నయనతార సెహగల్

"భారత దేశంలో బ్రిటిషర్ల పరిపాలన నిజంగా ఒక అద్భుతం: దానికి మన వాతావరణంతో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఆఫ్రికా‌ తెగలవారికి తెల్లవాళ్ళు నైటీలు అలవాటు చేసినట్లు, ఈ బ్రిటిషర్లు మనకి మానసిక నైటీలని మప్పారు. చిన్నప్పుడు మా పుస్తకాల్ని ఆంగ్లేయుల పిల్లలకోసం, ఆంగ్లేయులే తయారుచేసేవాళ్ళు. ఆశ్చర్యం ఏమంటే మా బడిలో అందరం భారతీయులం, వాటినే చదివేవాళ్లం!”

అని రాసిన నయన్‌తార సెహగల్ ఆంగ్ల సాహిత్యంలో విశేష కృషి చేశారు. రాజకీయ దృక్పథం స్వేచ్ఛా సమానత్వాల్ని హరించేదిగా ఉండకూడదని ఉద్యమించి, మహిళల హక్కులకోసం, వారి సాధికారతకోసం గొప్ప కృషి చేశారు నయనతార. 1985లో ఆవిడ రాసిన "రిచ్ లైక్ అజ్" పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

"ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉన్నది. ఎవరి అభిప్రాయం పట్లా ప్రభుత్వం అసహనాన్ని ప్రదర్శించకూడదు. వారి మౌలిక హక్కుల్ని కాలరాయకూడదు" అంటూ తనకు ఇచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును కొద్ది రోజుల క్రితమే వెనక్కి ఇచ్చేశారు నయనతార.

జవహర్ లాల్ నెహ్రూకి స్వయానా మేనకోడలైన నయనతార, తర్వాతి కాలంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అనేక రచనలు చేశారు. ప్రజలందరికి తమ అభిప్రాయాలను వెలువరించే హక్కు ఉండాలని, ఎలాంటి ప్రభుత్వమైనా ఎవ్వరి గొంతునూ అణచివేయకూడదని గట్టిగా చెబుతారు, 88 ఏళ్ల ఈ బామ్మగారు!

అమరావతి

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' కంటే ముందుగానే మనకు మరో‌ గొప్ప అమరావతి ఉన్నది! గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ మండల కేంద్రానికి వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది.

ప్రస్తుతం కేవలం పదకొండు వేల జనాభా ఉన్న ఈ గ్రామమే, ఒకప్పుడు 'ధాన్యకటకం అనే పేరు గల మహాపట్టణం' అంటే ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో 'జనపదం' పేరిట గణతంత్ర్య రాజ్యంగా ఉండిన ధాన్యకటకానికి ఆరోజుల్లో 16 కి.మీ చుట్టుకొలత ఉండేదట. ప్రసిద్ధ గ్రీకు రాయబారి "మెగస్తనీస్" ఆ రోజుల్లో అమరావతి కోట గురించి విశేషంగా రాశాడు. బుద్ధుని జీవితకాలంనుండి క్రీ.శ14వ శతాబ్దం వరకు కూడా అమరావతి ప్రసిద్ధ బౌద్ధక్షేత్రంగాను, విద్యాకేంద్రంగాను నీరాజనాలు అందుకుంది.

అంతగా వెలువొందిన అమరావతి ఆ తర్వాత 500సంవత్సరాల పాటు చీకటిలో ఉండింది. దాని ప్రాశస్త్యతను అందరూ మరచే పోయారు, చివరికి, అక్కడ ఉన్న "దీపాలదిన్నె" అనే పెద్ద దిబ్బను త్రవ్వి, నిజానికి అది మహాద్భుతమైన బౌద్ధ స్తూపం అని, అందులో ఎవరో ఆచార్యుని అస్థికలు భద్రపరచి ఉన్నాయని కనుగొన్నాడు కల్నల్ కాలిన్ మెకంజీ.

తర్వాత జరిపిన త్రవ్వకాలలో అద్భుతమైన ఈ చైత్యపు అవశేషాలేకాక, వేల సంవత్సరాలకు పూర్వపు శిలాజాలు కూడా దొరికాయి ఇక్కడ. ఇక్కడి శిల్పాల్లో కొన్నింటిని చెన్నై మ్యూజియంలో ఉంచారు. మరికొన్ని లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియానికి చేరుకున్నాయి. 'అమరావతిలోని అనేక పురాతన కట్టడాలు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందినవి' అని కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొన్నారు.