"టెక్కలి"లో ఒకనాటి సాయంత్రం. ఏటి ఒడ్డున ఒక కుర్రాడు మౌనంగా కూర్చుని, గలగలా ప్రవహిస్తున్న నీటినే చూస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఆ కుర్రాడిది ఇదే వరస. ఖాళీ సమయం దొరికితే చాలు, ఈ ఏకాంత ప్రదేశానికి చేరుకుంటాడు. ఇక్కడ కూర్చొని తనలో చెలరేగుతున్న ఆలోచనలకు పరిష్కారాలు వెతుక్కుంటాడు.

ఏటి నీరు తనకు నచ్చిన చోటుకు ప్రవహిస్తున్నట్లు, అతని మస్తిష్కం తనలో తలెత్తే ఊహలకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నది. బాధల్ని భరిస్తూ బ్రతుకు భారాన్ని మోస్తున్న జనులు- తిండి లేక తల్లడిల్లిపోతున్న జనులు- సమాజంలో పెట్రేగిపోతున్న అరాచకాలు- ఇవన్నీ అతనికి నిద్రలేకుండా చేస్తున్నాయి. తను చూసిన ప్రతి విషయాన్నీ, తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆలోచనాత్మకంగా పరిశీలించటం ఎంతో కాలంగా అతనికి అలవాటైపోయింది.

ఇతర దేశాలలో యువత పైకి ఎదుగుతున్నారు. కానీ మన దేశంలోని యువత? వ్యసనాలకు బానిసై, పూర్తిగా అడుగంటి పోతున్నది. నిర్వీర్యమైపోతున్న ఈ యువతను మేల్కొలిపేదెలాగ? చరిత్రను తిరగరాసి, మరో తరానికి అందించేదెలాగ? సమస్యలనేవే ఉండకూడదు మరో తరంలో!" -ఇలా సాగేవి అతని ఆలోచనలు.

కుర్రాడి ప్రవర్తన అతని కుటుంబ సభ్యుల్ని చాలానే ఆందోళనకు గురిచేసింది. అయినా అతని మీద వాళ్ళకు విశ్వాసం ఉంది. అతను ఏ తప్పూ చేయడని నమ్మకం ఉంది. కనుక వాళ్ళూ బయటపడి అతన్ని ఏమీ అనలేదు- అయినా.. సముద్రంలో‌ రేగే కెరటాలకైనా ఓ తీరం దొరుకుతుందేమో కానీ, అతని మనసులో రేగే ఆలోచనలకు మాత్రం ఎలాంటి తీరమూ దొరకట్లేదు.

నీటి ప్రవాహంలో రేగిన అలలు ప్రక్కనే ఉన్న తీరాన్ని తాకుతున్నాయి. శక్తి క్షీణించి నశిస్తున్నాయి. చల్లగాలిలో సేదతీరుతూ కొద్దిసేపు ఈ లోకాన్ని మరచిపోయాడతను.

హఠాత్తుగా ఎవరో తనను పిలవటంతో ఉలిక్కిపడి చూశాడు- చేతిలో చపాతీల బాక్సు, శాలువతో అతని అక్క. "తమ్ముడూ! నీ కోసం అమ్మ చపాతీలు పంపించింది. ఈ రోజు చపాతీలు అమ్మ, నేను కలసి చేశాము. చలికాలం కదా, బాగా చలివేస్తుంది- అందుకని అమ్మ ఈ శాలువా కూడా పంపించింది. చీకటయ్యేసరికల్లా ఇంటికి రమ్మని చెప్పింది" తమ్ముడికి చెప్పి, వేగంగా వెనుదిరిగి పోయిందామె.

అమాయకత్వంతో నిండిన అతని కళ్లు ఇప్పుడు ప్రకృతి అందాలవైపు మరలాయి.. "ప్రకృతి నిజంగా ఎంత స్వచ్ఛమైనది కదా!" అనుకున్నాడతను. "స్వార్థ పథాన సాగే జన జీవనం ప్రకృతిని కలుషితం చేసింది.. స్వచ్ఛత అంటే ఏంటో కూడా తెలియకుండా పోయింది.." చీకటి కావస్తున్నది. "జ్ఞానం కన్నా ఆలోచనాశక్తి గొప్పది" ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయతనికి.
అక్కడి నుండి లేచి వీధిలో నడవసాగాడతను. పట్నం దగ్గరికి వచ్చేసరికి ఓ బిచ్చగాడు కనబడ్డాడు- అతనో ముసలివాడు. పొట్ట వెన్నెముకకు అంటుకుపోయి ఉన్నది. అతని కళ్ళు ఉబ్బి గాలితోటీ, నీటితోటీ నిండినఅతని కడుపును ప్రతిఫలిస్తున్నాయి. బక్క చిక్కిన అతని శరీరం చలికి లేత ఆకు మాదిరి వణుకుతున్నది.

"ప్రపంచంలో ఎన్నెన్ని సమస్యలున్నాయో.. అసలు ఈ సమస్యలకు అన్నింటికీ కారణం ఏంటి? పరిష్కారం ఏంటి?" అని మొనదేలిన సూదులు గుచ్చినట్లు గుచ్చే ప్రశ్నలు..

"అసలు ప్రశ్నలు తలెత్తితే చాలు. సమాధానాలు అందరూ ఆలోచించగలరు; తెలుసుకోగలరు. అన్ని సమస్యలకూ కారకులు మానవులే.. కనుక వాళ్ళు ప్రశ్నిస్తే ఇక జవాబులు దొరక్కపోవటం అంటూ ఉండదు.." అనుకున్నాడతను.

"తాతా! ఎందుకు ఇట్లా బిచ్చమెత్తుకుంటున్నావు? ఎక్కడైనా కష్టపడి పని చేయచ్చు కదా" అడిగాడు పైకి.

"ఏం చెప్పమంటావు నాయనా! 'ముసలివాణ్ణి' అని ఎవ్వరూ నాకు పని ఇవ్వటం లేదు. నాకు కూడా ఏమంత సత్తువ లేదు- చేతులు, శరీరం సహకరించటం లేదు. ఆ భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడో. ఇన్ని కష్టాలకూ కారణం ఆ భగవంతుడే..." అని ఇంకేదో చెప్పబోయాడు తాత.

కుర్రాడు అతన్ని ఖండిస్తూ "లేదు తాతా, అసలు దేవుడంటూ ఉంటే నా కష్టం తెలుసుకునేవాడు; నీ కష్టాన్ని తీర్చేవాడు. మన సమస్యలు అన్నింటికీ‌ మనమే కారణం. కష్టంలో దేవుడి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఉన్న సంతోషాలు దూరమవుతాయి. ఎంత దు:ఖం ఉన్నా సరే మన ఆనందాన్ని మనమే వెతుక్కుంటూ పోవాలి- అదే అసలైన బ్రతుకు. ఇదిగో.. ఇవి తీసుకో" అని చపాతీల బాక్సు, శాలువా అతని చేతిలో పెట్టాడు.

"బాబూ! నాకు ఇచ్చేస్తున్నావ్, మరి నీకు?" అడిగాడు ముసలాయన.

కుర్రాడు చిన్నగా నవ్వి, "తాతా! నీలో సత్తువ పోయింది. రాత్రికి రాత్రి ఎలాగూ బిచ్చం అడుక్కోలేవు. ఇది తీసుకొని తిను. ఇక నాకు- ఇవాల్టికి ఇది లేకపోయినా పర్వాలేదు. ఎలాగూ ఇంటికి వెళ్తున్నానుగా?! నాలో సత్తువ చాలా ఉంది. మా అమ్మ కనిపించే దేవత. దేవతలాంటి అమ్మ ఉన్నంత వరకు నాకు కష్టం రాదు. అయినా నేను కష్టాన్ని చూసి కష్టపడనులే" అన్నాడు కుర్రాడు.

కష్టానికి భయపడని ఈ కుర్రవాడు, సమాజంలో సమూలమైన మార్పు కోసం ఏదో చెయ్యాలని తపిస్తున్న ఓ సంఘసంస్కర్త. ప్రకృతిని కాపాడే ఓ రక్షకుడు. ఎవరేమనుకున్నా, అతని ఆలోచనల్లో మాత్రం ఒక మెరుపు ఉంది-

"మన పుస్తకాలలోని గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చేగువేరా లాంటి వాళ్ళు కారు, ఈనాడు మనల్ని శాసిస్తున్న రాజకీయ నాయకులు. మన ప్రజలూ అలాంటి వారే- ఎవడికి ఏది నచ్చితే అదే వాడికి రైట్. అంతే తప్ప, అది 'మంచా-చెడా' అని ఆలోచించడు... ఈ పరిస్థితుల్లో మన సమాజాన్ని మార్చాలంటే కష్టమే- కానీ మార్చగలం" అనుకునే యుగకర్త అతను.