అనగనగా ఒక ఋషి, ఆయన భార్య అడవిలో సుఖంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఋషి చూసేందుకు మామూలుగానే ఉండేవాడు, కానీ ఆయనకు చాలా మహిమలు వచ్చు.

వాళ్లకి పిల్లలు లేరు. అయితే ఒకరోజున ఋషి భార్య అంది- "పొయ్యిలోకి కొన్ని ఎండు పుల్లలు ఏరుకు రారాదూ, అడవిలోంచి?!" అని.

ఋషి పుల్లలు ఏరుకుంటుంటే, దగ్గర్లోనే దబ్బున శబ్దం అయ్యింది. చూస్తే అది ఒక చిట్టి రామచిలుక! చెట్టు మీది నుండి క్రింద పడింది; కదలలేకపోతున్నది.

ఋషి దానిని ఇంటికి తీసుకెళ్లాడు. రకరకాల మూలికలతో దానికి వైద్యం చేశాడు.


ఆయన భార్య దాన్ని చూసి జాలి పడ్డది. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నది.

కొన్ని రోజుల తర్వాత చిలుక కాలు బాగా అయింది. ఇప్పుడు అది ఆడుతూ, పాడుతూ ఉంది. ఋషికి, ఋషి భార్యకు అది చాలా మాలిమి అయ్యింది. వాళ్ళు దాన్ని సొంత బిడ్డలాగా ప్రేమించసాగారు.



ఒకరోజున ఋషి భార్య అడిగింది, ఋషిని. "నీ మంత్ర శక్తితో దీన్ని ఒక పాపగా మార్చరాదూ?! మనం చక్కగా ఆ పాపను పెంచుకోవచ్చు!" అని.

ఆయన 'సరే' అని, ఓ మంత్రం చదివి నీళ్లు చల్లగానే చిలుక కాస్తా ఒక చిన్న పాప అయ్యింది. ఆ పాపకు వాళ్ళు చిలకబాల అని పేరు పెట్టుకున్నారు. చక్కగా ఆ పాపను పెంచుకోసాగారు.



ఒకరోజున చిలక బాల నీళ్ల కోసం నది దగ్గరికి వెళ్లింది. తను వెళ్లేటప్పుడు చూసిన ఋషి "పాప ఇప్పుడు పెద్దదయింది.. పెళ్లి వయసు వచ్చింది. ఎవరైనా మంచి వరుడిని చూసి పెళ్ళి చేయాలి" అనుకున్నాడు.





ఆ రాత్రి అన్నం తినేటప్పుడు "చిలక బాలా! ఇప్పుడు నీకింక పెళ్ళివయసు వచ్చిందమ్మా. ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాం- సరేనా?" అన్నాడు ఋషి.

అది వినగానే చిలక బాల మొహం తెల్లగా అయింది. "ఏంటి? నేనంటే మీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకొని నేను అత్తగారింటికి వెళ్లిపోతే మీకు సంతోషమా?" అని చటుక్కున లేచి వెళ్ళిపోయింది.

"నాకు చాలా ఇష్టమైతే తప్ప, ఎవ్వరినీ పెళ్లి చేసుకొనేది లేదు" అనుకున్నది మనసులో.

అరగంట తరువాత ఋషి వచ్చి మంచం కింద నుంచి బైటికి లాగాడు తనని. "నిన్ను వదలడం నాకు కూడా ఇష్టం లేదమ్మా! కానీ నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. నీకు నచ్చేవాడిని వెతుకుతాగా?!" అన్నాడు.

చిలక బాల కళ్లు మూసుకొని "సరే" అన్నది.

తరువాతి రోజున తెల్లవారుతూనే సూర్యుడిని పిలిచాడు ఋషి. "సూర్యుడా! సూర్యుడా! ఇటు రా! నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా?!" అని అడిగాడు.

"ఓ! మీ అమ్మాయంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళికి ఎప్పుడంటే అప్పుడు సిద్ధం!" అన్నాడు సూర్యుడు.

అప్పుడు చిలకబాల- "వద్దు నాన్నా! సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. అంత వేడిని నేను భరించలేను. ఇంతకంటే మంచి సంబంధం చూడు నాన్నా!" అన్నది.

'సరే- సూర్యుడికంటే, వాడిని మూసేసే మేఘాలు గొప్పవి కదా!" అని ఋషి ఈసారి మేఘాలని పిలిచాడు.

"మేఘం! మేఘం! నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు.

"ఓఁ! తను ఒప్పుకుంటే తప్పకుండా చేసుకుంటాను" అన్నది మేఘం.

చిలక బాల అన్నది- "నాన్నా! ఈ మేఘాలు ఎక్కువ కాలం బ్రతకవు- కొద్దిరోజులకే వర్షం అయిపోయి కురుస్తాయి. వీళ్ళకంటే మంచివాళ్లని ఇంకొకరిని చూడు!" అని.

ఈసారి ఋషి గాలిని పిలిచాడు. "మేఘాలకంటే గొప్పది గాలే! గాలి వీస్తే ఇక మేఘాలు ఎక్కడికో కొట్టుకు పోతాయి!" అని. చిలక బాల అందం చూసి 'పెళ్లి చేసుకుంటాను' అన్నది గాలి. కానీ చిలకబాల ఒప్పుకోలేదు. "గాలిలో అన్నీ కొట్టుకు పోతాయి. నేను కూడా ఏదో ఒక రోజు కొట్టుకుపోతాను. నాకొద్దు నాన్నా!" అన్నది.

ఈసారి ఋషి ఒక పర్వతాన్ని పిలిపించాడు. "నేను ఈయన్ని చేసుకోను నాన్నా! పెద్ద బండరాయి! అస్సలు కదలడు, మెదలడు!" అన్నది చిలకబాల.

అంతలో ఒక చిలక వచ్చి చెట్టు మీద కూర్చుంది.

దాన్ని చూడగానే చిలుకబాల సిగ్గులమొగ్గే అయ్యింది. "ఈయన నాకు నచ్చాడు నాన్నా! చూడు- ఎంత అందమైన రెక్కలు ఉన్నాయో! ఈయన ముక్కుకు ఉన్న రంగు ఇంకెవ్వరికీ లేదు, చూశావుగా?!" అంది గుసగుసగా.

ఋషి, ఋషి భార్య నవ్వారు. చిలుక బాలని కాస్తా మళ్ళీ చిలకగా చేసారు. చిలకరాజుకు, చిలక బాలకు ఇద్దరికీ పెళ్లి చేశారు!