అప్పుడా బెగ్గురుపక్షి సిగ్గుపడుతున్నట్లు తల వంచి హంసరాజుతో "ప్రభూ! నాకు వేరే పని ఏదైనా అప్పగించండి, చేస్తాను. ఏదో, తమరి పాద సేవలో చిన్న చిన్న పనులు చేసుకొని పొట్ట పోసుకునేవాడిని తప్ప, దుర్గ నిర్మాణం వంటి మహత్తర కార్యాలను నా అంతట నేను చేపట్టగల సమర్ధత నాకు లేదు" అన్నది. అప్పుడు హంసరాజు చిరునవ్వు నవ్వి, నీ ప్రజ్ఞాపాటవాలు మాకు తెలీనివి కావు. ఈ పనిని ఎలాగైనా నువ్వే చేయవలసి ఉన్నది. కోటకు తగిన స్థలాన్ని మొదట ఎంపిక చేసి చెప్పు. అక్కడ ఏమేం నిర్మించాలో తర్వాత ఆలోచించవచ్చు" అన్నది.

ఆ పక్షి ఇక మారు మాట్లాడలేక రాజుగారి ఆజ్ఞను అనుసరించి పోయి, త్వరలోనే సంతోషపు ముఖంతో వెనక్కి తిరిగివచ్చింది- "ప్రభూ! తమరి దయవల్ల మనకు కావలసిన కోట ఒకటి- దాదాపు తయారుగానే కనబడింది. మన పట్టణానికి దగ్గరలోనే ఒక కొండ గుహ ఉన్నది. అది చాలా పెద్దది; లోపల అత్యంత విశాలమైన స్థలం ఉన్నది. శత్రువులు లోనికి వచ్చేందుకు, ఆక్రమించుకునేందుకు దుస్సాధ్యమైన స్థలం అది. ఇక దాని అందం వర్ణింపనలవి కాదు. ఆ గుహ అంతర్భాగంలోనే కనులకు విందు చేసే చక్కని కమలాల తో కూడిన సరస్సు ఒకటి ఉన్నది. ఆ సరస్సులో నీరు ఏ కాలంలోనైనా ఒకే విధంగా ఉంటుంది. అది తమరికి నచ్చిందంటే, ఇక దాన్ని త్వరలోనే శుభ్రం చేసి, కోటలాగా తయారు చేసి, తమరికి విన్నవించు-కుంటాను" అన్నది.

హంస రాజు దాన్ని చాలా మెచ్చుకొని, బహుమానాలిచ్చి, "నీలాంటి వాడు మా ఆస్థానంలో ఉండటం నిజంగా మా భాగ్యం. నీ వల్ల మాకు ఈరోజు చాలా సంతోషం కలిగింది. మన కోట రక్షణ బాధ్యత కూడా‌ నీకే ఇస్తున్నాను. నా ఆజ్ఞలను తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, నీ విధుల్లో ఏమాత్రం ఏమారకుండా కోటను సంరక్షించు. పోయిరా" అని దాన్ని సాగనంపింది. "వీరవరుడు" అనే ఆ బెగ్గురు పక్షి కూడా హంసరాజు ఆజ్ఞ ప్రకారం ఆహారం-నిద్రల అవసరం లేనట్లు, రాత్రింబవళ్ళూ కోటకోసం పనిచేసి, దాన్నే ఎల్లవేళలా కనిపెట్టుకొని ఉ‌న్నది.

అంతలో ద్వారపాలకుడొకడు లోనికి వచ్చి, "ప్రభూ! తమరి పాద సందర్శనం కోసం సింహళ ద్వీపం నుండి అట, 'నీలవర్ణుడు' అనే కాకి ఒకడు వచ్చి వాకిట నిలిచి ఉన్నాడు. తమరి ఆజ్ఞ అయితే ఆయన్ని లోనికి ప్రవేశ- పెడతాను" అన్నది.

హంసరాజు సంతోషంగా మంత్రివైపు తిరిగి "కాకి చాలా తెలివైనది; శక్తి యుక్తులున్నది. తెలివిలేని మందమతులు వెయ్యిమందిని వెంట ఉంచుకునేకంటే, తెలివైనవాడిని ఒక్కడిని దగ్గర చేసుకొన్న రాజు ధన్యుడవుతాడట. దగ్గరకొచ్చిన సింహాన్ని కాదని, కుక్కలు వెయ్యింటిని పెంచుకుంటే మటుకు ఏం ప్రయోజనం? మన వాళ్ళలో ఈ కాకికి సమానమైన బలవంతుడు కనీసం ఒక్కడన్నా ఉన్నాడంటావా, చెప్పు, చూద్దాం? యుద్ధం తలపెట్టేటప్పుడు మొదటగా చేయవలసిన పని వీరులను సేకరించుకోవటం. మనకు ఎన్ని విధాలుగా చూసినా ఈ కాకి తోడ్పాటు అవసరం అనిపిస్తున్నది. ఓటమినెరుగని ఇలాంటి యోధులు మన వైపు ఉంటే ఎవ్వరైనా మనల్ని వేలెత్తి చూపగలరా, చెప్పు!" అన్నది.

అప్పుడు సర్వజ్ఞుడనే ఆ మంత్రి నిగూఢంగా చిరునవ్వు నవ్వి "నా మనసు-మాట-శరీరం - అన్నీ తమరి క్షేమాన్నే ఎల్లవేళలా కాంక్షిస్తుంటాయి, కనుక బెరుకు లేకుండా నాకు తోచినది విన్నవించుకుంటాను- ప్రభువులవారు మరోలా అనుకోవద్దు- త్వర త్వరగా పనులు ముగించుకోవాలన్న కాంక్ష వల్ల, 'ఏది సరైనది'- అన్నది తమరికి సరిగా తోచటంలేదు అనిపిస్తున్నది.

కొత్తవాని సామర్ధ్యం మీద నమ్మకం పెట్టుకొని పగవాడితో యుద్ధానికి దిగటం 'కుక్క తోక పట్టుకొని సముద్రం దాటనెంచటం'లాంటిదే. అదీగాక, కాకి భూమిపైన నివసించే పక్షి. మనం నీటి పక్షులం. ఇతను మనతో కలియవలసినవాడు కాదు.

సమానం కానివాడితో స్నేహం ఆపదలకు దారి తీస్తుంది. అందువల్ల మనం ఈ అరిష్టాన్ని (కాకిని) దగ్గరకు చేరనివ్వటం అరిష్టాన్ని (కీడును) కొని తెచ్చుకోవటమే తప్ప వేరు కాదు. ప్రభువులవారు ఇక ఈ ఆలోచనను విరమిస్తే మంచిది- 'తనవారిని విడచి పరాయి వాళ్ళ సహచర్యాన్ని కోరటం' అన్నది అమృతాన్ని విడచి కాలకూట విషాన్ని కోరినట్లే. శత్రు పక్షానికి చెందినదని స్పష్టంగా తెలుస్తున్న ఈ పక్షిని దగ్గర చేరనివ్వటం ఏ విధంగా సమంజసమో తమరే ఆలోచించండి. తన స్వభావాన్ని విడచి, ఎవరైతే ఇతరుల భావాలను సొంతం చేసుకుంటారో, వాళ్ళు నీలిరంగు నక్క మాదిరి కష్టాల పాలవుతారు. తమరికి ఆ కథ చెబుతాను, సావధానంగా వినండి:

నీలి నక్క కథ

ఒక చీకటి రాత్రిన, నక్క కొకదానికి చాలా ఆకలైంది. 'ఏమైనా శవాలు కనబడ-తాయేమో, పీక్కు తిందాము' అన్న ఆలోచనతో అది పట్టణ శివార్లలో విచ్చలవిడిగా తిరగటం మొదలు పెట్టింది.

ఆ ప్రాంతంలో 'నీలి' సాగు ఎక్కువ. దారానికి నీలిరంగు వేసేవాడొకడు, అక్కడ ఒక చెట్టు నీడన తన పొయ్యిని-దారాన్ని ఉడకబెట్టే కుండలను పెట్టుకున్నాడు. అయితే చాలా చీకటిగా ఉండటంతో నక్కకు ఏమీ కనబడటం లేదు. చివరకు అది కాలుజారి ఠపాలున నీలిరంగుతో నిండిన ఓ కుండలో పడిపోయింది.

అటుపైన అది ఎంత ప్రయత్నించినా ఆ కుండలోనుండి బయటికి రాలేకపోయింది. కొంత సేపు గందరగోళ పడిన తర్వాత అది కొంత తేరుకొని, మనసును గట్టి చేసుకొని, ఇక వేరే ఆలోచనలన్నిటినీ వదలిపెట్టి, 'తెల్లవారే వరకూ ఆగవలసిందే' అని అర్థం చేసుకొని, మనసుకు తట్టిన ఉపాయాన్ని సరిచూసు-కుంటూ ఊరకున్నది. తెల్లవారి ఆ కుండల యజమాని వచ్చేసరికి అది కాళ్ళు పైకి పెట్టుకొని, తెరచి పెట్టుకున్న నోటితో, బయటికి సాగి వచ్చిన పళ్ళతో, తేలవేసిన కళ్ళతో, ఊపిరి బిగబట్టి చచ్చినదానిలాగా కుండలో పడి ఉన్నది. అప్పుడా నీలి కాపు కొంతసేపు ఆశ్చర్యపడి, 'ఈ నక్క చచ్చింది' అనుకొని, త్వరత్వరగా దానిని కుండనుండి బయటికి తీసి దూరంగా పారేశాడు.

ఆ తర్వాత, అతను అక్కడినుండి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి నక్క మెల్లమెల్లగా కళ్ళు తెరచి, అటూ ఇటూ చూసి, లేచి కూర్చున్నది. తలనుండి పాదాల వరకూ ఇప్పుడది నీలి రంగులో ఉన్నది! కొంతసేపు తన శరీరపు రంగును తానే మెచ్చుకుంటూ‌ గడిపాక, అది "ఆహా! నా అదృష్టం బాగుంది కనుక, ఇవాళ్ళ నా శరీరానికి అనుకోకుండా ఇంత గొప్ప రంగు చేకూరింది. దీనితో నేను నా జాతి మొత్తంలోనూ గొప్పవాడినైపోయాను. ఇంకా కూడా అజ్ఞానిలాగా, గౌరవం లేనివాడిలాగా అర్థం లేని బ్రతుకు బ్రతకటం ఎందుకు?

అన్నింటిలోకీ గొప్పదైన ఇటువంటి వర్ణం నా సొంతం అయినప్పుడు కాకపోతే, నా కోరికలన్నిటినీ ఇక మరెప్పుడు, తీర్చుకునేది? 'నా గొప్పతనాన్ని లోకం అంతటా ప్రకటించేందుకు సరైన సమయం ఇదే' అని అనుకున్నది.

అటుపైన అది తన తోటి నక్కల దగ్గరికి వెళ్ళి "విన్నారా?! నిన్న రాత్రి ఒక దివ్య పురుషుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాడు. తక్కిన దేవతలందరూ చిరునవ్వుతో నిండిన ముఖాలతో నన్ను ప్రసన్నంగా చూస్తుండగా, అతను పరమ పూజ్యమైన ఈ ప్రాజ్యారణ్య రాజ్యం మొత్తానికీ నన్ను అధిపతిగా చేసి, అందుకు గుర్తుగా ఉత్తమమైన ఈ రంగును ప్రసాదించాడు. మీ తనివి తీరా నా యీ శరీర వర్ణాన్ని చూసుకోండి- చూశారు కదా, ఇక నేను చెప్పేది స్పష్టంగా వినండి: ఇది మొదలు మీరందరూ నా ఆజ్ఞను అనుసరించి, నాకు విధేయులై ప్రవర్తించాలి. ఈనాటినుండీ మీరే కాదు; ఈ అడవిలోని జంతు సంతతి యావత్తూ నా ఆజ్ఞలకు లోబడాలి. మీరు ఇప్పుడే వెళ్ళి, యీ సంగతిని అడవి నలు మూలలా, అందరికీ అర్థమయ్యేటట్లు చాటండి" అన్నది.

అప్పుడు తక్కిన నక్కలన్నీ‌ దాని ఒంటి రంగును చూసి, ఆశ్చర్యంతో‌ నిండిపోయాయి. సంతోషంతో వాటన్నిటి మేనూ పులకరించింది; వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. అవి నక్క శరీర వర్ణాన్ని ఏమాత్రం అనుమానించక, వినయంతోటీ, సంభ్రమంతోటీ దానిముందు సాగిలపడి మ్రొక్కాయి.

అటుపైన అవన్నీ వెళ్ళి, అడవి నలుమూలలా తిరిగి, అన్ని జంతువులకూ అతని కథని మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యమూ అభిమానమూ ఒలికేటట్లు చెప్పి, అందరినీ ఒప్పించి వచ్చాయి. తర్వాత అవన్నీ ఎక్కడలేని భక్తి శ్రద్ధలతోటీ, అణకువ-తోటీ రాత్రింబవళ్ళూ దాన్నే సేవిస్తూ, దాని ఆదరణకు ప్రాప్తాలై, ధన్యతనొందుతూ తరించటం మొదలుపెట్టాయి.

వాటి భక్తి శ్రద్ధలను చూసినై, అడవిలోని ఇతర జంతువులన్నీ: మూఢభక్తి ఎంతటిదో చూడండి- అడవిలో నివసించే సింహాలు, పులుల వంటి జంతువులు కూడా అటుపైన ఆ నక్క ఆజ్ఞకు బద్ధులైనాయి.

అవన్నీ కూడా దానికి గొప్ప గొప్ప బహుమతులను అందిస్తూ, 'దాని మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో' అన్నట్లు పవిత్రంగా మసలుకొంటూ‌ వచ్చాయి. (అప్పుడు ఏమైందో‌ మళ్ళీ చూద్దాం...)