అనగనగా ఒక ఊరిలో అలి అనే ఒక బాబు ఉండేవాడు. అతను చాలా అల్లరి చేస్తుండేవాడు. వాళ్ల అమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు.

ఒక రోజు అలి వాళ్ళ అమ్మని అడిగాడు "అమ్మా! నేను ఇవాళ్ళ స్కూల్ అయిపోయాక సినిమాకి వెళ్ళొచ్చా?" అని.

"ఒద్దు అలీ! నీకు దారి తెలియదు. చీకటి పడితే తప్పిపోతావు!" అంది అమ్మ.

"లేదమ్మా! నాకు వెళ్ళాలని ఉంది. అది ఎంత గొప్ప సినిమానో తెలుసా, నీకు? బలే సినిమా అట! పిల్లలంతా చూడాల్సిన సినిమానట! లలిత కూడా చూసింది!" అన్నాడు అలి.


"నేనే తీసుకెళ్తానురా, నిన్ను. రేపు నాకు పని ఉంది కదా, అందుకని ఇంకోరోజు ఎప్పుడైనా వెళ్దాం. నువ్వు చాలా మంచివాడివి కదా! నా మాట విను. ఒక్కడివే దారి తెలియకుండా వెళ్ళకూడదు- చాలా ప్రమాదం!" అంది అమ్మ.

"సరేలే" అన్నాడు అలి.

కానీ సాయంత్రం అయ్యేసరికి అలి అమ్మ మాట వినకుండా తనొక్కడే సొంతగా సినిమాకు వెళ్ళాడు!


సినిమాకు వెళ్ళేటప్పుడు ఏమీ కష్టం కాలేదు. సమస్య అంతా సినిమా అయ్యాక మొదలయింది. అక్కడినుండి తను ఇంటికి బయలుదేరేసరికే రాత్రి తొమ్మిది గంటలు అయ్యింది. అసలే కొత్త దారి- చీకటి! తనకీ దారి అంతగా తెలీదాయె! దాంతో దారి తప్పిపోయాడు. ఎటో వెళ్ళి పోయాడు. ఎంత నడిచినా ఇంటి జాడ లేదు. రోడ్లమీద ఒక్క మనిషి కూడా లేడు, అలీ తప్ప! నడిచీ నడిచీ అలిసిపోయాక, వీధిలో ఒక మూల కూర్చుని ఏడవటం మొదలు పెట్టాడు అలి. "అమ్మ మాట వింటే బాగుండేది. అమ్మతో బాటు ఇంకొక రోజు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే సరిపోయేది. ఇప్పుడు చూడు, చలి పుడుతోంది; ఆకలివేస్తోంది; భయం వేస్తోంది- ఇప్పుడు ఏం చేయను?" అనుకున్న కొద్దీ‌ ఇంకా ఇంకా ఏడుపు వచ్చింది.

అంతలో పోలీస్ ఆయన ఒకాయన అలి దగ్గరికి వచ్చి "ఎందుకు ఏడుస్తున్నావ్ అలీ?" అని అడిగాడు.

జరిగినదంతా చెప్పాడు అలీ.

"మరి అమ్మ మాట వినాలి కదమ్మా! ఇంత చిన్న బాబువి కదా, సొంతగా దూరాలు దూరాలు వెళ్తే ఎంత ప్రమాదం! అర్థమైందా? మరి ఇప్పుడు కళ్ళు తుడుచుకో, మీ ఇంటికి తీసుకెళ్తాను. అయినా మీ ఇల్లెక్కడ?" అడిగాడు పోలీసు.

అలీకి వాళ్ల ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలీదు!

కనీసం వాళ్ల అమ్మ ఫోను నంబరు కూడా తెలీదు!


ఆ పోలీస్ నవ్వాడు. "చూశావా, అందుకనే పిల్లలు ఎప్పుడైనా వాళ్ల అడ్రసులు, ఫోను నెంబర్లు నోటికి నేర్చుకోవాలి. సరేనా?" అన్నాడు. "మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తున్నది. నువ్వు ఇట్లా అల్లరి పని ఏదో చేస్తావనే ముందుగా చెప్పి నన్ను నీవెంటే సినిమాకి కూడా పంపించింది. ఎంత మంచి అమ్మో చూశావా?" అని అలీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి విడిచిపెట్టాడు.

"అమ్మా! నన్ను క్షమించు నేను నీ మాట వింటాను" అన్నాడు. అమ్మ ఆనందపడింది. పోలీసాయనకు ధన్యవాదాలు చెప్పింది.