ఒక రోజున ఓ ఉడత ఎక్కడినుండో వచ్చి ఇంట్లోకి దూరింది. అది ఒక ముసలాయన ఇల్లు. ఉడత ఇంట్లో లోపలి గదిలోకి పరుగెత్తి, ఒక మూలన వణికిపోతూ కూర్చున్నది. ఆ సమయానికి ముసలాయన ఇంట్లో లేడు. ఆయన తిరిగి వచ్చేసరికి గదిలోంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. చూస్తే ఉడత! వంటగదిలో, గిన్నెల మాటున, వణికిపోతూ కూర్చొని ఉన్నది!

ముసలాయనకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. దాని భయం చూసి జాలి వేసింది కూడా. మెల్లగా చేతులు చాపి, దాన్ని పట్టుకొని, ఎత్తుగా ఉన్న పెట్టె మీద కూర్చోబెట్టాడు. తను చేసుకున్న టొమాటో సూప్‌ని ఒక చిన్న ప్లేట్లో వేసి దాని ముందుంచాడు.

ఉడత కొంచెం సేపు కదలలేదు. భయం భయంగా అట్లాగే కూర్చున్నది. ఆ తర్వాత మెల్లగా అడుగు ముందరికి వేసి సూప్‌ని నాకటం మెదలుపెట్టింది. కొంత సేపటికి అంతా తాగేసింది.

ఆ తర్వాత దాని భయం మాయమైంది. ముసలాయన ఏమీ చెయ్యడని అర్థమైంది. ఇంట్లో‌ అంతటా తిరిగింది, ఇంటి బయటికెళ్ళి చూసింది. సంతోషంగా ఎగురుకుంటూ ఆడింది.

దాని ఆటలు, గంతులు ముసలాయనకు ఎంతో తమాషాగా అనిపించాయి. ఆయన తన దగ్గరున్న బెల్లం ముక్కలు, పల్లీలు- కొన్ని కొన్ని తెచ్చి పెట్టాడు దానికి. దానికి అవన్నీ నచ్చాయి. ఆ రోజంతా అక్కడే, ముసలాయన చుట్టూ తిరుగుతూ ఉన్నదది. ఆ రోజు రాత్రి, ముసలాయన పడుకున్నాక, గమనించింది ఉడత- ఎలుక ఒకటి, బయట నుంచి ఇంటికి కన్నం చేస్తున్నది. ముసలాయన ఇంకా అది చూసుకున్నట్లు లేదు..

తర్వాతి రోజున ఆయన పనిచేసుకొని వచ్చేలోగా ఉడత కిటికీలోంచి లోపలికి బయటికి తిరుగుతూ కొద్దికొద్దిగా మట్టిపట్టుకు వచ్చి, ఆ కన్నాన్ని కప్పేసింది.

అది చేసిన పనిని చూసి ముసలాయన ఎంతో సంతోషించాడు. "అంత చిన్న ప్రాణి.. అయినా దానికి ఎంత కృతజ్ఞత ఉందో కదా!" అనుకున్నాడు. కన్నాన్ని సిమెంటుతో మూసేసాడు.

అప్పటినుండీ ఆ ఉడతను మరింత శ్రద్ధగా చూసుకున్నాడు.