ఈ మధ్య ఒక రోజు ఎప్పుడో పేపర్‌లో ఒక వార్త చదివాను: భవానీపురం అనే ఊళ్లో ఒక పెద్ద బావి ఉందట. దాని నిండా కావలసినన్ని నీళ్లు ఉన్నాయట. అయినా ఆ ఊరి ప్రజలు వేరే బావి తవ్వించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారట.

ఎందుకు? ఆ బావిలో దయ్యాలు, భూతాలు ఉన్నాయని! ఊళ్ళోవాళ్ళెవరూ ఆ బావిలో నీళ్ళు త్రాగరు; చీకటి పడుతున్నదంటే అటువైపుకు పోరు. పౌర్ణమినాడు, అమావాస్యనాడు గుంపులు గుంపులుగా వెళ్ళి ఆ బావికి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు!

ఆ వార్త చదివాక నాకు ఒక వైపున నవ్వొచ్చింది; కానీ మరొక వైపున బాధ కూడా వేసింది. మన దేశంలో ఎంత మంది ఇట్లా మూఢ నమ్మకాలకు బందీలో?!

అయినా నేను ఆ వార్తను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆరోజున బడిలో‌ జరిగిన ఒక సంఘటన నాకు 'ఏదైనా చేయాల్సిందే' అనిపించేట్లు చేసింది.

ఆరో తరగతి చదివే దివ్య ఆరోజున అకస్మాత్తుగా నేలమీద పడిపోయి, ఒళ్ళు బిగబట్టి, కళ్ళు తేలవేసింది. మేమందరం ఆ పాప చుట్టూ మూగితే, మా సైన్సు సార్ వచ్చి "అందరూ దూరంగా పోండి, ఆ పాపకు గాలి ఆడాలి!" అని అరిచారు.

కొద్ది సేపటికి ఆ పాప కళ్ళు తెరిచి, మా అందరినీ చూసి సిగ్గుపడింది. మా టీచర్లు ఆ పాపకు ఇంకొకరిని తోడుగా ఇచ్చి, ఇంటికి పంపారు- "విశ్రాంతి తీసుకో పాపా" అని చెప్పి.

ఆ తర్వాత సైన్సు సార్ చెప్పారు- "ఆ పాపకు ఏమీ కాలేదు- భయపడకండి. సరిగ్గా అన్నం తినక, ఎక్కువ పని చేసి, అమితంగా కంగారు పడి, నిద్రకూడా తక్కువై పోతే మన శరీరం బలహీనపడుతుంది; ఒక్కోసారి ఇట్లా అవుతుంది. మళ్ళీ మళ్ళీ‌ ఇట్లా అయితే మటుకు డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు 'మూర్ఛ' కోసం మందులు ఇస్తారు. కొంతకాలం మందులు వాడితే ఇక అట్లా మూర్ఛలు రావు" అని.

సుధీర్ అడిగాడు- "సార్, అది దయ్యం పట్టటం కాదా?" అని.

"కానే కాదు. మన మెదడులో సహజంగా ఉండే ప్రవాహాలు కొన్ని గందరగోళ పడినప్పుడు అట్లా అవుతుంది. దానికి మందులున్నాయి" చెప్పారు సైన్సు సార్.

"అయితే సార్, మరి బావిలో దయ్యాలు ఎట్లా ఉంటాయి?" అడిగాను నేను.

అందరూ నవ్వారు. సైన్సు సార్ కూడా నవ్వారు. "దయ్యాలు ఎవ్వరికీ కనిపించవు కదా, మరి అవి బావిలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది?" అన్నారు.

"కాదు సార్! మా ఊళ్ళో ఓ బావి ఉంది. అందులో నీళ్ళు ఎర్రగా ఉంటాయి. 'ఆ బావిలో దయ్యాలుంటాయి!' అంటారు అందరూ" చెప్పాడు సుధీర్.

"అవును సార్! ఈ మధ్యే పేపర్లో చదివాను. భవానీపురంలో అట్లానే అట" అన్నాను నేను.

"మా ఊరు భవానీపురమే" అన్నాడు సుధీర్.

అందరం ఆశ్చర్యంతో "వా...వ్" అన్నాం.

"నీళ్ళు ఎర్రగా ఉంటాయా? నిజంగానే?! దానికి కారణాలు 'ఖచ్చితంగా ఇవి' అని చెప్పలేం సుధీర్, అయితే మీకు తెలుసా, ప్రకృతిలో రెండు వస్తువులు కలిసి పూర్తిగా వేరే రంగును సృష్టిస్తుంటాయి. సున్నం ఎట్లా ఉంటుంది? తెల్లగా. మరి పసుపు ఎట్లా ఉంటుంది? పసుప్పచ్చగా. ఈ రెండూ కలిపి చూడండి- ఏ రంగు వస్తుంది? ఎరుపు!! దానితోటే కదా, పెళ్లి వేడుకల్లో కాళ్ళకు పారాణి పెట్టేది! అట్లా, మరి మీ బావిలో సున్నం ఉందనుకో, మీరు అందులోకి పసుపు వేసి పూజ చేస్తారనుకో, వెంటనే నీళ్ళు ఎర్రబారతాయి. దానిదేమున్నది?" చెప్పారు సైన్సు సార్.

నేను, సుధీర్ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. "చేసి చూడచ్చా సార్?" అన్నాం ఒకేసారి.

"ఓఁ చక్కగా చేయచ్చు. మన ప్రయోగశాలలోనే చేసి చూద్దాం" అని, ఆ రోజు సాయంత్రం చేసి చూపించారు కూడాను! నిజంగానే పారాణి ఎర్రగా రక్తంలాగా ఉంది!

"మరి మీ ఊరి బావిలో దయ్యాల్ని నేను వదిలించనా?" అడిగాను సుధీర్‌ని. "ఈ శని ఆది వారాల్లో మా ఊరికి వెళ్తాను- నువ్వూ రా, చూద్దాం" అన్నాడు వాడు.


శనివారం నాడు ఉదయాన్నే బయలుదేరి సుధీర్ వాళ్ళింటికి వెళ్ళాను. అప్పటికే మా తరగతి పిల్లలు మరో ఐదుగురు నిలబడి ఉన్నారక్కడ. "మీరే వెళ్దామనుకున్నారా, మమ్మల్ని తీసుకెళ్ళకుండానే?!" అని నవ్వారు. అందరం కలిసి బయలుదేరాం.

సాయంత్రం అవుతుండగా భవానీపురం చేరుకున్నాం. ఊరి మొదట్లోనే ఒక తాత కనిపించాడు. "తాతా ఈ ఊళ్లో దయ్యాల బావి ఉందంటగా!" అది ఎక్కడ ఉందో తెలుసా?” అని అడిగాం.

"ఆఁ.. అది తెలీకేం?!" అన్నాడు తాత.

"మరి అదెక్కడో చూపిస్తావా, మాకు?" అడిగాడు శ్రవణ్.

"దయ్యాల బావికా? ఈ వేళప్పుడా?!" అడిగాడు తాత ఆశ్చర్యంగా. వీళ్ళింకా జవాబివ్వకనే "తిక్క పట్టిందా, మీకు? మీకు బుద్ధి లేదు; మీ పెద్దోళ్లకు బుద్ధి లేదు. ఈ వేళప్పుడు ఆ దరిద్రం బావి కాడికి వెళ్తారా ఎవురైనా?" అరిచాడు కోపంగా.

సుధీర్ ఆ తాతకు కనబడకుండా మా వెనకనే నక్కాడు- "నేను చెప్పలేదా, ఎవ్వరినీ అడగకండి- ప్రయోజనం ఉండదు. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, రేప్పొద్దున. మా ఇంట్లో వాళ్లకి కూడా ఎవ్వరికీ చెప్పకండి" అంటూ.

అందరం వాడిని ఒప్పించి బావి దగ్గరికి నడిచాము. ఆ బావి ఊరికి చివర ఉంది. అక్కడికి చేరుకునే సరికి అందరికీ చాలా దాహం వేస్తున్నది. బావిలో పై అంచు దాకా ఉన్నాయి నీళ్లు. చేతులకు అందేంత నిండుగా... గబాల్న నా దోసలితో నీళ్లు తీసుకొని తాగబోయాను.

'అయ్యో ఆ నీళ్ళు తాగకు- అది దయ్యాల రక్తం!' అన్నాడు సుధీర్. 'రక్తమా?!' అన్నాను నేను. "అవును- కావాలంటే చూడు" అంటూ తన జేబులోంచి అగ్గిపెట్టె తీసి వెలిగించాడు. నీళ్ళు మామూలుగానే ఉన్నాయి.

"కానీ.. మరి నేను చూసినప్పుడు.." గొణిగాడు వాడు.

మేం అందరం నవ్వాం. "నువ్వు చూసినప్పుడు నీళ్లు ఎర్రగానే ఉండి ఉంటాయిలే. దానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది! అంతేతప్ప ఇక్కడ ఏ దయ్యాలూ లేవు!" అన్నాను నేను.

తర్వాత అందరం సుధీర్ వాళ్ళింటికి వెళ్ళాం. వాళ్ల అమ్మా వాళ్ళు మంచివాళ్ళు. మా అందరికీ భోజనం పెట్టారు. పడుకునేందుకు చోటు చూపించారు.

తెల్లవారాక నన్ను నేను పరిచయం చేసుకున్నాను- "మా నాన్నకు దైవశక్తి ఉందండి. భూతాలను తరిమేస్తాడు. నాకూ కొంచెం కొంచెం విద్యలు వచ్చు" అని.

"అవునా?" ఆశ్చర్యపోయారు వాళ్ళు.

"ఓ గ్లాసెడు పాలు ఇస్తారా?" అడిగాను, సుధీర్‌కి సైగ చేస్తూ.

"నేను తెచ్చిస్తాను" అని సుధీర్ లోపలికి వెళ్ళి, గ్లాసులో పాల బదులుగా మేం తీసుకొచ్చిన సున్నంపొడినే చిక్కగా కలిపిన నీళ్ళు పట్టుకొచ్చాడు.

"కొంచెం దేవుడి దగ్గరున్న పసుపు కావాలండి, ఒక చెంచాడు" అన్నాను నేను.

ఈసారి సుధీర్ వాళ్ళ అమ్మ వెళ్ళి పసుపు తీసుకొచ్చింది. నేను పసుపును కళ్ళకద్దుకొని, దాన్ని సున్నపు నీటికి కలిపాను- చూస్తూండగానే అదంతా ఎర్రబడింది!

అందరూ‌ నిర్ఘాంతపోయారు.

"ఇదేనండి అమ్మవారి మహిమ. మీ ఊరి బావిలో ఈ పాలను కలిపి వద్దాం పదండి. అట్లా ఊరికీ మేలు జరుగుతుంది" అని లేచాను నేను.

అందరూ నా వెంట వచ్చారు. "ఈ బావిలో దయ్యాలుంటాయి. ఈ నీళ్ళకు పసుపు తగిలిందంటే చాలు ఎర్రబడతాయి" చెప్పింది సుధీర్ వాళ్ల అమ్మ.

"నేను అన్నీ తెలిసినదానిలాగా నవ్వాను. అమ్మవారి పాలు కలిస్తే దయ్యాలు తక్షణం చచ్చిపోతాయి; మెల్లగా అన్నీ సర్దుకుంటాయి" అని చెప్పి గ్లాసులోని ఎర్ర నీళ్ళను బావిలోకి వంచాను.

"అయినా ఈ బావిలో దయ్యాలున్నాయని ఎవరు చెప్పారు? ఇవి పాల లాంటివి! అమ్మవారికి ఇవంటే ఇష్టం! అందుకనే పసుపు కలపగానే అమ్మవారు దాన్ని ఎర్రబరుస్తున్నారు" అని జోడించాను.

ఆరోజున ఆ బావిలోని నీళ్ళను రెండు బాటిళ్ళలో నింపుకొని పట్టణానికి తీసుకెళ్ళాం. సైన్సు సార్ సహాయంతో వాటిని ప్రభుత్వం వారి "త్రాగునీటి పరీక్షా కేంద్రం"కి తీసుకెళ్ళి, "పోటబులిటీ పరీక్ష" చేయించాం. ఆ నీళ్ళలో సున్నం ఎక్కువ ఉన్నదని తేల్చారు వాళ్ళు!

మన భూమి పొరల్లో ఉండే రకరకాల లవణాల్లో కొన్ని నీళ్లలో కరిగేవి ఉంటాయి. వాటి మీదుగా నీళ్ళు ప్రవహించినప్పుడు అవి నీళ్లకు వాటి లక్షణాలను ఇస్తాయి.

లవణాలు అధికంగా ఉండే నీళ్లను ఫిల్టర్ చేసుకొని త్రాగితే చాలా వరకు సరిపోతుంది. అంతకుమించి ఊరికే భయపడవలసిన పని లేదు.

అయితే ప్రయోగశాల వారి రిపోర్టు కంటే 'అమ్మవారి పాలే' ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పాడు సుధీర్.

అమ్మవారి మహిమను నమ్మే ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు ఆ నీళ్లను త్రాగేందుకు కాకపోయినా, ఇతర అవసరాలకోసం మటుకు బాగానే వాడుకుంటున్నారట!