'ఆది'కి ఆరేళ్ళు. ఒకటో తరగతి. అంత చిన్న పిల్లవాడు కదా, అయినా వాడికి జంతువులన్నా, పక్షులన్నా చాలా‌ ఇష్టం. ఊరికే వాటితో ఆడుకోవటం కాదు- చాలా వాటిని వాడు ఇష్టంగా పెంచేవాడు. చిట్టి చిట్టి పిల్లి పిల్లలు, కుయ్ కుయ్ మనే కుక్క పిల్లలు, రక రకాల పక్షి పిల్లలు, పురుగులు- ఆది చేత సంరక్షించబడే జంతువులు ఎన్నెన్నో ఉండేవి వాడి దగ్గర. వాడు బడికి వెళ్లి వచ్చే దారిలో పాతబడిన ఇల్లొకటి ఉండేది. తనకి దొరికిన జంతువుల్నన్నిటినీ వాడు ఆ ఇంట్లో ఉంచేవాడు. రోజూ తను తినేందుకు తెచ్చుకునే భోజనంతో పాటు ఆ జంతువులకు, పక్షులకు కూడా ఆహారం తెచ్చేవాడు.

ఒకరోజు సాయంత్రం కొంచెం సేపు వాటితో ఆడుకొని వెళ్ళాడు ఆది. తర్వాతి రోజున వెళ్ళి చూస్తే ఏముంది? అక్కడ మొత్తం మారిపోయింది- ఏవీ లేవు అక్కడ! ఆదికి ఏడుపు వచ్చింది. బాధ పడుతూనే కొద్దిసేపు ఇంట్లో అంతా వెతికాడు. ఎక్కడా ఒక్క జంతువుకూడా కనబడలేదు. పైగా ఆరోజు స్కూలుకి సెలవు! దాంతో ఆరోజు సాయంత్రం వరకు అక్కడే, వాటికోసం ఎదురు చూసుకుంటూ ఉన్నాడు. అయినా ఒక్క జంతువుగానీ పక్షిగానీ తిరిగి రాలేదు!

సాయంత్రం ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి ఆది ఒళ్ళు కాలిపోతున్నది.

ఆరోజే కాదు, తర్వాతి రోజున కూడా జ్వరంలో ఆది కలవరిస్తూనే ఉన్నాడు- 'పక్షులు!' 'జంతువులు' అని. ఆది వాళ్ల అక్క సునీత వాడిని బుజ్జగించి అడిగింది- 'అసలు ఏమైందిరా, ఆదీ?'అని. జరిగినదంతా అక్కకు చెప్పాడు ఆది. "అయ్యో! అది మామూలేరా, అవన్నీ మేత కోసం బయటికి వెళ్లి ఉంటాయి. వాటికి నీ ఇంటి అడ్రసు తెలీదు కదా, అందుకని ఎక్కడెక్కడో బంధువుల ఇళ్లలో ఆగి ఉంటాయి. ఏమీ పర్లేదులే ఇదిగో, ఇవి చూశావా? మన దగ్గర నుండి ఎప్పటికీ, ఎక్కడికీ వెళ్లని పిట్టలు!" అని చెప్పి తను వేసిన చిలకల ముగ్గును వాడి చేతికి ఇచ్చింది అక్క.

"మరి ఇవి రంగుల పిట్టలు కాదు" అన్నాడు వాడు.

"నీ పిట్టలు రంగులవా?" అడిగింది అక్క.

"అవును- ఐదేసి రంగులుంటాయి" అన్నాడు ఆది.

"వేసి చూపిస్తావా, నేను క్రేయాన్సు ఇస్తాను?" అంది అక్క.

బొమ్మకు రంగులు కొట్టటం మొదలు పెట్టాడు ఆది.

అక్క బొమ్మలు వేసి ఇస్తూ ఉన్నది. ఆది రంగులు కొడుతూ ఉన్నాడు...

మెల్లగా ఆది జ్వరం తగ్గిపోయింది.