మామయ్య:
ఒరేయ్ బుజ్జీ! నేను నీకు పది చాక్లెట్లు ఇచ్చాననుకో; అందులోంచి నువ్వు చెల్లికి ఐదు ఇచ్చావనుకో. ఇంకా నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి రా?
బుజ్జి: రెండు ఉంటాయి మామయ్యా!
మామయ్య: ఒరేయ్! నీకు అసలు లెక్కలే రావు! రెండెందుకుంటాయిరా?
బుజ్జి: నాకు లెక్కలు వచ్చు మామయ్యా! చెల్లికే రావు! -లలిత, ఎనిమిదవ తరగతి, గుండువారిపల్లె


రెండుకు ముందు!
టీచర్: శీనూ! నీకు ఒకటి తెలుసా?
శీను: ఆఁ తెలుసు టీచర్- రెండుకు ముందు వచ్చేదే కదా?!

ఎవరిగోల వారిది!
నాన్న: ఒరే చింటూ! ఎందుకురా ఏడుస్తున్నావు?
చింటు: మన ఇంటికి బంధువులు వస్తున్నారు నాన్నా! అందుకని.

ఎవరేం తెస్తారు-ఎవరేం ఇస్తారు నాన్న: బంధువులు ఒట్టి చేతుల్తో రారు- మనకోసం ఏమైనా తెస్తారు; అందుకని మనం ఇంకా సంతోషంగా ఉంటాలి కదరా, ఏడుస్తారా ఎవరైనా?!
చింటు: ఏం తెచ్చినా ఏం లాభం నాన్నా! మనింట్లో ఉన్నవన్నీ వాళ్ళు తినేస్తారు కదా?!
లలిత, ఎనిమిదవ తరగతి, గుండువారిపల్లె

త్వరగా పోదాం! టీచర్: సమయపాలన అంటే ఏమిటి చందూ?
చందు: గంట కొట్టగానే క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్లిపోవడం టీచర్!
లలిత, ఎనిమిదవ తరగతి, గుందువారిపల్లె


ఇద్దరు విద్యార్థుల పోటీ...
మొదటి విద్యార్థి: నీకు మానవ శరీరం గురించి అంతా తెలుసన్నావు కదా! నిన్నో ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పు.
రెండవ విద్యార్థి: నువ్వేదడిగినా 'ఠకీ ఠకీ' మని చెప్పేస్తా.. అడుగు..
మొదటి విద్యార్థి: మన తలపై ఎన్ని వెంట్రుకలుంటాయి?
రెండవ విద్యార్థి: ఆ ఇదేంటి.. సరేలే..' ఠకీ ఠకీ'.
మొదటి విద్యార్థి: ఏంటిరా, జవాబు తెలీదా, "ఠకీ ఠకీ" అని గుటకలేస్తున్నావ్...
రెండవ విద్యార్థి: రే..! ఇవి గుటకలు కాదురా...చెప్పాను కదరా,'ఠకీ ఠకీ' మని ఆన్సర్ చెప్తానని..
చదువుల క్రాంతి,ఇంటర్మీడియట్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా


చవక బేరం!
రాజు: నిన్నటి న్యూస్‌పేపర్‌ కొన్నావెందుకు?
వెంగళప్ప: చవకగా ఇస్తేనూ... Y. బాలాజి, ఎనిమిదవ తరగతి, గుండువారి పల్లె


రేపు ఇస్తాను!
సుబ్బారావు: మీ బాస్ పోయిన నెల నుంచి జీతం ఎక్కువగా ఇస్తున్నాడట?
అప్పారావు: ఆ అవును ఒట్టి చెక్కులిచ్చాడు. ఇలాగే పని చేస్తే వచ్చే ఏడాది సంతకం పెడతాడట! Y. బాలాజి, ఎనిమిదవ తరగతి, గుండువారి పల్లె


ఫ్యానుంటే చాలు! బాబు: నాన్న సినీహీరోలు చల్లగావుంటారెందుకు?
నాన్న: వాళ్లకి ఫాన్స్ ఎక్కువగా ఉంటారు బాబు.
వి.వి.యస్.మూర్తి గారు, చొదిమెళ్ల గ్రామం


కోడిగుడ్డు కథ! నాన్న: ఒరే కార్తీక్! పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయిరా?
కార్తీక్: కోడి గుడ్డులా ఉంటుంది, కానీ గుడ్డు కాదు ఏమిటది?
నాన్న: ఏమోరా, తెలీదు- నువ్వే చెప్పురా!
కార్తీక్: సున్నా నాన్నా! అమాత్రం‌తెలీదూ?!
`లలిత, ఎనిమిదవ తరగతి, గుండువారిపల్లె

తమాషా ప్రశ్నలు
1. న్యాయాధికారి వెయ్యలేని శిక్ష జ: పెద్దబాలశిక్ష
2. నీరు లేని బావి (వెల్) జ: ట్రావెల్
3. పూజకు పనికి రాని పత్రి జ: ఆసుపత్రి
4. ఎక్కడా కనబడని కులం జ: గోకులం
Y. బాలాజి, ఎనిమిదవ తరగతి, గుండువారి పెల్లె



పొడుపు కథలు
1. ఒంటి కన్ను వాడు పరుగు పరుగున కంచె వేస్తాడు. ఎవరు?
2. అన్నదమ్ములు ముగ్గురు-అలుపు లేకుండా తిరుగుతాడు.
3. ఒంటి నాలుకవాడు ఆకాశంలో వేలాడు తాడు, నాలుక లాగితే ఠంగుమంటాడు.
4. దేశాలన్నీ చుట్టేస్తుంది, కానీ దేశంలోకి వెళ్లలేదు.
5. సీలు చేసిన కోటలో అన్నదమ్ములిద్దరు బద్దలు కొడితే బయట పడతారు.
6. ఒంటికాలి సుబ్బన్నకి తల బరువు అయినా తిరుగుతూ గంతులేస్తాడు
7. కడుపునిండా తింటే ఆకాశం లోకి ఎగురుతాడు.
గౌతమి, ఏడవ తరగతి, Z.P.H.స్కూల్, గుండువారిపల్లె

సమాధానాలు
1. సూది 2. ఫ్యాన్ 3. గంట 4. ఓడ 5. వేరుశెనగ 6.బొంగరం 7. బెలూన్

తెలుగు జాతి కవిత:
తెలుగు జాతి పిల్లలం
తెలుగు గడ్డ పిల్లలం
తెలుగు జాతి గొప్పదని
వెలుగెత్తి చాటుదాం
తెలుగు జాతి ఘన కీర్తి
నలమూలల చాటుదాం
తెలుగుభాష తియ్యనిదని
తెలుగుజాతి మధురమని
తియ్యనైన భాష
తెలుగు భాషని
గొంతెత్తి పాడుదాం
c.గిరీష్, ఎనిమిదవ తరగతి, pvrzphs, గుండువారిపెల్లె