ధర్మారం బడిలో ఆరో తరగతి చదువుతున్నది వీణ. వీణది పేద కుటుంబం. తనకు చదువు విలువ తెలుసు. బాగా చదివేది. అదే పాఠశాలలో గౌరి కూడా చదువుతున్నది. తనదీ వీణ వాళ్ళ తరగతే. గౌరిది ఉన్నత కుటుంబం. కానీ ఆమెకు డబ్బు ఉందని గర్వం ఏమీ లేదు. ఆమె మనసు చాలా మంచిది. ఒక్కటే సమస్య ఏమంటే తనకు చదువు బాగా రాదు! ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి తనకు సహాయం చేస్తే బాగుండునని ఉండేది, ఆమెకు. ఎవరైనా సాయానికి వస్తే ఆమె నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండేది- కానీ ఎప్పుడూ ఎవ్వరూ రారు కద? అట్లా ఎవ్వరూ తనకు సాయం చేయనప్పుడు ఆమె సొంతగా ఏమాత్రం ప్రయత్నం చేసేది కాదు.

తరగతిలో పిల్లలు చాలామంది గౌరికి చదువు రాదని దూరం పెట్టేవాళ్లు. దాంతో గౌరి మరింత ముడుచుకు పోయి ఉండేది. వాళ్ల పాఠశాలలో ఒక రోజున కథారచన పోటీ జరిగింది. అందులో పాల్గొందామని పేరు ఇచ్చింది వీణ. గౌరికేమో అసలు అక్షరాలు గుర్తు పట్టటమే రాదాయె. అందుకని ఆ పాప ఊరికెనే కూర్చున్నది. "పుస్తకాలలో చదివిన కథలు రాయాలి" అని, పిల్లలందరూ తమకు నచ్చిన కథలు ఎంపిక చేసుకొని పెట్టుకున్నారు.

కాని వీణకి అది ఇష్టం కాలేదు. "నేను సొంతంగా కథ రాస్తాను" అనుకున్నది ఆ పాప. అయితే సొంతంగా కథలు రాయటం ఏమంత సులభం కాదుగదా, తరువాతి రోజు ఉదయాన్న బడికి వచ్చేసరికి ఏం రాయాలో అసలు గుర్తుకే రాలేదు వీణకి! అలాంటి సమయంలో తనకి ఎదురైంది గౌరి.

"నువ్వు ఏం కథ రాస్తున్నావు గౌరీ?" అని అడిగింది వీణ.

గౌరి విచారంగా నవ్వింది- "నాకు రాయటమే రాదు కదా?!" అన్నది.

"మరి నీకు తెలిసిన మంచి కథ ఏదైనా ఉంటే చెప్పరాదూ? నాకు ఏమీ ఐడియాలు రావట్లేదు" అన్నది వీణ.

"లేదు వీణా, కథ అంటే సొంతంగానే రాయాలి. దానికే విలువ ఎక్కువ. జాగ్రత్తగా దేన్ని గురించి ఆలోచించినా కథలు తయారవుతాయి. పోనీ, నీకు నచ్చిన స్నేహితురాలి కథ ఒకటి ఊహించి రాయి! నేనంటే ఏమీ రాయలేను, అక్షరాలు రాక- నీకేమి, నువ్వు ఏదనుకుంటే అది రాయగలవు!" అన్నది గౌరి.

ఆ మాటలు వినగానే వీణ మనసులో అప్పటికప్పుడు ఒక కథ తయారైంది! ఆమె వెంటనే గౌరిని దగ్గరికి తీసుకొని- "నాకు కథా రచనలో మొదటిస్థానం వచ్చినా- రాకపోయినా పర్లేదు గాని, నీతో మాట్లాడాక 'స్నేహితురాలంటే నీలాగే ఉండాలి' అని తెలుసుకున్నాను. మళ్ళీ కలుస్తా-" అని చెప్పి కథా రచనకు పరుగు పెట్టింది.

ఆనాటి కథా రచనలో మొదటి బహుమతి వీణదే! తను రాసిన కథని పట్టుకొచ్చి గౌరికి చూపించింది వీణ- "ఇదిగో గౌరీ! నీకు అన్ని సంగతులు తెలుసు కదా, అక్షరాలు ఎందుకు రావు? నేను నీకు తెలుగు రాయడం, చదవటం అన్నీ నేర్పిస్తాను సరేనా?" అన్నది.

"నేను ఎందరినో అడిగాను. నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నువ్వు నేర్పిస్తే తప్పకుండా నేర్చుకుంటాను" అన్నది గౌరి. "నేను నేర్పిస్తానులే; కానీ నువ్వట్లా ఎవరో వస్తారనీ ఏదో నేర్పిస్తారనీ ఎదురు చూస్తూ కూర్చోకూడదు- సొంతంగా ప్రయత్నించాలి. సరేనా?" అని వెంటనే చదువు మొదలు పెట్టింది వీణ. త్వరలోనే గౌరికీ చదవటం, రాయటం వచ్చేసింది.

పది సంవత్సరాల తరువాత ఏం జరిగిందో ఊహించగలరా?!

"వీణ మంచి ఉద్యోగం చేస్తోంది; గౌరికి పెళ్లయిపోయి ఇంట్లో కూర్చుంది" అనుకుంటున్నారా? లేదు!

వీణ గొప్ప రచయిత అయింది; గౌరి ఓ మంచి ఉద్యోగం చేస్తున్నది!

వాళ్ల జీవితాలు మారడానికి ఓ అందమైన స్నేహమే కారణం!!