"పిల్లలు తల్చుకుంటే ఏమైనాచేయగలరు " అన్నారు గణితం మాస్టారు.

"వాళ్ళ ముఖం! వాళ్ళకు దేశపటంలో నదులు గుర్తించటమే రాదు! ఇంక వాళ్ళేం చేస్తారు- ఉత్తి మాటలు!" అన్నారు చరిత్ర మేస్టారు.

"సామ దాన భేద దండోపాయాలని, ఉపాయాలు నాల్గువిధాలు. వీళ్ల చేత ఏదైనా పని చేయించేందుకు చరిత్ర నిరూపించిన మంత్రాలు చాలానే ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి, ఓ ఉపాయం పన్ని మీరు చెప్పిన పని చేయిస్తాను- చూద్దురు" అన్నారు తెలుగు అయ్యవారు.

"మీ వల్ల కాదండీ! ఊరికే ప్రయాస పడకండి" అన్నారు ఇంగ్లీషు సార్.

"సరే పందెం కాద్దాం. చెప్పండి. ఏం చేయించమంటారు?!" నిటారుగా కూర్చున్నారు తెలుగు అయ్యవారు.

"సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చూద్దాం. మీది తెలుగు సబ్జెక్ట్.. సరే- మీ ఏడో తరగతి పిల్లల చేత ఒక్కవంద పద్యాలు అప్పచెప్పించండి- చాలు" అన్నారు ఇంగ్లీషు సార్ కొంచెం ఆలోచిస్తూ.

తెలుగు అయ్యవారు వెనక్కి తగ్గలేదు- "ఓఁ..ఖచ్చితంగా చెప్పిస్తాను. పోటీ పెట్టుకోండి. గెలిచిన పిల్లలందరికీ మరి మీరు పిల్లల పండుగ రోజున నేను చెప్పిన బహుమతులు అంద జేయాలి, ఎంత ఖరీదైనా సరే! సరేనా?! ఇంకో మాట- ఈ విషయంలో నాకు మరో ఉపాధ్యాయుడి సహకారం కూడా కావాలి"అన్నారు తెలుగు అయ్యవారు.

"మీ వెంట నేనున్నాను తెలుగు అయ్యవారూ! ఏలాంటి సహకారం కావాలన్నా ఇస్తాను" అని డ్రాయింగ్ సార్ ముందుకొచ్చారు. "మరింకేం?! మీకు సహచరుడు కూడా దొరికాడు. పదండి ముందుకు!" నవ్వారు ఇంగ్లీషు సార్.

"సరే! ఇక మీద ఏం జరుగుతుందో వెండితెర మీద చూస్తూండండి" అని డ్రాయింగ్ సార్ చెవిలో ఏదో రహస్యంగా చెప్పి నవ్వారు తెలుగు అయ్యవారు.


తర్వాతి రోజున ఏడో తరగతిలో తెలుగు క్లాస్-
"మీలోఎవరైనా వంద పద్యాలు చెప్పగలరా?" అడిగారు తెలుగు అయ్యవారు. తరగతిలో అంతా నిశ్శబ్దం.

"తెలుగు పిల్లలయ్యుండి మీకు కనీసం వంద పద్యాలు కూడా రావంటే నాకు చాలా అవమానంగా ఉందిరా! ఏడో తరగతికి వచ్చారు- క్రింది తరగతుల్లో నేర్పిన పద్యాలు కూడా నోటికి రాకపోవటమేంట్రా, అసలు? మాతృభాష రానివాడు ఇంక మాతృభూమికి ఏం సేవ చేస్తాడు, మాతృమూర్తికి ఏం సేవ చేస్తాడు? మీ చదువంతా వృధా రా! ఏడోతరగతికి వచ్చి, కనీసం వంద పద్యాలు కూడా రానివాడు అసలు నన్నడిగితే తెలుగు విద్యార్ధిగా పనికేరాడు" కోపంతో ముఖమంతా ఎర్రగా చేసుకుని చిరచిరా నడిచి వెళ్ళిపోయారు తెలుగు అయ్యవారు.

పిల్లలంతా తలలువంచుకుని కూర్చున్నారు. "ఏనాడూ పన్నెత్తి ఒక్క మాట అనని తెలుగు అయ్యవారు ఇవాళ్ళేంటి, ఇంతలాగా తిట్టేసారు?" అని అంతా చిన్నబోయారు.

అంతలో తర్వాతి పీరియడ్ డ్రాయింగ్ మేస్టారు వచ్చారు. దిగాలుగా ఉన్న పిల్లల ముఖాలు చూసి "ఏంటర్రా! అట్లా వాడిపోయిన తోటకూర కాడల్లాగా ఉన్నారు? ఏం జరిగిందేంటి?" అడిగారు.

"మాకు ఏదైనా రాకపోతే మీరు చెప్పాలి గద సార్?! చెబితే మేం ఏదైనా నేర్చుకుంటాం కదా? తెలుగు అయ్యవారు అంతగా కోపం చేసుకునే అవసరం ఏముంది? ఓ పది సార్లు చదువుకుంటే వంద పద్యాలూ వచ్చేస్తాయి. దానిదేముంది, చిన్న తరగతుల్లో నోటికి వచ్చినవే కదా" ఫిర్యాదు చేస్తున్నట్లు అన్నది సుజన.

"వంద పద్యాలా! బాబోయ్ అన్నే?! నాకూ వచ్చో, రావో?" అన్నారు డ్రాయింగ్ సార్.

"లేదు సార్, మాకు వచ్చు, ఏమంటే అన్నీ ఒక్కసారి గుర్తుకు రావట్లేదు అంతే!" చెప్పాడు వినీష్.

"గుర్తుంచుకునేందుకే అయితే మార్గం ఒకటి ఉంది నా దగ్గర-" అంటూ ఒక ఉపాయం చెప్పారు డ్రాయింగ్ సార్-
అంతే! మరునాటి నుంచీ ఊరంతా మారి పోయింది.

ఏడో తరగతి పిల్లలందరూ వేరువేరు గుంపులయ్యారు. ఒక్కో గుంపులోనూ ఐదుగురు పిల్లలు. ఉదయాన్నే అన్ని గుంపుల వాళ్ళూ బయల్దేరారు- బక్కెట్లూ, బ్రష్షులూ, రంగులూ పట్టుకొని. వాళ్ళ వెనకనే సాయంగా డ్రాయింగ్ సార్.. గుళ్ళ దగ్గర, మార్కెట్ దగ్గర, ఆఫీసుల మీద, నాల్గు దారుల కూడళ్ళలో- ఖాళీ ఎక్కడ కనిపిస్తే అక్కడ- గోడల మీద, ఎవరికి వాళ్ళు రాసుకొచ్చిన పద్యాల్ని చూసి రాసేశారు. సుమతీ శతకంలోంచి, వేమన శతకంలోంచి, భాస్కర శతకంలోంచి మంచి మంచి పద్యాలు; ఇవి కాక బాల రామాయణంలోంచి కొన్ని, భగవద్గీతలోంచి కొన్ని శ్లోకాలు- రోజు తిరిగే సరికి ఊళ్ళో గోడలన్నీ రంగు రంగుల పద్యాలతో నిండిపోయాయి.

మరునాటి నుండి ప్రతిరోజూ ప్రొద్దునే పిల్లల జట్లు ఒక్కో గోడ ముందు నిలబడి దాని మీది పద్యాల్ని పదిసార్లు -అక్కడే నిలుచుని- గట్టిగా- చదవసాగాయి. ఆ సమయంలో అటుగా పోయేవాళ్లంతా ఆగి, వీళ్ళు పాడేది విని, వాళ్ళూ పలికి, 'బలే పిల్లలు!' అని మెచ్చుకుంటూ పోయేవాళ్ళు. కొందరైతే 'బాగున్నై, ఇవి మా ఇంట్లో వాళ్లకీ నేర్పిస్తాం" అని కాగితాల్లో వ్రాసుకుని పోసాగారు.

ఇట్లా ప్రతి రోజూ ఉదయాన్నే ఊరు ఊరంతా ఈ జట్లకోసం ఎదురు చూడటం మొదలైంది. పిల్లలతో పాటు గొంతు కలిపే పెద్దలూ చాలామంది తయారయ్యారు. సాయం-కాలాలు రచ్చబండ దగ్గర పద్యాలు వినబడసాగాయి. చెరువుల దగ్గర నీళ్ళు ముంచుకుంటూ, మంచినీటి బావుల్లో నీళ్ళు చేదుకుంటూ పద్యాలు అప్పగించుకోసాగారు ఆడవాళ్లు. మూడు నెలల్లో వందకు పైగా పద్యాలు- పిల్లలకే  కాక పెద్దలకు కూడా- వచ్చేశాయి!

మూడు నెలలు పూర్తయింది: పిల్లల పండుగ వచ్చింది. ఏడో తరగతి వాళ్లకే కాదు- బడిలోని పిల్లలందరికీ- పద్య పఠన పోటీలు పెట్టారు. "విజేతలకు మేమూ బహుమతులిస్తాం" అని ముందుకొచ్చారు, ఒక సంస్థ వాళ్ళు. పద్య పఠన పోటీలు మొదలయ్యాయి. పాల్గొన్న పిల్లలందరూ వంద పద్యాలు చెప్పారు. నిర్వాహకులు ఆశ్చర్య పోయారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఎవరెవరికి ఇవ్వాలో తెలీక తికమక పడ్డారు.

పిల్లల ఉత్సాహాన్ని చూసి ఇంగ్లీష్ సార్ ముచ్చట పడ్డారు. తెలుగు అయ్యవారు ముసిముసిగా నవ్వుకుంటూ "వంద పద్యాలు నోటికి రాని పిల్లలెవ్వరూ లేరు కనుక, ఇప్పుడిక అందరూ పద్యాలు రాయాలి. ఎవరైతే తప్పుల్లేకుండా వ్రాస్తారో వారికి బహుమతి" అని ప్రకటించారు.

"ఓఁ రాస్తాం" అని పిల్లలంతా పద్యాలు వ్రాస్తుండగా, గ్రామస్తులు వచ్చారు- "మేము కూడా చెప్తాం సార్, పద్యాలు! మాకూ పోటీ పెట్టండి గదా!" అంటూ.

వాళ్ళ ఉత్సాహం చూసి సంస్థ వాళ్ళు మురిసిపోయారు- "ఈ ఊళ్ళోవాళ్లని చూస్తుంటే బలే ఉంది- పెద్దలకు కూడా పద్య పఠనం పోటీనట! బహుమతులట! కానివ్వండి" అని ఉత్సాహ పరచారు. ఊళ్ళో ఎక్కడెక్కడి వాళ్ళూ వచ్చి పద్యాలు చెప్పారు. ఆరోజు జరిగిన పోటీలు అసలు పోటీలు కావు! పిల్లలంతా ఒక్క తప్పు కూడా లేకుండా రాసారు! పెద్దలంతా ఒక్క తప్పూ లేకుండా పద్యాలు పాడారు! దాంతో‌ ప్రతివారికీ‌ బహుమతులు వచ్చాయి మరి!

మరునాడు అన్ని పేపర్లలోనూ ఆ ఊరి పద్యపఠనాన్ని గురించిన కధనాలు వచ్చాయి. అన్ని పత్రికల్లోనూ ఆ బాలవీరుల వార్తలే! పద్యాలు వ్రాసిన గోడ చిత్రాలు అట్లా పత్రికల్లోకీ ఎక్కాయి.

తెలుగు అయ్యవారి ఒక్క మాట, డ్రాయింగ్ సార్ ఇచ్చిన కొంచెం ఉత్సాహం-
కోతులన్నీ కలిసి లంకకు వారధి కట్టినట్లు ఊరు ఊరంతా వందపద్యాలు నేర్చుకోవటం- బలే ఉంది కదూ?!