ఆ ఊరికి ఆనుకునే నల్లమల అడవులున్నాయి. ఆ ఊళ్ళో చలపతి అతని కుటుంబం మగ్గాలు పెట్టుకుని- బట్టలు నేసి బ్రతుకున్నారు.
కానీ ఈ మధ్య అతని వస్త్రాలు కొనేవాళ్లు కరువైపోయారు. అతనికి పోటీగా చాలా సాలె కుటుంబాలు వలస వచ్చాయి ఊళ్ళోకి. వాళ్ళు ఇతని కంటే అందంగా చీరలు నేస్తున్నారు. దాంతో ఇతని వస్త్రాలకు గిరాకీ పడిపోయింది.
చలపతి కుటుంబం అప్పులపాలైపోయింది. ఆ అప్పులు తీర్చే ఆధరువూ లేదు. భార్యాభర్తలు ఇద్దరూ జీవితంతో‌ విసిగి-పోయారు. చివరికి చలపతి, చంద్రమ్మ ఇద్దరూ అడవికి చేరుకున్నారు. ఆ రోజున ఎండ విపరీతంగా ఉండింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. తెచ్చుకున్న చద్ది తిని, కాసేపు విశ్రమించి, -ఆ తర్వాత రాత్రికి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. దగ్గరలోని చెలమ దగ్గర కాళ్లు చేతులు కడుక్కున్నారు. ఒక మర్రి చెట్టు క్రిందికి చేరారు. చద్దిమూట విప్పుకొని భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఒక సాధువు అతి నీరసంగా, నడవలేక నడవలేక నడుస్తూ అటుగా వచ్చాడు- "భిక్షాందేహి!" అంటూ వాళ్ల ముందు నిలబడ్డాడు.

"అడవిలో కూడా అడుక్కుతినే వాళ్లున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు చలపతి.
"ఏం చెప్పను? అనారోగ్యంతో బాధపడు-తున్నాను. పండ్లు, ఫలాలు అరగడం లేదు. వరి అన్నం దొరకడం లేదు. ఆకలితో నకనకలాడుతున్నాను" సాధువు తన బాధ చెప్పుకున్నాడు.
భార్య వంక చూశాడు చలపతి. ఆమె తల ఊపింది. "ఎలాగూ మనం ఇద్దరం చచ్చిపో-బోతున్నాం. తిండి తిని చచ్చినా ఒకటే-తినక చచ్చినా ఒకటే. కాబట్టి, మనకు వేరే నష్టం ఏమీ లేదు" అనుకున్నారిద్దరూ. సాధువును కూర్చోమని భోజనం పెట్టారు.
సాధువు తృప్తిగా భోజనం చేశాడు. కొంత కుదుట పడ్డ తర్వాత "నా ప్రాణాలు కాపాడారు. మీకేం కావాలో అడగండి-నాకు చేతనైనంత సహాయం చేస్తాను" అన్నాడు.
"స్వామీ! మీరు మాకేం చేయగలరు? ఎలాగూ మేము ఈ సాయంత్రానికల్లా ఉరి వేసుకొని చచ్చి పోతున్నాం!" నిరాసక్తంగా చెప్పాడు చలపతి.
"అవునా, తల్లీ! నిజమా? ఎందుకిలాగ?!" చంద్రమ్మను అడిగాడు స్వామి.
తమ కష్టాలన్నీ ఏకరువు పెట్టింది చంద్రమ్మ. చేనేత బ్రతుకులు ఎంత చీకటి మయం అయిపోయాయో వివరించింది. "దిక్కులేక ప్రాణాలు వదల దల్చుకున్నాం" అని తెలిపింది.
"ఇంత చిన్న దానికి చావాల్సిన అవసరం ఏముంది? మీ సమస్యకు నాదగ్గర ఉపాయం ఉంది-" అన్నాడు సాధువు.
"ఏంటి స్వామీ, అది?" చలపతి అడిగాడు.
సాధువు అతని చెవిలో ఒక మంత్రాన్ని బోధించాడు.
"ముందు ఈ మంత్రాన్ని ఒక లక్షసార్లు జపం చేస్తే అది శుద్ధి అవుతుంది. ఆ తరువాత నలభై రోజులపాటు వరసగా రోజుకు నూట ఎనిమిది సార్లు జపించు. ఆ సరికి నువ్వు అత్యంత ధనవంతుడిగా మారిపోతావు.
కానీ ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు. అలా చేస్తే వచ్చే పరిణామాలను ఎవ్వరమూ ఆపలేం" చెప్పేసి, తన దారిన తాను వెళ్లిపోయాడు సాధువు.
భార్యాభర్తలిద్దరూ తాము అసలు అడవిలోకి ఎందుకొచ్చారో కూడా మర్చిపోయి, చక చకా ఇంటి దారి పట్టారు.
మంత్రాన్ని నిష్ఠగా సాధన చేశాడు చలపతి. నలభైరోజులు అవుతుండగానే, అకస్మాత్తుగా ఒకరోజున అతని ముందు ఒక దయ్యం ప్రత్యక్షమయ్యింది- "ఏం కావాలి స్వామీ?" అని అడుగుతూ.

మొదట చలపతి దాన్ని చూసి భయపడ్డాడు. కాని ఆ దెయ్యం "స్వామీ!" అని సంబోధించింది కదా, అందుకని ధైర్యం తెచ్చుకొని తన కష్టాలు ఏకరువు పెట్టాడు.
"ఏమీ పర్లేదు స్వామీ! నేను, నాకుటుంబం ఓ పదిమందిమి నీకు బానిసలుగా ఉంటాం. కోరినన్ని డబ్బులు సమకూరేవరకూ నీకు సహాయం చేస్తాం.
రాత్రంతా కూర్చొని, నీకు నచ్చేట్లు, అత్యంత నాణ్యమైన చీరలు నేసిస్తాం. నువ్వు అవి అమ్ముకుని బాగుపడచ్చు- కానీ గుర్తుంచుకో, ఏ రోజుకారోజు తెల్లవారేలోగా మాకు ఆహారం పెడ్తూ ఉండాలి" అన్నది దెయ్యం, అదృశ్యమౌతూ. చలపతికి ఎక్కడలేని సంతోషం కలిగింది. షావుకారు దగ్గర అప్పు చేసి, చీరలకు కావల్సిన ముడి వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అతను, అతని కుటుంబం వాటితో నేత నేసి, చీరలు తయారు చెయ్యాలంటే నెల రోజులు పడుతుంది. ఆ రాత్రి మగ్గాల చప్పుళ్లు అవుతూంటే లేచి కూర్చున్నాడు చలపతి. దెయ్యాలు మగ్గాల మీద వస్త్రాలు నేస్తున్నాయి. వాటిని, వాటి వేగాన్ని చూస్తే చలపతికి బలే అనిపించింది.
సంతోషంగా సాధువును మనసులో తలచుకున్నాడు. వాటికోసం పెద్ద గంగాళం నిండా ఆహారం వండి పెట్టి పడుకున్నాడు. తెల్లారి చూసేసరికి గంగాళం ఖాళీగా ఉంది. అలమార నిండా చీరలున్నాయి. ఇంట్లో ముడి సరుకు అంతా అయిపోయింది. చలపతికి చాలా సంతోషం వేసింది. వాటిని నేరుగా పట్నం తీసుకెళ్ళి అమ్మేశాడు. ముహూర్తాల సమయం కాబట్టి అన్నీ అమ్ముడు పోయి పదిరెట్ల లాభం తెచ్చి పెట్టాయి ఆ చీరలు.
వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చి, మళ్ళీ కావలసినంత ముడి సరుకు కొనుక్కొని ఇల్లు చేరుకున్నాడు.
ఇలా నెల రోజులు తిరిగే సరికలా చలపతి దరిద్రం పోయింది. అతని అప్పులన్నీ తీరిపోయాయి; ఇంట్లో రకరకాల వస్తువులు అమరాయి. బీరువాల్లో నిండుగా డబ్బు కనబడసాగింది.
గ్రామస్తులకు అతనిలోని మార్పు అర్థం కాలేదు. రాత్రి పూట శబ్దాలు వస్తూండటంతో కొందరు మేల్కొని, వాళ్లింట్లో ఏం జరుగుతున్నదా అని చూసేవాళ్లు- వాళ్లందరికీ ఒట్టి మగ్గాలు చీరలు నేస్తూ కనబడేవి. దాంతో బిత్తరపోయి పరుగెత్తేవాళ్ళందరూ. సంవత్సరం గడిచేసరికి చలపతి ఆ ప్రాంతంలోకెల్లా అత్యంత ధనవంతుడు ఐపోయాడు. ధనంతో పాటు అతనిలో పొగరు వచ్చింది; దుర్వ్యసనాలు వచ్చాయి; నిత్యం తాగుడుకు అలవాటు పడ్డాడు. సాధువు చెప్పిన సుద్దులు మర్చిపోయాడు. "ఇంక చాల్లేండి...పది తరాలకు సరిపోయే ధనం సంపాదించాం. దెయ్యాలను పంపించెయ్యండి. ప్రశాంతంగా బ్రతుకుదాం!" అని భార్య హితం బోధించినా వినలేదు-
"ఇప్పుడే ఏమైంది- నేను ఈ రాజ్యంలోకెల్లా అత్యంత ధనవంతుడ్ని కావాలి!" అంటూ పేరాశకు పోయాడు.
దెయ్యాలు "ఇంక సెలవు ఇప్పించండి" అంటే "కాదు, ఇంకొంతకాలం నేయండి" అని బలవంత పెట్టటం మొదలుపెట్టాడు. పగటిపూట అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే పోయి "పని చెయ్యండి" అని కొరడాతో కొట్టసాగాడు. ధనదాహం అలాంటిది- పెరుగుతుందే తప్ప తగ్గదు.

ఒకరోజున బాగా తాగేసి ఒళ్లు తెలియకుండా పడిపోయాడు చలపతి- ఆ రాత్రి దెయ్యాలకు ఏర్పాటు చేయాల్సిన ఆహారం సంగతి మరచే పోయాడు. చంద్రమ్మ, పిల్లలు కూడా విందు వినోదాలలో తేలుతూ బానిసల ఆహారం మాట మర్చిపోయారు. అంతే! ఊళ్ళోవాళ్ళు తెల్లారి చూసే సరికి చలపతి-చంద్రమ్మ లతోబాటు పిల్లలు కూడా అతి భయంకరంగా, చచ్చిపడి ఉన్నారు! బానిసత్వం నుండి విముక్తి లభించిన దయ్యాలు ఇక అటు తిరిగి చూడకుండా పారిపోయాయి.
ఆరోజునే అటుగా వచ్చిని సాధువు, చచ్చిపోయిన చలపతి-చంద్రమ్మల గురించి తెలుసుకొని, విచారంగా పెదవి విరిచాడు.