మదనపల్లిలో అర్జున్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళింట్లో అతను, వాళ్ళ అమ్మ ఇద్దరే ఉండేవాళ్ళు. వాళ్ళమ్మ అక్కడే ఓ కంపెనీలో అకౌంటెంటుగా పనిచేసేది.

అర్జున్‌కి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఇంట్లో పాటలు వింటూనే ఉండేవాడు. ఎక్కడికి పోయినా పాటలు పాడుతూనే ఉండేవాడు. బాగా చదివేవాడు కూడా. ఎప్పుడూ టీచర్లు అర్జున్‌ని పొగిడేవారు. తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవాడు. సంగీతం అంటే వాడికి ఉన్న అభిమానం చూసి, వాళ్లమ్మ వాడికి శాస్త్రీయ సంగీతం కూడా నేర్పించటం మొదలు పెట్టింది. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచాక, సంగీతం పోటీల్లో కూడా పాల్గొని గెలిచాడు అర్జున్.

ఒక ఆదివారం నాడు వాళ్ల అమ్మవాళ్ళ చిన్ననాటి మిత్రులు కొందరు ఊరికి వచ్చారని సమాచారం అందింది. తన మిత్రులని చూడటానికని మధ్యాహ్నం అనగా అమ్మ ఆటోలో వెళ్లింది. అర్జునేమో, పాటలు వింటూ ఇంట్లోనే కూర్చున్నాడు. ఒంటి గంట అయ్యింది; అమ్మ ఇంకా రాలేదు. "వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి సాయంత్రంగా వస్తుందేమో, మాట్లాడుకుంటున్నారేమో" అనుకున్నాడు అర్జున్. సాయంత్రం నాలుగు గంటలయింది. అమ్మ ఇంకా రాలేదు..

కానీ అరగంట తర్వాత ఎవరో ఒకాయన వాళ్ళ అమ్మని ఎత్తుకుని వచ్చాడు- తన ముఖం అంతా రక్తం. శరీరం అంతా కాలి ఉంది. వాళ్ల అమ్మని ఆ స్థితిలో చూసిన అర్జున్ కళ్ళు తిరిగి పడిపోయాడు!

అర్జున్ కళ్ళు తెరిచే సరికి వాళ్ళ ఇంట్లో లేడు: మంచం, పరుపు చూస్తే ఏదో హాస్పిటల్ లాగా ఉన్నది- అతను పైకి లేచి చుట్టూతా చూశాడు- గోడల మీద 'శ్రీనివాస్ హాస్పిటల్' అని రాసి ఉంది. ముందు "నేను ఇక్కడెందుకున్నాను? అమ్మ ఏది?" అని ఆలోచించాడు అర్జున్.

అకస్మాత్తుగా గుర్తుకువచ్చింది- "అమ్మ ఇక లేదు. చనిపోయింది!"

అర్జున్‌కి వెంటనే ఏడపొచ్చింది. గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. అది విని ఆసుపత్రిలో నర్సులు పరుగెత్తుకొని వచ్చారు. వాళ్ల అమ్మని ఎత్తుకొచ్చినాయన కూడా వాళ్ళ వెనకనే పరుగెత్తుకొని వచ్చాడు- "ఎలా ఉన్నావు నాన్నా? బానే ఉన్నావు కద?!" అని అడిగాడు.

"మా అమ్మ కావాలి!" అని ఏడ్చుకుంటూ‌ చెప్పాడు అర్జున్.

"ఏం పరవాలేదులే బాబూ! ఏడవకు! నేను ఉన్నాను కదా! ఏడవద్దు. నా పేరు అరవిందరావు. ఇప్పట్నించి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను" అని ఊరడిం-చాడాయన.

పది రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత అర్జున్‌ని అరవిందరావుగారు తన ఇంటికి తీసుకెళ్ళారు. ఆ ఇల్లు బాగున్నది. చాలా పెద్దగా, విశాలంగా, అందంగా- కానీ అది అర్జున్ ఇంటిలాగా లేదు! అక్కడికి వెళ్ళాక అర్జున్‌ మనసులో విచారం మరింత ఎక్కువైంది.

ఆ రోజునించి ఇక అతని జీవితంలో అస్సలు పాటలు లేవు. ఎవరైనా ఏమైనా అడిగితేనే మాట్లాడేవాడు అర్జున్. లేకపోతే విచారంగా ఒకచోట కూర్చునేవాడు.

అరవిందరావుగారు అర్జున్‌ని చాలా ఆదరించేవారు; బాగా చూసుకునేవారు; తను ఉన్నప్పుడంతా పలకరించి మాట్లాడించేందుకు ప్రయత్నిస్తూ ఉండేవారు- కానీ "ఆయనతో నాకెందుకు? నాకు మా అమ్మ కావాలి!" అనిపించేది అర్జున్‌కి. ఎప్పుడు చూసినా వాళ్ల అమ్మ చిత్రం పట్టుకుని కూర్చుని ఉండేవాడు అతను. వేరే ఎవ్వరినీ తన తల్లి చిత్రాన్ని ముట్టుకోనిచ్చేవాడు కాదు.

అప్పుడప్పుడూ అరవిందరావుగారు ఓ గదిలోకెళ్ళి, తలుపులు వేసుకొని, తంబూర మీటుతూ సంగీతం పాటలు పాడేవారు. ఆయన గొంతు అద్భుతంగా, అందంగా, లోతుగా, గంభీరంగా ఉండేది. అయినా అర్జున్ తన నోరు విప్పలేదు. తనలోని సంగీతం ఏదో‌ మూగబోయినట్లు అనిపించిందతనికి.

ఒకసారి అరవిందరావుగారు అడిగారు- "నీకు సంగీతం నేర్పించలేదా, అమ్మ?" అని.

"నేనే.. నేర్చుకోలేదు.." అనేశాడు అర్జున్.

"సంగీతం బలే ఉంటుంది- గొంతెత్తి పాడితే హృదయం తేలికౌతుంది!" అన్నారు అరవిందరావు గారు.

అర్జున్ ఏమీ మాట్లాడలేదు.

కొన్నాళ్ళు గడిచాక, అరవిందరావుగారు "అర్జున్, నువ్వెప్పుడైనా నీ కుటుంబ చిత్రాలు చూశావా?" అని అడిగారు.

"నేను, మా అమ్మ చాలా ఫొటోలు దిగాం" చెప్పాడు అర్జున్.

"అవి కాదు, నేననేది- మీ కుటుంబ చిత్రాలు- మీ అమ్మమ్మ-తాతయ్యలవి; నానమ్మ-తాతయ్యలవి; మీ అమ్మ-నాన్నలవి; బంధువులవి- అవి చూశావా, ఎప్పుడైనా?"

అడిగారు అరవిందరావుగారు.

"లేదు" అన్నాడు అర్జున్. "అట్లాంటివేమీ లేవు మా ఇంట్లో"

"నా దగ్గర ఉన్నాయి- చూపించనా?" అన్నారు అరవిందరావు గారు.

అర్జున్ ఏమీ మాట్లాడలేదు. తన కుటుంబ చిత్రాలు ఆయనకెక్కడివి?

అరవిందరావుగారు తమ కుటుంబ చిత్రాలు తెచ్చి అర్జున్ ముందు పెట్టారు. ఒక్కొక్కరి ఫొటో చూపిస్తూ "ఇదిగో, ఈయన మీ తాత. ఈమె మీ అమ్మమ్మ. ఈవిడ మీ‌ నానమ్మ. ఈయన మీ నాన్న వాళ్ళ నాన్న. ఇదిగో, మీ అమ్మ చిన్నప్పటి ఫొటో చూడు- ..ఇది మా పెళ్ళి ఫొటో-"

అర్జున్‌ ఒక్క ఉదుటన లేచి చూశాడు- ఫొటోలో చిన్నప్పటి అమ్మ, చిన్ననాటి అరవిందరావుగారు- వాళ్ళిద్దరి పెళ్ళి ఫొటోనే అది!

"మీరు- " ఆగిపోయాడు అర్జున్.

"మీ నాన్నను." అన్నారు అరవింద-రావుగారు.

"మీరు మా నాన్న ఎందుకౌతారు?" అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా.

"నువ్వు పుట్టేముందు నేనూ, మీ అమ్మా దేని గురించో కొట్టుకున్నాము. కోపం వచ్చి విడిపోయాము. ఆ తర్వాత నేను మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ మీ అమ్మ కోపం తెలుసు గనక ధైర్యం చాలక, ఊరుకున్నాను. ఆ రోజున నేను ఆఫీసునుండి వస్తుంటే ఆటో బస్సును ఢీకొనటం చూశాను. ఆటోలో ఎవరున్నారని చూస్తే, మీ అమ్మ! తనని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నిన్నూ ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. నీకేమౌతుందోనని భయపడ్డాను- దేవుడి దయవల్ల నీకేమీ కాలేదు" చెప్పారు అరవింద రావుగారు.

అర్జున్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాడు చటుక్కున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు- మధ్యాహ్నం అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు.

ఆరోజు సాయంత్రం అరవింద రావుగారు సంగీతం సాధన చేస్తుంటే మెల్లగా గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు అర్జున్. కొద్దిసేపటి తర్వాత వాడు ఆయన గొంతుతో గొంతు కలిపాడు. అరవిందరావుగారు ఆశ్చర్యంగా చూశారు వాడి వంక. వాడి పాటని సున్నితంగా సరిదిద్దారు.

మూగవోయిన కోయిలకు మళ్ళీ పాట వచ్చింది... ఇక అర్జున్ మళ్ళీ ఎప్పటిలాగే మామూలు అర్జున్ అయిపోతాడు.