సుబ్బన్న చాకలి దగ్గర చాలా ఏళ్లపాటు వెట్టిచాకిరీ చేస్తూ వచ్చింది, దీర్ఘకర్ణం అనే ఓ గాడిద.

పని చేసీ చేసీ అది అలిసి పోయింది. సుబ్బన్న దాని చేత విపరీతంగా పని చేయించుకునేవాడు. తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. దాని బ్రతుకు అలా దుర్భరం అయిపోయాక, అది ఇట్లా ఆలోచించటం మొదలు పెట్టింది:

"చాకలి సుబ్బన్న యిచ్చే నాలుగు గడ్డిపరకలకు నేను ఎందుకు ఊడిగం చేయాలి? శ్రమ నాది; ఆదాయం వాడిది! నాకు కడుపు నిండా తిండి పెట్టడు; తనేమో తాగి జల్సా చేస్తూ ఉంటాడు! ఎందుకిలాగ? ఈ తేడాను నేను ఎందుకు భరించాలి?" అని, అది మరునాటి రాత్రే కట్లు తెంచుకొని దగ్గర్లోనే ఉన్న నల్లమల అడవులలోకి పారిపోయింది.

అడవిలో ఉన్న గాడిదలు ముందు దీర్ఘకర్ణంకేసి అనుమానంగా చూశాయి. అయితే త్వరలోనే దాని మాటలు విని, దాన్ని అక్కున చేర్చుకున్నాయి. దీర్ఘకర్ణానికి ఇక శుభ్రమైన తిండి, స్వచ్ఛమైన గాలి, తియ్యటి ఏటినీరు దొరికాయి- ఒక్క ఏడాది దాటేసరికి దానికి ఎక్కడ లేని జవసత్వాలు వచ్చాయి.

తోటి గాడిదలన్నిటికీ అది చెప్పేది- "మనిషిని చూసి మనం చాలా నేర్చుకోవాలి! వాళ్లకు ఇప్పుడు రాజులు లేరు: ప్రజాస్వామ్యం వచ్చింది! ప్రజాకర్షణ ఉన్నవాడే నాయకుడు! అంతే తప్ప, జాతివల్లనో, వంశం వల్లనో ఎవ్వరూ నాయకులు కారు. దమ్మున్నవాడిదే రాజ్యం!" అని ఉపన్యాసాలిచ్చేది.

దీర్ఘకర్ణం మాటలు కుర్ర గాడిదల్ని చాలా ఆకర్షించాయి. దాని వాగ్ధాటి వాళ్లందరినీ‌ ఒక ఊపు ఊపింది. తల-తోక నెరిసిన ముసలి గాడిదలు మటుకు దాన్ని పట్టించుకోలేదు.

"ఈ అడవికి రాజు ఎవరు?"దీర్ఘకర్ణం అడిగేది.

"పులిరాజు!" చెప్పింది ఓ కుర్రగాడిద.

"ఎప్పటినుంచి?"

"తెలీదు-"

"నేను చెబుతాను. మా తాత ముత్తాతల కాలంలో ఈ పులిరాజు తాత రాజ్యం చేశాడు. తరువాత ఇతని తండ్రి అధికారం చలాయించాడు. అతడి తదనంతరం ఇప్పటి పులిరాజు రాజ్యమేలుతున్నాడు" చెప్పింది ఓ ముసలి గాడిద.

"అన్యాయం కాదా?! ఇది ఎంత ఘోరమైన అన్యాయమో చూడండి! కొంచెం ఆలోచించండి- ఎప్పుడూ పులిజాతే రాజ్యం ఏలితే, మరి మిగతా జంతువులకు రాజ్యమేలే అవకాశం ఎట్లా వస్తుంది? వాటికి అసలు ఆ అవకాశం ఉండనే ఉండదా? ఎందుకుండదు? ఎక్కడినుండి వచ్చింది ఈ అసమానత్వం?!" ఆవేశపడి పోయింది దీర్ఘకర్ణం.

అన్ని గాడిదలూ మౌనం వహించాయి: చెవులు టపటపలాడించాయి; తోకలతో ఈగలు తోలుకున్నాయి; దిక్కులు చూశాయి. "ఈ అన్యాయాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ సారి మన జాతికి రాజ్యాధికారం దక్కాల్సిందేనని నేను ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాను!" ఘోషించింది దీర్ఘకర్ణం.

గాడిదలన్నీ గుసగుసలు పోయాయి.

చివరికి ఓ పండు ముసలిగాడిద అడిగింది: "నువ్వు చెప్పింది వినడానికి బాగుంది మనవడా! కాని రాజ్యమేలే శక్తి మనకుండాలిగా?! అంత నైపుణ్యం మనకెక్కడినుండి వస్తుంది? పుట్టినప్పటినుండి అణిగిమణిగి సేవలు చేసే వాళ్లం మనం! మనకు అధికారం ఎలా ప్రాప్తిస్తుంది? వచ్చినా రాజ్యమేలేంతటి శక్తియుక్తులున్నవాడు మనలో లేడే!"

దీర్ఘకర్ణం గట్టిగా ఓండ్ర పెట్టి వెనుక కాళ్లతో నేలని తన్నింది: "మన శక్తిని మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం! తెలివిలోను, బలంలోను మనం ఎవరికీ తక్కువ కాదు. కాకపోతే మనం శాంతి కాముకులం- అంతే! అంతెందుకు, నాకు ఒక్కసారి అధికారం యిమ్మనండి- ఈ పులిరాజు కంటే బాగా రాజ్యం చేస్తాను!" చెప్పింది ఆత్మవిశ్వాసంతో.

యువగాడిదలన్నీ అవునంటూ తలలూ-పాయి. "దీర్ఘకర్ణం! మా నాయకుడు!" అని నినాదాలు చేశాయి.

మరునాడు ముసలి గాడిదను తీసుకొని అవన్నీ పులిరాజు దగ్గరకు పోయాయి. ఇన్ని గాడిదలను ఒక్కసారి చూడగానే కాలికి బుద్ధి చెప్పింది నక్క మంత్రి. భల్లూకం సైన్యాధికారి గందరగోళంలో పడింది.

"ఏంటి సంగతి?" అని పులిరాజు గాండ్రించింది. యువగాడిదలన్నీ ఆ గాండ్రింపుకు భయపడ్డాయి. అయినా ఏవీ బయట మాత్రం పడలేదు. ముసలిగాడిద వినయంగా పులిరాజు చెవిలో జరిగినదంతా చెప్పింది.

పులిరాజుకు అదంతా భలే వినోదంగా అనిపించింది. అది చిరునవ్వు నవ్వింది. "ఉట్టికి ఎగర లేనమ్మ, స్వర్గానికి ఎగురుతానన్నదట! రాజమకుటం నిజానికి ఓ ముళ్ల కిరీటం! ఆశలు అందరికీ ఉంటాయి- కలలు కనడంలో తప్పులేదు- కానీ అర్హత లేకుండా అర్రులు జాస్తే? అది మూర్ఖత్వం అవుతుంది" అన్నది.

"అలా ఎందుకనుకుంటావు పులిరాజా! మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడు గదా?! మేం సమర్థులమో, కామో నీకే అర్థమవుతుంది. కాలం మారింది- ఇప్పుడు పుట్టుకతోటే ఎవరూ రాజులు కారు. రాజులు ఇకనుండి ఎన్నుకోబడతారు. జాతిని బట్టి శక్తిని అంచనా ఎందుకు వేస్తావు? భగవంతుని సృష్టిలో అందరూ సమానులే!" ఉపన్యాసం యిచ్చింది దీర్ఘకర్ణం.

పులిరాజుకు అరికాలి మంట నెత్తికెక్కింది. దీర్ఘకర్ణం ఒక్కతే వచ్చి ఉంటే ఈ పాటికి ఒక్క పంజా విసిరి ఎక్కడికో పంపించి ఉండేవాడు. కాని అన్ని గాడిదల ముందు తన ప్రతాపం పనికి రాదని తలచి, ఉదారంగా ప్రవర్తించాడు: "మంచిది! ఈ రోజు నుండి ఈ అడవికి రాజువి నువ్వే. ఈ అడవిని వెయ్యి కళ్లతో కాపాడు. ఇకనుండి నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా, దాన్ని నీ దగ్గరకే పంపుతాను" చెప్పాడు మర్యాదగా.

గాడిదలన్నీ విజయనాదాలు చేస్తూ వెనక్కి మళ్ళాయి. సంబరాలు చేసుకున్నాయి.

అంతలోనే 'ఎవరో దొంగలు మన అడవిలోని ఎర్రచందనం వృక్షాలను అక్రమంగా‌ తరలిస్తున్నారు' అని వార్త మోసుకొచ్చింది కుందేలు.

వెంటనే కొన్ని యువ గాడిదలను తీసుకొని దొంగల మీదకు దండయాత్రకు వెళ్ళింది దీర్ఘ కర్ణం.

కొన్ని వందల గాడిదలు ఒక్కసారిగా తమ మీదికి రావడం చూసి, భయపడి, పారిపోయారు దొంగలు. దాంతో గాడిదలన్నీ విజయోత్సవాలు జరుపుకున్నాయి.

కొన్ని రోజులకు మదించిన ఏనుగుల గుంపు ఒకటి ఎక్కడినుంచో వచ్చి, అడవిలో స్త్వైరవిహారం చేయడం మొదలెట్టింది. కనిపించిన చెట్లనల్లా ధ్వంసం చేస్తున్నది. చిన్న ప్రాణులను కాళ్లతో త్రొక్కేస్తున్నది. ఘీంకారాలతో ఎవరికీ నిద్ర పట్టకుండా చేస్తున్నది.

దీర్ఘకర్ణానికి చాలా కోపం వచ్చింది. యువ సైన్యాన్ని సమాయత్త పరచింది. ఒక్కసారిగా ఏనుగుల మీదికి దండెత్తింది. అయితే ఎందుకనో, మరి ఏనుగులు వీటికి భయపడలేదు. అవన్నీ తిరగబడ్డాయి! ఘీంకరిస్తూ మీదకి వచ్చాయి!

దాంతో చాలా గాడిదలు భయపడి పారిపోయాయి.

దీర్ఘకర్ణం మటుకు ధైర్యంగా ఒక మదగజాన్ని నిలువరించింది. దానికి తిక్కరేగి, దీర్ఘకర్ణాన్ని తొండంతో ఎత్తి, ఒక్క విసురు విసిరింది! దాంతో నడుములు విరిగినంత పనయింది దీర్ఘకర్ణానికి. అయితే దాని అదృష్టం: అది పులిరాజు గుహకు దగ్గర్లో పడింది!

"పులిరాజా! శరణు శరణు ! మన రాజ్యం మీదికి ఏనుగులు దండెత్తాయి. నాశనం చేస్తున్నాయి. మీరు వచ్చి కాపాడాలి!" కాళ్లు జోడించి ప్రార్థించింది దీర్ఘకర్ణం.

"నాకేం పని దీర్ఘకర్ణీ?! నేనిప్పుడు ఈ అడవికి రాజును కాదు. నువ్వే రాజువు; కాబట్టి ఆ గొడవేదో నువ్వే చూసుకో!" అంటూ లోపలికి పోయాడు పులిరాజు.

దీర్ఘకర్ణం కాళ్ళావేళ్ళా పడింది: "మహాప్రభో! వీటిని తోలడం నా వల్ల కావట్లేదు. తమరే రక్షించాలి! పాహిమాం! పాహిమాం!"

"అయితే నాకేంటి లాభం?" విసుగ్గా అడిగాడు పులిరాజు.

"అయ్యా! మీ రాజ్యం మీరే ఏలుకోండి. మేము, గాడిదలం, తపస్సు చేసుకుంటాం; మా బ్రతుకు మేము బ్రతుకుతాం!"

"అదెట్లా కుదురుతుంది? ఇన్నాళ్లు రాజ్య సుఖాలు అనుభవించావు; ఇప్పుడు శత్రువులు దండెత్తి వస్తే, రాజ్యం వద్దంటున్నావు- ఇది అవకాశ వాదం!" పులిరాజు అన్నది.

"మహాప్రభో! బుద్ధి వచ్చింది! రాజ్య కిరీటం అన్నది ముళ్ల కిరీటం అని నాకు తెలీదు- ఎవరు చేసే పనులు వాళ్లు చేయాలి. సృష్టిలో అంతా సమానం అనుకున్నాను; కానీ ప్రతి జంతువుకూ దాని సామర్థ్యానికి తగిన పనులు కల్పించి ఉన్నాడు భగవంతుడు. మేము గాడిదలం: బరువులు మోసే పని మాకు సరిపోతుంది. మీరు పులులు: రోషంతో పోరాడటం మీకు సరిపోతుంది. ఇక పదండి: ఆలసిస్తే మన అడవి సర్వనాశనం అయిపోతుంది" అని పాదాలంటింది దీర్ఘకర్ణం.

"అర్థమయిందా! అర్హత లేకుండా అందలం ఎక్కుదామనుకోకూడదు. పనికి తగిన అర్హతను పెంపొందించుకోవాలి. ఇక రా! ఈ ఏనుగుల సంగతి చూద్దాం!" పులిరాజు దాన్ని వెంటబెట్టుకొని ఏనుగుల గుంపు దగ్గరకి వచ్చాడు.

దీర్ఘకర్ణం వెనక్కి తిరిగి ఏనుగును తన్నబోయింది; అయితే ఆలోగానే ఏనుగు తొండంతో దాన్ని ఎత్తి దూరంగా విసిరేసింది. "ఆయ్! నా స్నేహితుడినే తంతావా?!" అంటూ గాండ్రించింది పులి. ఆ గాండ్రింపుకే ఏనుగులకు మత్తు సగం వదిలి పోయింది.

దీర్ఘకర్ణాన్ని విసిరేసిన ఏనుగు మీదికి దూకింది పులిరాజు.

అంతే! ఒక్క దెబ్బకే ఏనుగులన్నీ తోక ముడుచుకుని పారిపోయాయి.

పులిరాజు వాటి వెంటపడి తరిమాడు, అడవి పొలిమేర దాకా.

"పులిరాజుకూ.. జై!" అరిచింది దీర్ఘకర్ణం.

"జై! జై!" అని అరిచాయి మిగిలిన జంతువులన్నీ.

ఇక అటుపైన దీర్ఘకర్ణం ప్రశాంతంగా ఆలోచిస్తూ అడవిలోనే ముని జీవనం సాగించింది.