రాజేష్ వాళ్ళ ఇంటికి నాలుగిండ్ల అవతల శివతేజ వాళ్ళ ఇల్లుంది. రాజేష్, తేజ హైస్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నారు. బడికి వెళ్ళేటప్పుడు ఇద్దరూ కలిసే వెళతారు; వచ్చేటప్పుడు కలిసే వస్తారు. బడిలో కూడా ప్రక్క ప్రక్కన కూర్చుంటారు. సాయంత్రం ఇంటి దగ్గర కలిసే ఆడుకుంటారు. మళ్ళీ సాయంత్రం ఆటల తరువాత కలిసే చదువుకుంటారు.

ఎంతసేపు చదివినా తేజ మటుకు చదువులో కొంచెం వెనకే ఉంటాడు. ఇక రాజేష్‌కి ఎప్పుడూ మొదటి ర్యాంకు వస్తుంటుంది; రెండవ ర్యాంకు మరో పిల్లాడు రంగనాథ్‌కి వస్తుంది.

అయినా రాజేష్ తన మార్కుల్ని పెద్ద పట్టించుకోడు- తేజకు చదువు చెబుతుంటాడు; అతనికి మంచి మార్కులు తెప్పించడానికి శత విధాలా ప్రయత్ని-స్తుంటాడు:

"రాజేష్! ఫ్లయింగ్ అంటే ఏమిటి?" ఒక్కోసారి అర్థాలు అడుగుతుంటాడు తేజ.

"ఫ్లయింగ్ అంటే ఎగరడం. పక్షులు ఎగురుతాయి గదా, అది!" వివరిస్తాడు రాజేష్.

"రాజేష్! ఈ జవాబేదో చాలా పెద్దగా ఉంది- గుర్తుండట్లేదు" ఒక్కోసారి బెంగ పడు-తుంటాడు తేజ.

"సులభం, తేజా! ప్రతి పాయింటు ముందు ఒకటి- రెండు అని నెంబర్లు వేసుకో; వాక్యాలను ఆ నంబర్లతో బాటు ఒక వరసలో చదువుకొని చూడు- ఎంత పెద్ద జవాబైనా సులభంగా వస్తుంది-" అని ధైర్యం చెబుతుంటాడు రాజేష్.

"రాజేష్! నాకీ లెక్క అర్థం కావడం లేదు!" ఫిర్యాదు చేస్తుంటాడు తేజ.

"ముందు నీకు సూత్రం రావాలి తేజా! సూత్రం అర్థం అయిందంటే ఇక లెక్క సులభంగా చేయగలవు" అని సూత్రాన్ని వివరిస్తుంటాడు రాజేష్.

ఇలా తేజాకే కాదు, తరగతిలో ఎవరికి, ఏది అర్థం కాకపోయినా ఓపికగా అర్థమయ్యేలా వివరిస్తాడు అతను. అందుకనే పిల్లలందరికీ రాజేష్ అంటే చాలా ఇష్టం. ఉపాధ్యాయులు కూడా చాలా గర్వపడుతుంటారు అతని వ్యక్తిత్వాన్ని చూసి. ఎందుకంటే, చదువులోనే కాదు- చిత్రలేఖనంలోను, వ్యాస రచన-వక్తృత్వ పోటీల్లో కూడా అన్ని ప్రైజులూ రాజేష్‌కే వస్తుంటాయి!

ఇట్లా అన్నింటా మొదటి స్థానంలో ఉండే రాజేష్‌ని చూస్తే రంగనాథ్‌కి చాలా అసూయ. ఎలాగైనా తను కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని రంగనాథ్ చాలా ప్రయత్నిస్తుంటాడు; కష్టపడి చదువుతాడు కూడా- కానీ ప్రతిసారీ పరీక్షల్లో ఏదో తప్పుచేసి ఒకటో, రెండో మార్కులు రాజేష్ కంటే తక్కువ తెచ్చుకుంటాడు! దానితో రాజేష్ మీద రోజు రోజుకూ కసి ఎక్కువయ్యింది అతనికి. అర్ధ వార్షిక పరీక్షలు అయ్యాయి- అందరూ 'బాగా రాశాం'అని సంతోషపడ్డారు. ఆ వెంటనే క్రిస్‌మస్-సంక్రాంతుల కోసమని పది రోజులు సెలవులు కూడా ఇచ్చారు. పిల్లలంతా ఆటల్లో మునిగారు.

కానీ సెలవులు ఇంక రేపటితో ఐపోతాయనగా, రాజేష్ కోతి కొమ్మచ్చి ఆడుతూ చెట్టుమీదినుండి క్రింద పడ్డాడు- పాపం, అతని కాలు విరిగింది!

డాక్టరుగారు కాలికి పిండి కట్టు వేసి, మూడు వారాల పాటు ఇంట్లోనే ఉండమన్నారు! రాజేష్‌కి ఏడుపు ఆగలేదు: బడి తెరిచిన రోజునే అన్ని సబ్జెక్టుల్లోనూ మార్కులిస్తారు మరి! ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది అతనికి. ఆ రోజు సాయంత్రం తేజ పరుగెత్తుకొచ్చాడు. దిద్దిన జవాబు పత్రాలను రాజేష్‌ వాళ్ల ఇంటికి పంపించారు మాస్టారు: ఈసారి కూడా మొదటి ర్యాంకు రాజేష్‌దే ! తేజాకి కూడా గతంలో కంటే మంచి మార్కులు వచ్చాయి!

ఆ రోజున తేజ వాళ్ళమ్మ రాజేష్‌కి ధన్యవాదాలు చెప్పింది. "నీవల్లనే తేజాకి మంచి మార్కులు వచ్చాయి" అని మెచ్చుకున్నది. అయితే అక్కడ రంగనాథ్ చాలా సంతోషించాడు- "రాజేష్‌కి కాలు విరిగింది! మూడు వారాలు బడికి రాడు! ఈసారి ఫస్టు ర్యాంకు నాదే!" అని.

అయినా అతనికి రాజేష్ మీద ఉన్న అక్కసు తగ్గలేదు- 'రాజేష్ స్నేహితుడైన తేజాను చెడగొడతాను చూడు- వాడు ఏం చేస్తాడో‌ చూస్తాను' అనుకున్నాడు.

మరుసటి రోజు అసెంబ్లీలో తేజ పక్కన నుంచున్నాడు రంగనాథ్: "ఏయ్ తేజా! నీ ఫ్రెండ్ రాజేష్ రావడం లేదు కదా! మా బెంచీలో నా దగ్గర కూర్చో. నీకు అర్థం కానివి చెబుతాను" అన్నాడు కొంటెగా. తేజా వెళ్ళి రంగనాథ్ దగ్గర కూర్చున్నాడు. ఫస్టు పీరియడ్‌లో లెక్కలు మాష్టారుగారు లెక్కలు చెప్తున్నంతసేపూ రంగనాథ్ ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు: ఆరోజున లెక్కలేమీ అర్థం కాలేదు తేజకి. రంగనాథ్ అన్ని పీరియడ్లలోనూ అలాగే చేశాడు: చివరికి మాష్టారిచ్చిన నోట్సును కూడా పూర్తిగా రాసుకోలేదు తేజ-

"ఏంటి తేజా, ఇట్లా రాశావు? ఏ ఒక్క అంశమూ పూర్తిగా రాసుకోలేదు- ఏమైంది?" అడిగాడు రాజేష్, ఆరోజు సాయంత్రం నోట్సులు చూస్తూ.

రంగనాథ్ ఏం చేశాడో వివరంగా చెప్పాడు తేజ. "రేపటి నుండీ అతని దగ్గర కూర్చోకు- సుధీర్ దగ్గర కూర్చో. సుధీర్ మంచివాడు; నీకు సహాయం చేస్తాడు!" అన్నాడు రాజేష్.

కాని స్కూల్లో రంగనాథ్ తేజాను వదలలేదు; పాఠాలు విననివ్వలేదు.

ఇక ఆరోజు సాయంత్రం రాజేష్ దగ్గరకి వెళ్ళటానికి భయపడ్డాడు తేజ. ఇక ఆరోజు మొదలుకొని రాజేష్‌కి కనిపించటమే మానేశాడు అతను!

తర్వాతి రోజున రాజేష్ వాళ్ళింట్లో‌ పని చేసే శాంతమ్మను పంపించాడు- "శాంతమ్మా! తేజ ఎందుకనో ఇటువైపుకు రావటం లేదు. ఏం జరిగిందో కొంచెం కనుక్కురావా?" అని. "తేజ ఇప్పుడింక ఇటు రాడట. రంగనాథ్‌ వాళ్ళ ఇంట్లోనే చదువుకుంటున్నాడట" వెళ్ళి వచ్చాక చెప్పింది శాంతమ్మ. ఆశ్చర్యపోవడం రాజేష్ వంతయ్యింది. "సరేలే" అని మరో స్నేహితురాలు సుజాత దగ్గర నుండి నోట్సు తెప్పించుకొని, తన నోట్సులన్నీ పూర్తి చేసుకున్నాడు అతను. ఏ రోజుకారోజు బడిలో చెప్పిన పాఠాలను తనే సొంతగా చదువుకుంటున్నాడు: అర్థం కాకపోతే వాళ్ళ నాన్న గారితో చెప్పించుకుంటున్నాడు.

ఇక అక్కడ, రంగనాథ్ స్నేహంతో తేజ చాలా పాడైపోయాడు. ఇప్పుడతను పాఠాలు వినడంలేదు; నోట్సులు రాయడంలేదు; అస్సలు చదవడంలేదు.

ఆరోజున రంగనాథ్ తేజతో "తేజా! రేపు చెరువులో ఈత కొడదాం, నువ్వు ప్రొద్దునే చెరువు దగ్గరికి రా!" అన్నాడు.

"బడి ఉంది కదా, ఎలా?" అన్నాడు తేజ అమాయకంగా.

"ఒక్క రోజు బడికి వెళ్ళకపోతే ఏమీ అవ్వదులే" దబాయించాడు రంగనాథ్. కానీ ఆ రోజున తేజ చెరువుకు వెళ్ళగానే అతను వచ్చి తరగతిలో కూర్చున్నాడు. ఆరోజు సాయంత్రం తేజ కనిపిస్తే "నేనూ వద్దామనుకున్నానురా, తేజా! కానీ దారిలో మాష్టారుగారు కనిపించేసి, నన్ను సైకిలెక్కించుకొని బడికి తీసుకెళ్ళిపోయారు. ఇంక నేను తప్పించుకోలేకపోయాను. రేపు వస్తానులే" అన్నాడు.

అనటమైతే అన్నాడు, కానీ రెండోరోజున కూడా అతను చెరువు దగ్గరికి వెళ్ళనే లేదు! ఆలోగా తేజాకు అక్కడ చెరువులో గొడ్లను మేపుకుంటున్న పిల్లలు కొంతమందితో పరిచయమైంది. ఇంక వాడు రోజూ బడికి వెళ్ళకుండా వాళ్ళతో ఆడుకోవటం మొదలు పెట్టాడు!

త్వరలోనే మళ్ళీ యూనిట్ పరీక్షలు వచ్చాయి. రాజేష్ పరీక్షలకు మాత్రమే వచ్చి పోతున్నాడు. పరీక్ష రాయగానే అతన్ని వాళ్ళ నాన్నగారు సైకిల్ మీద తిరిగి తీసుకెళుతున్నారు. ఒక రోజున రాజేష్‌కి తేజ ఎదురుపడ్డాడు- ఏదో తప్పు చేసిన వాడిలాగా తల దించుకొని వెళ్ళిపోయాడు- రాజేష్ నవ్వినా అతను నవ్వలేదు!

కొద్ది రోజులకు పరీక్షాఫలితాలు వచ్చాయి. ఏ రోజుకారోజు బడికి రాకపోయినా రాజేష్‌కే మొదటి ర్యాంకు వచ్చింది. ఎవరినో పాడు చేద్దామనుకొన్న రంగనాథ్‌ తాను కూడా సరిగ్గా చదవలేకపోయాడు. వాడికి ఈసారి ఐదో ర్యాంకు వచ్చింది! "చెరపకురా చెడెదవు" అనే సామెత నిజమైంది.

తేజకైతే అన్నింట్లోనూ చాలా తక్కువ మార్కులు వచ్చాయి. కొన్నిటిలో‌ పరీక్ష తప్పాడు కూడాను.

మాస్టరుగారు తేజ వాళ్ళమ్మను బడికి పిలిపించారు: "ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి?" అని వాడిని గదమాయించారు.

పూస గుచ్చినట్లు అంతా చెప్పాడు తేజ.

మాస్టారుగారు రంగనాథ్‌ని కూడా కోప్పడ్డారు. "ఇతరులకు సాయం చేయడానికి ముందుండాలి. కాని ఇలా తప్పుడు పనులు చేయించి ఇతరులను పాడుచేయకూడదు. అదీకాక నీకు మార్కులు ఎందుకు తగ్గుతున్నాయో, ఎక్కడ తప్పు చేశావో చూసుకొని, ఆ తప్పు మరలా చేయకుండా ఉండాలి కాని, ఇతరులమీద అసూయ పడితే నీకేం వస్తుంది?" అని మంచి మాటలు చెప్పారు.

"రాజేష్! మావాడికి ఇదివరకటిలాగా చదువులో సహాయం చెయ్యవా?!" తేజ వాళ్ళమ్మ బ్రతిమాలింది రాజేష్‌ని.

"నేను తేజకి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాను గానీ, వాడే- నన్ను తప్పించికొని తిరుగుతున్నాడు. ఇప్పటినుండీ మళ్ళీ మేమిద్దరం కలిసి చదువుకుంటాము. తేజ నా మిత్రుడు!" అంటూ తేజ భుజం మీద చేయి వేశాడు రాజేష్. తేజకు కన్నీళ్ళు ఆగలేదు.

"నన్ను క్షమించు రాజేష్, నీకు ఫస్టు ర్యాంకు వస్తుందన్న కోపంతో నేను తేజమీద పగ తీర్చుకోబోయాను. నాకు తగిన శాస్తి జరిగింది: ఫస్టు ర్యాంకు రాకపోగా, ఐదో ర్యాంకుకు పడిపోయాను. ఇకమీదట నీలాగే నేను కూడా అందరికి సాయం చేస్తాను" అన్నాడు రంగనాథ్ పశ్చాత్తాపంతో. రంగనాథ్‌లోని మార్పుకు అంతా సంతోషించారు. అప్పటినుండీ వీళ్ళంతా కలసి మెలసి చదువుతూ మిగతా పిల్లలకు ఆదర్శంగా నిలిచారు.