రాయవరం అనే ఊళ్ళో సరోజ, రామరాజు అనే దంపతులు నివసించేవాళ్ళు. వాళ్ళు బాగా ఆస్తిపరులు; ధనవంతులు. వాళ్ళకు ఉన్నదల్లా ఒకే ఒక్క కొరత- పిల్లలు లేరు అనేది.

పిల్లలకోసం ఎన్నో గుళ్లు గోపురాలు, వ్రతాలు, నోములు, డాక్టర్లు- అంతా అయ్యాక, చాలా కాలానికి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి సోమరాజు అని పేరు పెట్టుకొని, ఎంతో గారాబంగా పెంచసాగారు వాళ్ళు.

లేకలేక పుట్టిన కొడుకు అనేమో, వాడిని సరోజ అస్సలు ఎండలో తిరగనిచ్చేది కాదు. ఎప్పుడూ ఎసి గదిలోనే ఉంచేది. 'కాళ్ళకు మట్టి అంటితే ఎలాగ?' అని వాడుండే గదిలో ఎప్పుడూ తివాచీ పరచి ఉంచేది. వాడికి ఇంట్లో వేసుకునేందుకు చెప్పులు, ఊళ్ళోకి చెప్పులు, పట్టణానికి చెప్పులు- ఇట్లా అన్నిటికీ వేరు వేరు చెప్పులు ఉండేవి. రోడ్డుమీద దుకాణాల్లో కనిపించిన వస్తువల్లా కావాలనేవాడు వాడు; కాదనకుండా వాటిని కొనిపెట్టేది సరోజ.

"ఇట్లా చేస్తే పిల్లలు మొద్దుబారిపోతారమ్మా" అని ఎవరు చెప్పినా సరోజకు కోపం వచ్చేది. "నా కొడుకు, నా యిష్టం" అని అరిచేది. వాడు కొంచెం‌ పెద్ద అవగానే వాడిని ఒక ఎసి బడిలో చేర్చారు వాళ్ళు. ఆ బడికి వెళ్ళే బస్సు ఎసిది, తరగతి గదులు ఎసివి, ఆఖరుకు బాత్‌రూంలు కూడా ఎసివే! దాంతో వాడి ఆరోగ్యం గందరగోళం అవ్వటమే కాదు; వాడు మొద్దుగా తయారైనాడు; ఏ పనికీ తరం కాకుండా అయ్యాడు.

చూస్తూ చూస్తూండగానే సోమరాజుకు పదహారేళ్ళు వచ్చాయి. వయస్సైతే పెరిగింది కానీ, వాడికి బాధ్యత ఏమీ తెలీలేదు. పరీక్షల్లో అన్నీ సున్నాలే తెచ్చుకునేవాడు. 'ఏమైంది, ఎందుకు అలాగ' అని వాడిని ఎవ్వరూ అడిగేవారే లేరు మరి!

అంతలో వాడు కొత్త డిమాండ్ ఒకటి మొదలు పెట్టాడు- "కోటి రూపాయలు కట్టి నాకు యంబిబియస్ సీటు కొనిపెట్టండి" అని! దాంతో రామరాజు గుండెల్లో రాయి పడింది- "అదేమీ వద్దులేగాని, ముందు నువ్వు ఒక సంవత్సరం ఊళ్ళో ఉండు" అని వాడిని ఊరికి పిల్చుకొచ్చాడు.

ఊరికి వచ్చిన సోమరాజు ఎలాంటివాడో ఒక్క వారం రోజుల్లోనే ఊరంతా తెలిసిపోయింది. అందరూ వాడిని ముద్దుగా సోమరి సోమరాజు అని పిలవటం‌ మొదలు పెట్టారు!

ఇప్పటికి గానీ సరోజకు తను ఎంత తప్పు చేసిందో తెలీలేదు. కానీ చేతులు కాలాయి; ఇప్పుడు ఏం చేయగలదు తను? ఆ సమయంలో రామరాజు మిత్రుడు మూర్తి అనుకోకుండా వాళ్ళ ఊరికి వచ్చాడు. మిత్రుడితో తన గోడు వెళ్ళబోసుకున్నాడు రామరాజు. మూర్తి బాగా ఆలోచించి "పిల్లల్ని అతి గారాబం చెయ్యకూడదురా, ఇప్పుడు చూడు ఎంత కష్టం అవుతున్నదో! కానీ‌ గుండెను రాయి చేసుకోండి; నేను చెప్పినట్లు చెయ్యండి. వాడు బాగు పడతాడు- ఏం పర్లేదు" అని ఒక ఉపాయం చెప్పాడు.

అదే రోజున మూర్తి ఒక లాయర్‌ను వెంట బెట్టుకొని వచ్చాడు- రామరాజు అనుభవిస్తున్న ఇల్లు, ఆస్తి మొత్తం తనదే- అన్నాడు. వాళ్లను ఇంట్లోంచి మొరటుగా బయటికి గెంటించాడు. రామరాజు, సరోజ, సోమరాజు- ముగ్గురూ కట్టుబట్టలతో ఇంటిబయట నిలబడ్డారు. రామరాజు కొడుకుకేసి బాధగా చూస్తూ "నీకు నా విలువ అర్థమైందనుకుంటాను సోమూ. ఇప్పుడిక నేను నీకు ఇవ్వగలిగింది ఇదిగో ఈ వెయ్యి రూపాయలు మాత్రమే.

ఇవి తీసుకెళ్ళి, పట్నంలో నీకు తోచిన పనేదో చూసుకొని బ్రతుక్కో. మా సంగతి వదిలెయ్. మేం ఏదో‌ కూలి చేసుకొని జీవిస్తాం. ఒకసారి నిలద్రొక్కుకున్నాక నువ్వు మళ్ళీ మా గురించి ఆలోచిద్దువు" అని పంపించాడు.

సోమరాజు ఆ డబ్బును తీసుకొని విజయవాడకు వెళ్ళాడు. ఆరోజు సాయంత్రానికే ఆ డబ్బంతా ఖర్చయిపోయింది! ఇప్పుడిక తండ్రికి చెప్పీ ప్రయోజనం లేదు- ఆయన దగ్గర కూడా డబ్బు లేదు!

సోమరాజు తనకు పరిచయం ఉన్న వాళ్ల దగ్గరికి వెళ్లి డబ్బు సాయం అడిగాడు. ఒకరిద్దరు ఇచ్చారు- ఆ డబ్బు అయిపోయాక ఇక అందరూ ముఖం చాటు చేసారు.

వారం రోజుల తర్వాత ఇక సోమరాజు చేత డబ్బు లేక, పని ఏదీ చేతకాక, పస్తులుండటం మొదలుపెట్టాడు. రెండు రోజులు గడిచేసరికి ఆకలి బాధ తెలిసి వచ్చింది. చివరికి ఇది కాదని ఒక హోటల్‌లో పనికి కుదురుకున్నాడు. తినేందుకు వచ్చినవాళ్ళకు టిఫిన్లు అందించటం, మర్యాదగా మాట్లాడటం, హోటల్లోనే తిండి తిని, రాత్రికి పనివాళ్లందరితోబాటు నేలమీదే పడుకోవటం- ఇట్లా నెలరోజులు గడిచాయి.

హోటల్ యజమాని వాడికి నెలజీతం ఇచ్చాడు.

సోమరాజు ఆ డబ్బును ఖర్చు చేయలేదు- దాచి పెట్టుకొని, తండ్రికి ఫోను చేశాడు- "నాన్నా! మీరేం కంగారు పడనక్కర్లేదు- నేను ఓ చిన్న పని చూసుకున్నాను; నెలకు వెయ్యి రూపాయలు జీతం కూడా సంపాదిస్తున్నాను. మీకు అక్కడ కష్టంగా ఉందేమో, డబ్బులు పంపమంటారా?" అని అడిగాడు.

రామరాజు కళ్లనీళ్ళు ఒత్తుకొని, "మన కష్టాలన్నీ‌ తీరినయ్ సోమూ, ఇప్పుడిక నువ్వు ఊరికి వచ్చెయ్యి. మన ఇల్లు, ఆస్తి అన్నీ మనవే అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ కోటి రూపాయలు కట్టైనా సరే, నిన్ను డాక్టరు చదువులు చదివించగలం. వెంటనే వచ్చెయ్యి" అన్నాడు.

సోమరాజు కొద్దిగా ఆలోచించి- "లేదులే నాన్నా, నేను ఇక్కడే కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తాను. మంచి ర్యాంకు తెచ్చుకొని తక్కువ ఖర్చుతో డాక్టరు చదువులు చదువుతాను. డబ్బులతో కొనుక్కున్న చదువూ‌ ఒక చదువేనా?" అన్నాడు.

అనటమే కాదు; మరుసటి సంవత్సరం పరీక్షల్లో వాడు మంచి ర్యాంకు సంపాదించి స్వీయశక్తితో యంబిబియస్ సీటు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఊళ్ళోవాళ్ళు అందరూ అతన్ని డాక్టర్ సోము అంటున్నారు! రామరాజు, సరోజలకే కాదు- అతనిప్పుడు ఊరంతటికీ‌ ఆశాజ్యోతి!