొని చకచకా పైకి ఎగబ్రాకి వాళ్ల ఊరికి పరుగుపెట్టాడు!

"ఇప్పుడు చెప్తా- ఈ క్వేకుజిన్ గాడి సంగతి! వాడు గొప్పో నేను గొప్పో తెలియాలి, ఈ ఊర్లో వాళ్ల కందరికీ" అని వాడు ఊర్లో వాళ్లందరినీ ఒకచోటికి పిలిచి, వాళ్ళందరి ముందు గొప్పగా డప్పు కొట్టడం మొదలెట్టాడు.

అయితే ఈసారి వంటలు, అన్నం ప్రత్యక్షం కాలేదు, కొంచెం కూడా! చిన్న చిన్న రొట్టె ముక్కలు కూడా రాలేదు- వాటి బదులు భయంకరమైన కౄరమృగాలు- అసలు మనుషులు ఏనాడు చూసి ఉండనివన్నీ- ఎక్కడెక్కడి నుండో పుట్టుకొచ్చాయి! సింహాలు, పులులు, మొసళ్లు, ఖడ్గ మృగాలు, అనేక రంగుల పాములు, ఒళ్లు గగుర్పొడిచే భయంకర మృగాలు అన్నీ బయలుదేరి వచ్చి గ్రామస్థుల మీదికి దూకాయి!!

జనాలంతా హాహాకారాలు చేస్తూ ఎవరి తోచిన దిక్కుకు వాళ్లు పరుగు తీసారు. అందరూ అనాన్సీని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఆ జంతువుల నుండి తప్పించుకునేందుకు దగ్గర్లో కనబడిన చెట్టునొకదాన్ని ఎక్కి కూర్చున్నాడు అనాన్సీ. అయినా ఆ జంతువులు అతన్ని వదల లేదు. అన్నీ చెట్టు చుట్టూ మూగాయి. వాటిలో కొన్ని చెట్టెక్కేందుకు పూనుకున్నాయి.

దాంతో అనాన్సీ భయపడి, ఒక చెట్టునుండి మరొక చెట్టుకు దూక్కుంటూ పోయి, అడవిలోకి దూరాడు.

జంతువులన్నీ అతన్ని వెంబడిస్తూ అడవిలోకి పోయాయి. మరి ఆ తర్వాత అనాన్సీ ఏమయ్యాడో- ఎవ్వరికీ తెలీదు.

ఆ రకంగా అనాన్సీ మొండితనం వల్ల, తిక్కవల్ల, ఎక్కడా లేని పాములకు, కౄర జంతువులకు ఈ ప్రపంచంలో తావు లభించింది! (అయిపోయింది)