అనగనగా ఒక అడవిలో గొప్పలు చెప్పుకునే నక్క ఒకటి ఉండేది. అది ఒట్టి డుస్సుది- నిజంగా దానికి ఏమీ తెలివి లేదు; కానీ ఊరికే తెలివైనదాని లాగా పోజులు పెడుతూ‌ తిరిగేది.

ఆ అడవిలోనే పిల్లి ఒకటి ఉండేది. నిజానికి అది చాలా తెలివైనది. బ్రతికేందుకు కావలసిన తెలివితేటలు దాని దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కానీ నక్క ఎప్పుడూ దాన్ని తక్కువ చేసి మాట్లాడుతుండేది, అయినా అది ఏమీ అనేది కాదు.

ఒక రోజున అది నక్కతో అన్నది- "మామా! నా చెవులు ఎందుకనో ఈరోజున బాగా వణుకుతున్నాయి- సాధారణంగా వేట కుక్కలు రాగానే నాకు ఇట్లా అవుతుంటుంది. ఈ వేటకుక్కలు మహా ప్రమాదం; వాటి కంట పడ్డామంటే ఇక తప్పించుకునే అవకాశమే ఉండదు!" అని.

"ఆఁ, వాటికి అంత సీను లేదులే" అన్నది నక్క."నేను వాటి పెద్దన్నను కదా, అందుకని అసలు అవి నన్ను ఏమీ చెయ్యవు. ఒకవేళ ఆ సంగతి తెలీక ఏవైనా నా మీదికి వచ్చినా, వాటి నుండి తప్పించుకునే ఉపాయాలు నా దగ్గర కొల్లలు ఉన్నాయి. అయినా ఓ సంగతి చెప్పనా, నీబోటి చిన్న ప్రాణులు ఊరికే భయపడుతుంటాయి- ఎంత చెప్పినా వినవేమిటో మరి! భయాన్ని పోగొట్టుకునే మార్గాలు ఎవరైనా పెద్దలను అడిగి తెలుసుకోవాలి; వాటిని నిలకడగా సాధన చేయాలి- ఏమున్నది?! కుక్కలకు భయపడతారా, ఎవరైనా?!" అని నవ్వింది.

"ఆ ఉపాయాలేవో కొంచెం నాకూ నేర్పించు మామా, నీకు పుణ్యం ఉంటుంది! కుక్కల భయంతో చచ్చిపోతున్నాను" అన్నది పిల్లి, ఏడుపు ముఖం పెట్టుకొని.

"వీలు చిక్కినప్పుడు తప్పకుండా నేర్పిస్తాను. అయినా నాకు ఈమధ్య ఏమంత ఖాళీ దొరకటం‌లేదు. కొంచెం సమయం‌ చిక్కితే, అప్పుడు నేర్పిస్తాను" అన్నది నక్క గొప్పగా.

సరిగ్గా ఆ సమయంలో హటాత్తుగా ఊడి-పడ్డాయి వేటకుక్కలు! క్షణంలో అవి నక్కను, పిల్లిని చుట్టు ముట్టి గుర్రు గుర్రు మంటూ మీదికి రాసాగాయి!

ఇక పిల్లి అరక్షణం కూడా ఆలోచించలేదు- క్రిందికి వాలిన కొమ్మనొకదాన్ని పట్టుకొని చక చకా ఓ చెట్టుమీదికి ఎగబ్రాకింది. 'తనకు తెలిసిన వంద ఉపాయాల్లో ఇప్పుడు దేన్ని ప్రయోగించాలి?' అని ఆలోచిస్తూ నిలబడ్డ నక్క మటుకు వేటకుక్కల పాలైంది.

ఒక్క ఉదుటున దానిమీదికి దూకిన కుక్కలు అది తమ పెద్దన్న అని కూడా తలచక, దాడి చేసి చంపేశాయి!