రాయల చెరువు బడిలో పదోతరగతి చదువుతున్నది లక్ష్మి. లక్ష్మి తెలివి గల పిల్ల. ప్రతిరోజూ బడికి వెళ్లటమే కాదు- టీచర్లు ఇంకా చెప్పని పాఠాలన్నీ కూడా సొంతగా నేర్చుకొని వచ్చేది. నోట్సులన్నీ ముందుగానే రాసేది. ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినేది. తన క్లాసులో ఆ అమ్మాయే ఫస్టు- ఏ పరీక్షలోనైనా తనే ముందు ఉండేది; ఏ ప్రశ్న‌ అడిగినా జవాబు చెప్పేది.

లక్ష్మి తల్లిదండ్రులకు తను ఒక్కతే కూతురు. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. తనకు ఏవైనా కావాలంటే 'లేదు' అనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రులు ఏవైనా కష్టాలలో ఉన్నారంటే ఆ అమ్మాయి కూడా సహాయం చేసేది. తండ్రి అప్పుడప్పుడూ ఇచ్చే డబ్బుల్ని ఖర్చు చేయకుండా దాచుకొని, చదువులకోసం పొదుపుగా వాడేది.

అలాంటి మంచి అమ్మాయికి ఎంత కష్టం ఎదురయ్యిందో, తలచుకుంటేనే బాధ వేస్తుంది. లక్ష్మి వాళ్ల నాన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఒకరోజున బరువైన ఇనుప సామాను ఒకటి వచ్చి కాలు మీద పడింది. దాంతో ఆయన కుడి కాలు విరిగింది. ఫ్యాక్టరీ యజమానులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు- అయితే సంవత్సరం పాటు ఆయన కాలు క్రింద పెట్టగూడదన్నారు డాక్టర్లు. కానీ‌ ఇక కుటుంబం గడిచేదెలాగ?

ఆనాటి వరకూ లక్ష్మి వాళ్ళ కుటుంబంలో నాన్న మాత్రమే పనికి వెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ ప్రధాన బాధ్యత వహించాల్సి వచ్చింది. ఆమెతోబాటు లక్ష్మి కూడా పనికి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందంతా రోజూ బడికి వెళ్లే అమ్మాయి- ఇప్పుడు ఒకరోజు వెళ్తే మూడు రోజులు బడి మానేయవలసి వచ్చింది. దానికి తోడు విచారం! లక్ష్మి చిక్కి సగమైంది. అయినా ఆ పాప తన కష్టాలను ఎవ్వరితోటీ చెప్పుకోలేదు.

అయితే లక్ష్మి వాళ్లకు జంతుశాస్త్రం బోధించే సురేష్ అయ్యవారు ఆ పాపలో మార్పును గమనించారు. ఒకరోజు సాయంత్రం ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి "ఎందుకమ్మా, ఇదివరకు అంత చలాకీగా ఉండేదానివి, ఇలా నీరసించి పోతున్నావెందుకు? బడికి కూడా సరిగ్గా రావట్లేదు ఈ మధ్య? ఏమైంది?" అని అడిగాడు.

దాంతో లక్ష్మి ఏడ్చుకుంటూ నిజం చెప్పేసింది. ఆ పాప చెప్పింది విని మాష్టారు చాలా బాధపడ్డారు. "నీకేమీ పరవాలేదు తల్లీ, నేను ఏదో ఒకటి చేస్తాను. మీ ఇంటికి వచ్చి మాట్లాడతానులే, బాధపడకు" అని, వాళ్ల ఇంటికి వెళ్ళి లక్ష్మి అమ్మ నాన్నల్ని పలకరించారు.

"చూడండి, కుటుంబపు వాస్తవ పరిస్థితులు పిల్లలకు తెలిస్తూ ఉండేట్లు చూడాలి తల్లిదండ్రులు- అయితే ఆ జ్ఞానం వాళ్ల భవిష్యత్తును పాడు చేసేదిగా ఉండకూడదు.

మీరు వచ్చే సంవత్సరానికి ఎలాగూ బాగైపోతారు; మళ్ళీ ఇల్లు చక్కగా నడిపిస్తారు. దానికోసం‌ ఆ పాప పదోతరగతి పోగొట్టుకుంటే ఎలాగ?

మీ కుటుంబానికి నెల ఖర్చు ఎంత అవుతుంది? సంవత్సరం పాటు ఆ డబ్బు నేను ఇస్తాను- మీకు వీలైనప్పుడు నాకు తిరిగి ఇద్దురు- ఇప్పుడు మటుకు ఆ పాపని బాగా చదువుకోనివ్వండి!" అని చెప్పారు వాళ్లకి.

అలా లక్ష్మి మళ్ళీ బడికి బాగా రాగలిగింది; చక్కగా చదువుకోగలిగింది; పదోతరగతిలో జిల్లాలో మొదటి స్థానంలో నిల్చింది. సురేష్ అయ్యవారి ప్రోత్సాహంతో గురుకుల విద్యాలయ పరీక్ష రాసి సీటు తెచ్చుకున్నది. నాగార్జున సాగర్ కాలేజీలో చేరి, అక్కడ కూడా మొదటి స్థానంలో నిలిచింది!

ఆ సరికి లక్ష్మివాళ్ల నాన్న కాలు కుదురుకున్నది. ఆయన మళ్ళీ పనిలో చేరాడు. కుటుంబం ఒక దారిన పడింది మళ్ళీ. లక్ష్మి బాగా చదువుకొని డాక్టరు అయ్యింది. ప్రభుత్వ డాక్టరుగా తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించటమే కాక, పల్లె ప్రజల కష్టాలు తెలిసినది కనుక మానవత్వంతో ప్రవర్తిస్తూ వచ్చింది.

చాలామంది పిల్లలకు చదువుల్లో సందేహాలు తీర్చింది, ఇతరత్రా సాయం చేసింది. చాలామందికి ఉచితంగా వైద్యం చేసింది. తమ కుటుంబానికి సురేష్ అయ్యవారు చేసిన సాయాన్ని ఆమె ప్రతిరోజూ గుర్తుచేసుకునేది. "ఒకరికి చేసిన సాయం ఊరికే పోదు" అని అందరికీ చెబుతుండేది.

ఒకసారి డ్యూటీ అయిపోయాక, ఇంటికి పోయేందుకు సిద్ధమైన సమయంలో ఒక యాక్సిడెంటు కేసు వచ్చింది. చూడగా ఆ పేషెంట్ ఎవరో కాదు- సురేష్ అయ్యవారు!

'ఆయనకు ప్రమాదం జరిగిందే' అని లక్ష్మికి బాధకలిగినా, తన చదువు ఆయనకు ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు సంతృప్తి కూడా కలిగింది. ఆయనకు గొప్ప వైద్యసేవలు లభించేట్లు చూడటమే కాక, ఆయన కోలుకునేంత వరకూ ఆమె ఆయన్ని దగ్గరుండి చూసుకున్నది!

బాగై వెళ్తూ తనకు కృతజ్ఞతలు చెప్పిన అయ్యవారి కాళ్లకు నమస్కరిస్తూ "ఇదంగా మీరు నాకు చేసిన సాయం. నేను మీ స్ఫూర్తిని నిలబెడతాను- నాలాంటివారికి అనేకమందికి సాయం చేస్తాను" అని మాట ఇచ్చింది.