నాగ సముద్రంలో నివసించే శివ, హరి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇంట్లోను, బడిలోను వీలైనంత అల్లరి చేయటం, లేని పోని కష్టాలు తెచ్చుకోవటం వాళ్ళకు అలవాటు.

ఒకసారి జనవరి 26న వాళ్ళ బడిలో రోజు గణతంత్ర్య దినోత్సవం జరిగింది. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం తయారయ్యేందుకు సమయం‌ పట్టిందనీ, 1950 జనవరి 26నుండీ మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ చెప్పారు బళ్ళో. హరికి, శివకి ఆ సంగతులేవీ పెద్దగా అర్థం కాలేదు గానీ, కార్యక్రమం అయిపోగానే బడి వదిలేస్తారని మటుకు తెలిసింది.

"ఒరే! బడి వదలగానే ఏం చేద్దాం?" గుసగుసగా అడిగాడు హరి.

"ఇంటికి పోవద్దు- వేరే ఎక్కడికైనా పోదాం, ఎటు?" అన్నాడు శివ.

"రాజుగారి తోటలో మామిడి కాయలకు వెళ్దాం" అన్నాడు హరి.

"అమ్మో! తోటమాలి ఉంటాడురా! పట్టుకున్నాడంటే ఊళ్ళో రచ్చ రచ్చ చేస్తాడు" భయంగా అన్నాడు శివ. "ఏం కాదులే! నా దగ్గర ఓ ప్లానుంది!" భరోసా ఇచ్చాడు హరి.

బడి వదలగానే ఇద్దరూ రాజుగారి తోట దగ్గరికి పరుగు లంకించుకున్నారు.

తోటకు అన్నివైపులా కంచె ఉంటుంది. రోడ్డుకు దగ్గర్లోనే పెద్ద గేటు కూడా ఉంటుంది. సామాన్యంగా తోటమాలులు ఆ గేటు దగ్గర్లోనే ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. హరి నేరుగా ఆ గేటు దగ్గరికి దారి తీశాడు-

"తోటమాలి గారూ! తోటమాలిగారూ!" అర్జంటుగా అరిచాడు.

"ఎవరది?!" తోటమాలి గేటు ప్రక్కనుండే అరిచాడు.

"తోటమాలి గారూ! మా అక్కకు చాలా కడుపు నొప్పిగా ఉన్నదటండి. మా అమ్మ పంపించిందండి. మిమ్మల్ని అడిగి రెండు మామిడి కాయలు కోసుకు రమ్మన్నదండి" చాలా జాలిగా మొహం‌ పెట్టి చెప్పాడు హరి.

తోటమాలి ఇద్దరికేసీ చూశాడు ఒక క్షణం- "సరే- పోయి కోసుకోండి- అటువైపున మామిడి చెట్లకు కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి. మీరు మంచి పిల్లల్లాగున్నారు- ఊరికే బయటినుండి రాళ్ళు వేయలేదు; కల్ల దూకి రాలేదు. అందుకనే ఒప్పుకుంటున్నాను. పోయి ఓ నాలుగు కాయలు కోసుకొని వచ్చేయండి, చకచకా" అన్నాడు.

"చూశావా?" అన్నట్లు కళ్ళతోటే సైగ చేసి తోటమాలి చూపినవైపు దారితీసాడు హరి. శివ చిరునవ్వులు నవ్వుకుంటూ అతన్ని అనుసరించాడు.

తోటలో మామిడికాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. అన్నీ చేతికందేంత ఎత్తులోనే ఉన్నాయి! పిల్లలు ఇద్దరూ గబగబా చాలా కాయలు కోసేసారు.

"పోదాం పదరా! తోటమాలి వస్తే కష్టం" వెనక్కి చూస్తూ అన్నాడు శివ.

"ఊరుకోరా, ఏం కాదు! వాడికి అసలు మనం వచ్చిన సంగతే గుర్తుండదు. తీరికగా కావలసినన్ని మామిడి కాయలు కోసుకొని కంచె అవతలికి పెట్టుకుందాం. బయటికి వెళ్ళాక అటునుండి అటే వాటిని ఎత్తుకు పోవచ్చు" అని మరిన్ని కాయలు కోసాడు హరి.

ఇద్దరూ తాము కోసిన మామిడికాయలను బయట కల్లలోకి చేరవేసారు.

"పోదాం పదరా!" అన్నాడు శివ. తోటమాలి వచ్చేస్తాడని వాడికి మా చెడ్డ అనుమానంగా ఉంది.

"ఆగు- ఒకసారి అటువైపుకు పోయొద్దాం-" కుడివైపున ఊరిస్తున్న అరటి తోట వైపుకు చూపిస్తూ అన్నాడు హరి. అరటితోట కాపుకు వచ్చి ఉన్నది. గెలలనిండా పండ్లు- అద్భుతంగా ఉన్నాయి. "ఒక్క గెల కోసుకొని వెళ్ళిపోదాం" అంతే. "వద్దులేరా! అనబోయిన శివ నోరు చటుక్కున మూతపడింది- "ఒక్క గెలనే కదా" అని అన్ని దిక్కులకూ‌ చూశాడు.

తోటమాలి దగ్గర్లో లేడు. "సరే" అని తలూపి, తనే ముందుకు దారి తీశాడు.

నేల నిండా అరటి ఆకులు, పట్టలు పడి ఉన్నాయి. పిల్లలిద్దరూ వాటిని తొక్కుకుంటూ అరటితోటవైపుకు దారి తీసారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో- వాళ్ళ కాళ్ళ క్రింది నేల కదిలింది! మరుక్షణం ఇద్దరూ ఓ బావిలో పడిపోయి ఉన్నారు! వాళ్ల హడావిడిలో‌ ఇద్దరూ ప్రక్కనే ఉన్న బావిని గమనించలేదన్నమాట.

ఇంకేముంది? ఇద్దరూ ఏడ్చారు, మూలిగారు, కేకలు పెట్టారు, గిజగిజలాడారు.

"వీళ్ళు ఇంకా రాలేదేమి?" అనుకుంటున్న తోటమాలి వాళ్ళ అరుపులు విని అటు పరుగెత్తుకొని వచ్చాడు. "ఇటువైపుకు ఎందుకు వచ్చార్రా మీరు?!" అని గుడ్లు ఉరిమాడు. అయితే మాత్రం ఏముంది? వీళ్ళు కదిలే పరిస్థితిలో కూడా లేరాయె! చివరికి వీళ్ళ గతి చూసి అతను మిగిలిన తోటలవాళ్ళను కూడా పిలిచాడు. అందరూ కలిసి తాళ్ళు, కట్టెలు అన్నీ వాడుకొని వీళ్ళను బయటికి లాగారు.

హరి, శివలకు ఇద్దరికీ కాళ్ళు చేతులు అన్నీ దోక్కుపోయాయి. ఒకటి రెండు చోట్ల ఎముకలు కూడా విరిగాయి. అందరూ వాళ్ళని బండికెత్తి నేరుగా ఇంటికి పంపారు. ఈ గందరగోళంలో వాళ్ళు కోసిన మామిడి కాయలన్నీ ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలీదు.

ఇక ఆ తర్వాత వాళ్ళకి వైద్యం చేయిస్తూ ఇంట్లోవాళ్ళు తిట్టని తిట్టు లేదు!