'అపరీక్షకారి' బ్రాహ్మణుడి కథ
(పరీక్షించక త్వరపడిన బ్రాహ్మణుడి కథ)
గౌడ దేశంలో ఒక అగ్రహారం ఉండేది. అందులో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. అతనికి పెద్దగా చదువు, జ్ఞానమూలేవు. అతనికి, అతని భార్య యాజ్ఞసేనికి వేరే సమస్యలు కూడా ఏమీ లేవు- 'సంతానం లేక పోవటం' అనే ఒక్క కొదవ తప్ప.

దేవశర్మకు అదేమంత కష్టం అనిపించేది కాదు గాని- యాజ్ఞసేని మాత్రం, తనకు పిల్లలు లేకపోవటం చేత, పిల్లల్ని కని-పెంచుతూ ఉన్న తన తోటివాళ్లనందరినీ చూసి ముచ్చట పడేది; యోగుల మాదిరి వేషాలు వేసుకున్న వాళ్లు ఎవరు కనిపిస్తే వాళ్లనల్లా ఆశ్రయించేది; వాళ్ల కాళ్ళు ఒత్తి, భోజనాలు పెట్టి సత్కరించేది; వాళ్ల చేత ఏ వేరో, వెల్లంకో కట్టించుకునేది. కనిపించిన రాయికల్లా మ్రొక్కేది; ఏ గుడి కనిపిస్తే దానికల్లా నమస్కరించుకునేది; ఎవరు ఎందులో మనగమంటే ఆ తీర్థంలో మునిగేది; లోకంలో లేని వ్రతాలను-నోములను అన్నిటినీ నోముకుంటూ ఉండేది.

ఇట్లా కొంతకాలం గడిచాక, భగవంతుడి దయవల్ల యాజ్ఞనేని కడుపుపండింది. ఒక కుమారుడిని కన్నది. లేక లేక కల్గిన సంతానం కాబట్టి తల్లి తండ్రులు ఆ పిల్లవాడిని చాలా గారాబంగా, ప్రాణాలకంటే ఎక్కువగా, "రొమ్ముమీది కాలు నేల మీద పెట్టనివ్వకుండా" పెంచుకోసాగారు.

ఒక రోజున యాజ్ఞసేని ఆ పిల్లవాడికి పాలిచ్చి నిద్రపుచ్చి, ఉయ్యాలలో పడుకోబెట్టింది. వాడికి తన భర్తను కాపలాగా ఉంచి, పొరుగు వీధిలోనే ఉన్న తల్లిగారి ఇంటికి వెళ్ళింది. ఆరోజు పండుగ రోజు కూడానూ. అదే రోజున ఆ దేశపు రాజుగారు తమ తల్లిగారి తిథి (సంవత్సరానికి ఒక సారి చనిపోయిన వారిని తలచుకుంటూ చేసే తంతు- శ్రాథ్థం) చేసుకుంటున్నారు. శ్రాద్థం రోజున 'ఇంతమంది బ్రాహ్మణులకు' అని లెక్కగా బంగారం-ఆవులు మొదలుకొని, నువ్వులు- ఉప్పు వరకు ఏవేవో సంబారాలు దానం ఇవ్వటం ఆనవాయితీ. విధివశాత్తు, ఆ సంవత్సరం ఎందుకనో రాజుగారికి దేవశర్మ గుర్తుకొచ్చాడు. తల్లిగారి తిథి సందర్భంగా వచ్చి, తానిచ్చే దానం స్వీకరించాలని దేవశర్మకు కబురుపంపారాయన.

ఇప్పుడు దేవశర్మ చిక్కుల్లో పడ్డాడు-"నేనా, నిత్యదరిద్రుడిని. కలగక కలగక- ఇవాల్టికి కదా, ప్రభువులవారికి నా మీద అనుగ్రహం కల్గింది?! బాగా చదువుకున్న పండితులు అనేకమంది ఉండగా, వాళ్లందరినీ కాదని, నాకే దానం ఇస్తానని వర్తమానం పంపారుకదా, ఆయన?! నన్ను భాగ్యవంతుడిని చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభువులవారు నన్ను పిలువనంపితే, నా దురదృష్టం ఎట్లా ఉందో చూడు- ఇట్లాంటి ఇరుకున పడి ఉన్నాను నేను! పుట్టినింటికి వెళ్లిన నా భార్య తిరిగివచ్చేది ఎప్పటికి, నేను పోయి దానం పట్టేది ఎప్పటికి?! పోనీ, 'ఆమె రాకున్నా పర్వాలేదు; నేను పోతాను' అంటే, మరి ఇంతవరకూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న పిల్లవాడి దగ్గర కనిపెట్టుకొని ఉండేవాళ్లెవరూ లేరే! పోనీ 'నేను రాజుగారి దగ్గరికి పోనులే, మానేస్తాను' అంటే ప్రభువుల వారు నాకోసం శ్రాద్ధాన్ని ఆపరు కదా- వేరే ఎవరికో‌ ఇచ్చేస్తారు కదా, ఆ దానాన్ని?!" అని చాలా గందరగోళ పడ్డాడు.

ఆ సమయంలో అతనికి ఒక ఉపాయం తోచింది. తమ పెంపుడు ముంగిస గుర్తుకొచ్చింది. "ఇంక ఇప్పుడు నాకు ఒకే ఒక్క మార్గం తోస్తున్నది- చాలా రోజుల నుండి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ముంగిస ఉన్నది కదా? దాన్ని మా పిల్లవాడికి కాపలాగా ఉంచుతాను. ముద్దుల కొడుకుకి దాన్ని కాపలాగా ఉంచి, నేను చటుక్కున పోయి వస్తాను. రాజుగారు ఇచ్చే దానం పుచ్చుకొని, ఉన్నవాడిని ఉన్నట్టే పరుగెత్తుకొని వచ్చేస్తాను, దానిదేమున్నది?!" అని ఒక నిశ్చయానికి వచ్చాడు.

ఆ వెంటనే పెంపుడు ముంగిసను దగ్గరికి పిలిచి, దానికి నోటితోనూ, రకరకాల సైగలతోనూ సందర్భాన్నంతా దానికి అర్థమయ్యేట్లు వివరించాడు. సంగతి అర్థమైనట్లు అది కూడా తలాడించింది.

ఆ వెంటనే దేవశర్మ బయలుదేరి రాజమందిరానికి పోయాడు. అక్కడికి చేరుకునేందుకు పట్టింది రెండు ఘడియలే అయినా, యుగాలు గడిచినట్లు అనిపించింది అతనికి. రాజమందిరానికి చేరుకున్నాక కూడా, అదే పరిస్థితి- అతని శరీరం అయితే రాజమందిరంలో ఉన్నది గానీ, మనసంతా ఇంట్లో కుమారుడి మీదనే ఉన్నది!

ఇక, అక్కడ ఇంట్లో పరిస్థితి మరో విధంగా ఉండింది. విధి ఎలా ఉంటుందో చూడండి- దేవశర్మ అటు వెళ్ళాడో, లేదో నల్లటి త్రాచుపాము ఒకటి మిద్దెమీద నుండి జారి, ఇంటి కప్పు లోపల పడింది. ముంగిస నేలమీద కూర్చొని గమనిస్తూండగానే అది కప్పు పైన పాక్కుంటూ సరిగ్గా ఉయ్యాల మీదికి చేరుకున్నది. అటుపైన ఉయ్యాల కట్టిన బట్ట వెంబడి జారుతూ పిల్లవాడు నిద్రపోతున్న పరుపుల మీదికే రాసాగిందది!

దానినే చూస్తూన్న ముంగిస అది తనకు అందుబాటులోకి రాగానే ఒక్క ఎగురు ఎగిరి, తటాలున దాని మెడ పట్టుకొని కొరికి, అలవోకగా ఆ త్రాచును ముక్కలు ముక్కలు చేసి, క్రింద పడేసింది.

ఇంక ఆ లోపల, అక్కడ రాజుగారి నుండి దానాలు ముట్టే వరకూ దేవశర్మ ప్రాణం ప్రాణంలో లేదు. అది తన చేత పడగానే ఇక అతను వెనక్కి బయలు దేరాడు. కొడుకు మీది ప్రేమ తనని త్వరపెడుతుంటే, కాళ్లు నేలమీద ఆననట్లు ఉరుకులు పరుగులుగా ఇంటికి పరుగు తీశాడు.

దూరం నుండే యజమాని అడుగుల చప్పుడు విన్నది ముంగిస. అతను ఇంకా ఇంట్లోకి రాకనే సంతోషంతో అతనికి ఎదురేగింది. అతని కాళ్లు చుట్టుకొని సంబరపడటం మొదలు పెట్టింది. పాముని కొరికి ముక్కలు చేసి ఉన్నది కదా, దాని నోటికి అంతా రక్తం అంటుకొని ఉన్నది. అందువల్ల అది నడచిన దారి పొడవునా దాని నోట్లోంచి రక్తపు బిందువులు కారినై.

ఆ విధంగా రక్తసిక్తమైన నోటితో ఎదురొచ్చిన ముంగిసను చూసి బ్రాహ్మణుడి గుండెలు తటతటా కొట్టుకున్నాయి. అంతులేని భయంతో అతని ఆలోచలను స్తంభించిపోయినై. అది తన కుమారుడినే చంపి వచ్చిందని నిశ్చయంగా అనిపించింది అతనికి! దాంతో‌ అతనికి కోపం మిన్ను ముట్టింది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. దగ్గరలోనే ఉన్న ఒక దుడ్డుకర్రను అందుకొని, మతి పోయినవాడి మాదిరి "పెంచిన విశ్వాసం కూడా లేదే, నీకు! నా గారాల కొడుకును, పసిబిడ్డను ఎట్లా కొరుక్కుతిన్నావే!" అని అరుస్తూ ఆ ముంగిసను ఇష్టం‌ వచ్చినట్లు మోదాడా పిచ్చి బ్రాహ్మణుడు. అతను కొట్టిన దెబ్బ ఒకటి నేరుగా ముంగిస తలకు తగిలేసరికి, అంతవరకూ అతని కాళ్ళే చుట్టుకొని తిరిగిన ఆ పిచ్చి ప్రాణి కాస్తా పాపం గుడ్లు వెళ్ళబెట్టి, నేలమీద పడి విల విలా తన్నుకుంటూ, పెద్ద అరుపొకటి అరచి ప్రాణం విడిచింది.

అట్లా ముంగిస ఉసురు పోసుకున్న బ్రాహ్మణుడు కొడుకు కోసం పరితపిస్తూ, బిగ్గరగా ఏడుస్తూ లోనికి పరుగుపెట్టాడు. చూడగా అక్కడ పరుపులో చెక్కుచెదరకుండా నిద్రపోతున్నాడు పిల్లవాడు!

వాడిని అట్లా సుఖంగా చూసేసరికి బ్రాహ్మణుడి గుండెమంట టక్కున చల్లారింది. గబగబా వెళ్ళి కొడుకును ఎత్తుకొని ముద్దాడేసరికి అతని మనసు తేలికైంది.

అంతలోనే ఆ వెనకగా, ఉయ్యాల ప్రక్కన ముక్కలు ముక్కలై పడి ఉన్న నల్లత్రాచును చూడగానే క్షణంలో సంగతి అర్థమైంది అతనికి- ముంగిస..! బాధతో, ఉద్రేకంతో గుండెలు బాదుకుంటూ, తల పట్టుకుంటూ, అరచేత్తో నుదుటిని కొట్టుకుంటూ అతను "ఈ నాటి వరకూ ఎక్కడా, ఎవ్వరికీ అంటని పాపం ఈ రోజున నాకు అంటిందే!' అని చాలా సేపు ఏడ్చాడు.

కాబట్టి, ఏ పనినైనా సరే, జాగ్రత్తగా ఆలోచించకుండా త్వరపడి చేయకూడదు" అని చెప్పింది దూరదర్శి.

దూరదర్శి మాటలు విన్న నెమలిరాజు చిత్రవర్ణుడు కొంచెం తగ్గి, ఆలోచించింది. అయినా ఒకింత సందేహంతో "మంత్రివర్యా! మీరు ఇప్పుడు చెప్పినదంతా సరైనదిగానే తోస్తున్నది. కానీ శత్రువు ఒకడు దండయాత్రకు వచ్చి, మన నగరాన్ని ఆక్రమించడం కోసం ఒకవైపున యుద్ధభేరి మ్రోగిస్తుండగా, మరొకవైపున "దీర్ఘంగా ఆలోచించి కానీ ఏ పనీ మొదలుపెట్టరాదు" అని చెప్పుకుంటూ ఆలస్యం చేయటం సరిగా అనిపించటం లేదు నాకు.

మన ఆలోచన తెగేసరికి నగరం అంతా నాశనమైపోవచ్చు కదా! కాబట్టి, వచ్చి పడిన ఈ ఆపదను ముందుగా తొలగించుకోవాలి- హిరణ్యగర్భుడి సంగతి తర్వాత చూసుకుందాములే, అతనిది ఏమి గొప్ప పని? నాకైతే- పోయి, సైన్యాన్ని సమకూర్చుకొని, శత్రువును ఎదుర్కొని, పోరాటం చేయటాన్ని మించిన మార్గం వేరే ఏదీ ఉన్నట్లు తోచదు. అయినా నీ మనసుకు ఇతర ఉపాయాలేమైనా తోస్తే చెప్పు.

ఆలోచించి, అందరికీ సమ్మతం అయిన మార్గాన్నే అవలంబిద్దాం" అన్నది.