జగన్నాధం గారు చాలా మంచి టీచరుగారు. అతని భార్య మహాలక్ష్మి- ఆవిడ కూడా చాలా మంచిది. వీళ్లకి ఇద్దరు కొడుకులు- రవి, చంద్ర.

జగన్నాధంగారి దగ్గర చాలా మంది పిల్లలు చదువుకొని పెద్దవాళ్లయ్యారు. పిల్లలందరికీ ఆయనన్నా, ఆయన పాఠాలు చెప్పే తీరన్నా చాలా నచ్చేది.

ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మంచి నడవడిక కూడా ఆయన సొంతం. అట్లా అందరికీ ఇష్టంగా చదువు చెప్పటం తప్పిస్తే, జగన్నాధంగారు పెద్దగా ఏమీ సంపాదించలేదు- వాళ్లంతా తాతలనాటి ఇంట్లో ఉండేవాళ్ళు. పిల్లలిద్దరూ కూడా తండ్రి దగ్గరే చదువుకున్నారు.

జగన్నాధంగారు ముసలివాడై ఉద్యోగవిరమణ చేసేసరికి రవి, చంద్ర ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు. ఇద్దరికీ గొప్ప ఉద్యోగాలు వచ్చాయి; పెళ్ళిళ్ళు అయ్యాయి; ఎవరికి వారు కార్లు కూడా కొనుక్కున్నారు.

అయితే ముసలి తల్లి దండ్రులను ఏం చెయ్యాలి?

"మా బ్రతుకు మేం బ్రతుకుతాం. నాకొచ్చే పింఛను తక్కువే, అయినా మాకది చాలు" అన్నారు జగన్నాధం గారు. మహలక్ష్మి కూడా అదే అన్నది.

కొడుకులు, కోడళ్ళు మటుకు ఒప్పుకోలేదు. "మా బంధువుల్లో మేం నిష్టూరం అవుతాం! 'తల్లిదండ్రులను చూసుకోవట్లేదు' అంటారు అందరూ.

మీరు మాతోటే ఉండాలి" అన్నారు వాళ్ళు. అయితే ఒక కోడలికి మామగారంటే ఇష్టం లేదు. ఒకరికి అత్తగారంటే ఇష్టం లేదు!

చివరికి కొడుకులిద్దరూ తల్లిదండ్రుల్ని పంచుకున్నారు. ఒక కొడుకు తండ్రిని చూసుకునేట్లు, ఒకడు తల్లిని చూసుకునేట్లు ఒప్పందం కుదిరింది.

మహాలక్ష్మికి అది ఏమాత్రం‌ ఇష్టం లేదు. జగన్నాధంగారు ఆమెకు సర్ది చెప్పారు. ముసలితనంలో పిల్లలు ఎలా చెబితే అలా చేయాలన్నారు. ఆమె కాదనలేక, సరే అన్నది.

అట్లా ముసలితనంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన దంపతులిద్దరూ వేరయ్యారు.

జగన్నాధంగారు కొడుకు ఇంట్లో అవమానాలకు గురయ్యేవాడు. 'ఏ పనీ చెయ్యకుండా ఊరికే మేస్తున్నాడు' అని తిట్టించుకునేవాడు. అయినా భార్యకు మటుకు ఆ సంగతి చెప్పేవాడు కాదు.

మహాలక్ష్మి కొడుకు ఇంటి పని అంతా చేసేది; అయినా చివరికి తిట్లే తినేది. జగన్నాధంగారికి అవేవీ తెలియనిచ్చేది కాదు- తను చాలా సంతోషంగానే ఉంటున్నట్లు నటించేది.

అయితే పరిస్థితులు విషమించేసరికి, ఇక ఏవీ దాగని పరిస్థితి ఏర్పడింది. 'అత్తగారు తమ ఇంట్లో నగలు దొంగిలించింది' అని మహాలక్ష్మిని పోలీసులకు అప్పగించింది ఒక కోడలు!

రవి చంద్రలు ఇద్దరికీ తల్లిని పట్టించుకునే సమయం లేదు.

దాంతో జగన్నాధంగారు బయలుదేరి, దగ్గుకుంటూ‌ పోలీసు స్టేషను చేరుకున్నారు. అక్కడ తన భార్య మహాలక్ష్మి కుర్చీలో కూర్చొని ఉన్నది- పోలీసు ఇన్స్పె క్టరుగారికి ఎదురుగా, తల వంచుకొని. ఏదో చెప్పబోయిన జగన్నాధంగారిని వారించి, కుర్చీలో కూర్చోబెట్టారు ఇన్స్పెక్టరు గారు. ఆ తర్వాత తను లేచి వచ్చి, వాళ్ళిద్దరి కాళ్లకీ నమస్కరించారు!

ఆశ్చర్యపోయిన జగన్నాధంగారికి తనను తాను పరిచయం చేసుకున్నారు, ఇన్స్పెక్టరుగారు- ఆయన పేరు రాము. చిన్నప్పుడు చదువుకునేందుకు డబ్బులు లేకుంటే, ఫీజు డబ్బులు కట్టి మరీ ఆదరించారు జగన్నాధంగారు. అతను తరగతిలో ఫస్టు వచ్చినప్పుడు అతన్ని అభినందించి, అప్పటికప్పుడు తన పెన్నును కూడా బహుమతిగా ఇచ్చారాయన! "మీకు నేను మాత్రం కొడుకును కాదూ, మీరు నాతో ఎందుకు ఉండకూడదు?" అని వాళ్ళిద్దరినీ బలవంతపెట్టి, గౌరవంగా తన ఇంటికి తీసుకువెళ్ళారు ఇన్స్పెక్టరుగారు.

ఆ సరికి పోయిన నగలన్నీ దొరికాయి; మహాలక్ష్మి మీద కేసు వీగిపోయింది.

అయితే రవి, చంద్రలిద్దరూ తాతల నాటి తమ ఇల్లుని వేలం వేస్తూ ఉన్నారు. మరెలాగ? ఇన్స్పెక్టరు రాము ఆ ఇంటిని వేలంలో కొనేసి, దాన్ని జగన్నాధంగారికి బహుమతిగా ఇచ్చారు.

సిగ్గుపడిన రవి, చంద్రలిద్దరూ తల్లిదండ్రులను క్షమించమని వేడుకున్నారు. చివరికి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు- కథ సుఖాంతం అయ్యింది!