"చక్కని బొమ్మా రావమ్మా
పాలూ పెరుగూ తినవమ్మా
ఆటలు బాగా ఆడమ్మా
ఆరోగ్యంగా ఉండమ్మా..." పాడుతోంది చిట్టి, తన బొమ్మను ముద్దు చేస్తూ.
బయట కాకి అరుస్తోంది.
అంతలో తాతయ్య వచ్చాడు. కాకిని తోలుతూ -

"కాకీ కాకీ ఎగిరిపో
మా చిట్టి చిన్నది
చిట్టి బొమ్మ చెక్కది
నీ ముక్కేమో గట్టిది!" అని పాడాడు.
"ఊరుకో తాతయ్యా!" అంది చిట్టి, మూతి ముడుచుకొని.
"ఏం చెప్పినా తియ్యగా చెప్పాలమ్మా!" అంటూ తాతయ్య ఇంకో పాట అందుకున్నాడు -

"తీయని పలుకల చిలకమ్మ
కమ్మని కూతల కోయిలమ్మ
చల్లని వెలుగుల చంద్రమ్మ
మా చిట్టి పాపే కదమ్మా?!" అని.
చిట్టి నవ్వింది - తనూ పాటల ఆటలోకి దిగింది-

"కాకి వచ్చి వాలింది
నక్కి నక్కి కూచుంది-
బొక్కి నోరు చూసింది
తొర్రేమో అనుకుంది -
ఎగ్గిరి పైకి దూకింది
ముక్కుని నోట్లో దూర్చింది
ఇరుక్కు పోయి ఏడ్చింది!" అని పాడింది- తాతయ్య బోసి నోటిని ఎగతాళి చేస్తూ
తాతయ్య కూడా నవ్వాడు.

"అబ్బ మా పాప చూడు-
బడికి పోయి వస్తుంది
తిట్లూ దెబ్బలు తింటుంది.
చదవమంటే రాదు
రాయమంటే కదలదు -
అంతేకాదు - యీ నెల ఏదో తెలీనే తెలీదు!" వెక్కిరించాడు సరదాగా.
"నాకెందుకు తెలీదు? ఇది నవంబరు నెల!" అంది చిట్టి ఉడికిపోతూ. "అయినా మా బళ్లో నేనెప్పుడూ తిట్లూదెబ్బలు తిననేలేదు తెలుసా? ఎప్పుడూ అందరూ మెచ్చుకుంటూనే ఉంటారు నన్ను -" అంది కుళ్లుకుంటూ.
"మరయితే ఈ నెల్లో ఏమేమొస్తాయమ్మా, చెప్పు చూద్దాం?!" రెట్టించాడు తాతయ్య.

"దీపాల వరసలు
మతాబాల వెలుగులు
టపాకాయ చప్పుళ్ళు
తియ్య తియ్యని స్వీట్లు -"
-నాకెందుకు తెలీదు? నేను అప్పుడే తుపాకీ బిళ్లలు కూడా కొనేసుకున్నాను! ఈ నెల్లోనే, దీపావళి!" అంది చిట్టి ఉత్సాహంగా.
"ఇంకోటి కూడా ఉంది! మరిచి పోయావు! పిల్లల పండుగ!" అన్నాడు తాతయ్య,
"పండిత నెహ్రూ పుట్టిన రోజు-
పిల్లలందరికి పండుగరోజు!" అని పాడుతూ.
"మోసం! ఇది నీ సొంతం కాదు- సొంత పాటలే పాడాలి ఇవాళ్ల! ఓడిపోయావు-అంతే!" అరుస్తూ బయటికి పరుగుతీసింది చిట్టి.
మీసాల మాటున ముసిముసిగా నవ్వాడు తాతయ్య- "చిట్టికి అన్నీ తెలుసే, బాలల దినోత్సవం పాట కూడా తెలుసు!" అని.
అందరికీ దీపావళి, బాలలదినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు.
కొత్తపల్లి బృందం.