అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. సింహరాజు కాస్తా ముసలి-వాడయ్యాడు.

దట్టమైన ఆ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. సింహం పాలనలో అవన్నీ కష్టమన్నది ఎరుగకుండా జీవించాయి. ఇప్పుడేమో, మరి- సింహరాజుకు శక్తి తగ్గింది; రాజ్యభారం మోయలేక పోతున్నది.


ఒకరోజున సింహం అడవిలో ఉన్న జంతువులన్నిటికీ‌ కబురు పంపింది. పులి, ఏనుగు, చిరుత, తోడేలు, నక్క, కోతి, పాము, రకరకాల పక్షులు- ఎన్నెన్నో వన్యప్రాణులు సింహరాజు పిలుపును అందుకొని ఒక చోట చేరి కూర్చున్నాయి.

సింహరాజు వాళ్ళతో - "చూశారు గదా, నేను ముసలివాడిని అయిపోయాను. రాజ్యం ఇప్పుడు బరువుగా అనిపిస్తున్నది. ఇన్నాళ్ళూ నా శక్తి కొద్దీ సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడు నా వారసుడిని ఎంపిక చేసుకోవాల్సిన సమయం దగ్గరపడింది.

ఈ అడవికి రాజు కాదగినవాడు బలవంతుడు, బుద్ధి శాలి అయిఉండాలి. అంతేకాదు- అతనికి స్వార్థం తక్కువ ఉండాలి, సేవా భావం ఉండాలి.

ప్రజలకోసం ప్రాణాలు పణంగా పెట్టగలిగేంత సాహసవంతులెవరో ముందుకు రండి. మీలో ఒకరిని నా వారసునిగా ఎంపిక చేసుకొని, రాజ్యపాలనలో శిక్షణనిస్తాను" అన్నది.

సింహం ఈ మాట అనగానే పులి ముందుకు వచ్చి నిల్చున్నది- "నేను బలశాలిని, ధైర్యశాలిని. అడవిలో ఉన్న జంతువులన్నీ నా పేరు వినగానే భయంతో వణికిపోతాయి. నన్ను ఈ అడవికి రాజుగా నియమించండి" అని అడిగింది.

మిగతా జంతువులన్నీ వెంటనే "వద్దు! ఆ పులి మాకు వద్దు! మాకు వద్దు!" అని అరిచాయి.

అంతలో చిరుతపులి ముందుకు వచ్చింది. "ప్రభూ! పెద్దపులి క్రూరత్వం ఎరుగనివారు లేరు. అలాగే నా వేగం అందుకోగలవారూ లేరు. పులిలోని శక్తీ, గుర్రంలోని వేగమూ, నక్కలోని చలాకీదనమూ ఇవన్నీ నా సొత్తులు. మీ వారసుడిగా నాకు అవకాశం ఇవ్వండి" అన్నది.

మిగతా జంతువులన్నీ‌ "వద్దు! వద్దు! చిరుతపులి మాకొద్దు!" అని అరిచాయి. చిరుతపులి వాటివైపు కోపంగా చూసి, వెళ్ళి కూర్చున్నది.




ఏనుగు ముందుకు వచ్చి అన్నది- "నేను శాకాహారిని. బలశాలిని. ఈ అడవిలో వున్న వారిలో అందరికన్నా భారీ శరీరం నాది. ఈ అడవికి తగిన రాజుని నేనే, ఆలోచించండి" అన్నది గట్టిగా. అక్కడ ఉన్న మాంసాహారి జంతువులన్నీ "ఆ ఏనుగు మాకు వద్దు! ఏనుగు మాకు వద్దు!" అని అరిచాయి.

ఆ తర్వాత కోతి, పాము, నక్క, నెమలి, తోడేలు ఇవన్నీ వరసగా ముందుకు వచ్చి తమనే వారసునిగా నియమించుకొ-మ్మన్నాయి.



"కోతి చిలిపి పనులు చేస్తుంది. ఇది మాకు వద్దు !" "అయ్యో , విషసర్పం! మాకు వద్దు!" "ఈ నక్కకు సొంతగా చంపితినే శక్తి కూడా లేదు- మాకు వద్దు!" "అందంగా ఎగిరితే సరి పోతుందా, రాజ్యం అంటే నాట్యం చేయటం కాదు! ఈ నెమలి వద్దు" ఇట్లా వచ్చిన ప్రతిజంతువుకూ పేర్లు పెట్టాయి మిగిలిన జంతువులన్నీ.

ఇంక ఎవరూ ముందుకు రాలేదు. కొంత సేపు అందరూ మౌనంగా ఉన్నారు.

తరువాత సింహం అన్నది విచారంగా- "చూడండి, ఇప్పుడు నేను మాట్లాడింది- 'అందరూ కలిసి ఎవరి రాజుని వాళ్ళే ఎంపిక చేసుకునే' పద్ధతి గురించి. దీన్ని 'ప్రజాస్వామ్యం' అంటారు.

రాచరికం నుండి, ఇలా తమని తాము సొంతగా పరిపాలించుకోవటంలోకి అందరూ ఎదిగితే తప్ప, ప్రజాస్వామ్యపు ఉద్దేశం ఏమాత్రం నెరవేరదు. ఆ సమయం ఇంకా రాలేదని తెలుస్తూనే ఉన్నది- చూశారుగా! అందుకని మనం ఇంకొంతకాలం రాచరికంలోనే కొనసాగుదాం. నా తర్వాత, నా వారసుడిగా, నా కొడుకు- సింహానికే అవకాశం ఇవ్వాలని నిశ్చయించాను! మీరంతా మరింత కాలంపాటు నా కుమారుడికి విధేయులై వర్తిస్తారని ఆశిస్తున్నాను" అని.

అడవిలోని జంతుజాలమంతా "సింహరాజుకీ జై! పాత సింహరాజుకీ జై! క్రొత్త సింహరాజుకీ జై!" అని నినాదాలు చేశాయి!