వైజయంతీ పురాన్ని జయంత మహారాజు పరిపాలించే కాలంలో సుబోధుడు అనేవాడు న్యాయాధికారిగా ఉండేవాడు. పక్షపాతం అంటూ లేని సమాధానం కావాలంటే సుబోధుడి దగ్గరికే వెళ్ళాలని రాజ్యంలో అందరూ అనుకునేవాళ్ళు. అయితే అట్లాంటి సుబోధుడు అకస్మాత్తుగా చనిపోవటంతో‌ రాజుగారికి పెద్ద కష్టమే వచ్చిపడ్డట్లయింది.

సుబోధుడి స్థానాన్ని భర్తీ చేయటంకోసం రాజుగారు పెద్ద వ్రాత పరీక్ష ఒకదాన్ని నిర్వహించారు. అందులో నెగ్గిన యువకులకు అనేక పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు అన్నిటిలోను రామశాస్త్రి, కృష్ణశాస్త్రి అనే ఇద్దరు యువకులు సమానంగా నెగ్గారు.

"మరి ఈ ఇద్దరిలోనూ ఎవరిని ఎంపిక చేసుకోవాలి?" అనేది ఎంత ఆలోచించినా తేల్చుకోలేకపోయారు రాజుగారు. చివరకు ఆయన మంత్రి శ్రీకాంతుడిని పిలిచి, "మంత్రివర్యా, ఎన్ని విధాలుగా చూసినా 'వీళ్ళ శక్తి యుక్తులు సమానం' అనే తోస్తున్నది. కానీ వీళ్ళను జాగ్రత్తగా గమనించండి. అటుపైన న్యాయమూర్తి పదవికి వీళ్లలో ఒకరిని ఏమైనా ఎంపిక చేయగలరేమో, చెప్పండి" అన్నాడు.

మంత్రి శ్రీకాంతుడు సుబోధుని మిత్రుడు; వృద్ధుడూనూ. ఆయన రామశాస్త్రిని, కృష్ణశాస్త్రిని పిలిచి "నాయనలారా, మీరిద్దరూ నాలుగు రోజుల పాటు ఆస్థానానికి రావాలి. పరిపాలనలో తలెత్తే సమస్యలు ఎన్ని విధాలుగా ఉంటాయో తెలుసుకోవాలి. అటుపైన రాజుగారు తన నిర్ణయాన్ని మీకు తెలియజేస్తారు. అంతవరకూ మీకు ప్రత్యేకంగా ఏలాంటి బాధ్యతలూ ఉండవు. కేవలం మాతో పాటు రోజూ కొలువుకు రావటం, అంతే" అన్నాడు.

రామశాస్త్రి "సరే" అన్నాడు. "ఓహో! ఇంకా కొన్ని పరీక్షలు ఉంటాయన్నమాట! అంటే మా యిద్దరిలోనూ సరైన వాళ్ళెవరో ఇంకా తేల్చుకోలేక పోయారన్న మాట, రాజుగారు!" అన్నాడు కృష్ణశాస్త్రి.

శ్రీకాంతుడు చిరునవ్వుతో "అవునవును, సరిగ్గా కనుక్కున్నారు" అన్నాడు.

మరునాడు ఆయన వాళ్ళిద్దరినీ ఆస్థానం-లోని ఉద్యోగులకు పరిచయం చేశాడు. "నమస్కారం" అని ఊరుకున్నాడు రామశాస్త్రి. "మేం ఇంకో మూడు నాలుగు రోజులు ఉంటాం. మీ సమస్యలు ఏవి ఉన్నా చెప్పండి. మా తెలివితేటలతో వాటిని పరిష్కరిస్తాం" అన్నాడు కృష్ణశాస్త్రి అందరితోటీ. ఆ రోజూ, తర్వాతి రోజు కూడాను ఆస్థానంలో ఉద్యోగులు చాలా మంది వీళ్ళిద్దరినీ కలిసి తమకు తోటి వారంటే ఉన్న అక్కసును, పరిపాలనలో తమకు నచ్చని విషయాలనూ ప్రస్తావిస్తూ వచ్చారు. కృష్ణశాస్త్రి వాళ్ళను మెచ్చుకొని ఏదేదో మాట్లాడుతూ వచ్చాడు. అయితే అక్కడే కూర్చొని ఉన్న రామశాస్త్రి మాత్రం అప్పుడప్పుడూ చిరునవ్వు నవ్వటం, కొద్దిపాటి సాంత్వన వచనాలు పలకటం మినహా ఆ చర్చల్లో పెద్దగా పాలు పంచుకోలేదు. నాలుగవ రోజున మంత్రి శ్రీకాంతుడు రాజుగారిని కలిసి "మహారాజా! రామశాస్త్రినే మన ఆస్థానానికి న్యాయాధిపతిగా నియమించండి. ఆ పదవికి తగిన వ్యక్తి అతనే " అని సిఫార్సు చేశాడు.

రాజుగారు చిరునవ్వు నవ్వి, అడిగారు- "మంత్రివర్యా! వీళ్ళిద్దరూ విద్యాధికులే; అన్నింటా సమానమే అనిపించారు కదా, మరి రామశాస్త్రిని ఎలా ఎంపిక చేసారు?" అని.

"మహారాజా! వీళ్ళ తెలివితేటలు, పాండిత్యం సమానం అయినా ఇద్దరి వ్యక్తిత్వాలలోనూ చాలా వ్యత్యాసం ఉన్నది. రామశాస్త్రి మితభాషి. కొలువుకు వచ్చిన మూడు రోజులూ అతను అన్ని విషయాలనూ మౌనంగా గమనిస్తూ వచ్చాడు. ఇక కృష్ణశాస్త్రి- ఇతరుల సమస్యల్ని పరిష్కరించే పెత్తనాన్ని ముందుగా తన నెత్తిమీద తాను వేసుకున్నాడు: దానికి ప్రభువుల వారి సమ్మతి ఉన్నదో లేదో చూసుకోలేదు. అటు తర్వాత, ఇక అత్యుత్సాహవంతులైన సభికులు కాలహరణం కోసం చెప్పే చాడీలను వినటం; అతిగా మాట్లాడటం- చేసి, పదిమందిలోనూ పలచన అయ్యాడు.

న్యాయాధిపతిగా నియమితుడైయ్యే వ్యక్తికి తెలివితేటలు, శాస్త్ర పాండిత్యం ఉంటే చాలదు- నిజమైన పెద్దరికం ఉండాలి. 'చాడీలు వినటం, అతిగా మాట్లాడటం' వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. కాబట్టి, మహారాజా! రామశాస్త్రికే న్యాయాధిపతిగా ఉండేందుకు తగిన అర్హత ఉన్నది" వివరించాడు శ్రీకాంతుడు.

మంత్రిగారి ఎంపికను రాజుగారు సంతోషంగా ఆమోదించారు. రామశాస్త్రిని న్యాయాధికారిగా నియమించారు.