"రంగునుండి, ఆకారం నుండి, జవాబు ఇచ్చే తీరునుండి, కంటి చూపు నుండి, శరీరపు కదలికల నుండి- వీటన్నిటి నుండీ అవతలి వాళ్ళ మనసులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగల సమర్థత ఉంటుంది, తెలివైనవాళ్లకు. అందువల్ల రాజ్య రక్షణ కోసం తెలివైన మంత్రులను సంప్రతించటం

తప్పనిసరి. రాజుగారి నమ్మకానికి పాత్రులైన మంత్రులకు కోరిన కోరికలన్నీ తీరుతాయి, దేన్ని అయినా సాధించగల నేర్పు అలవడుతుంది.." అంటూ చక్రవాకం అటూ ఇటూ చూసింది.

వెంటనే రాజుగారికి అర్థమైంది- 'చక్రవాకం తనకు మాత్రమే ఏదో చెప్పనెంచింది' అని. ఏకాంతం కోసం ఆ హంసరాజు అటూ ఇటూ చూసే సరికి, ఆ చూపులను అర్థం చేసుకొని సభలోని గౌరవనీయులు, వారి వెంబడి మిగతా సదస్యులు- అందరూ దూరంగా వెళ్ళారు.

అప్పుడు చక్రవాక మంత్రి రాజుకు మరింత దగ్గరగా జరిగి, ఆయన ముఖంపైనే చూపును నిలిపి, "ప్రభూ! వినండి- 'ప్రస్తుతానికి మన ఆ శత్రువు దగ్గరికి ఎవరైనా గూఢచారిని ఒకడిని పంపించటం మంచిది' అని నాకు తోస్తున్నది. పలు రకాలుగా ఆలోచించకుండా తొందరపడి ఏదో ఒకటి చెయ్యటం కార్యజ్ఞుల లక్షణం కాదు. 'ఆలస్యం చెయ్యకుండా నిర్ణయం తీసుకో-గలగటం వైద్య వృత్తిలోని వారికి ఎంత అవసరమో, తొందర పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం రాజులకు అంత అవసరం' అని పెద్దలు చెబుతారు. కొన్ని కొన్ని సార్లు ఏవో చిన్న పనులు త్వరపడి నిర్ణయించటం వల్ల నెరవేరవచ్చేమో గాని, మహా కార్యాలు మటుకు అలా త్వరపడితే జరగవు. బాగా ఆలోచించి చేసిన పనికి దైవం కూడా అనుకూలిస్తుంది.

అంతే కాదు- శత్రువు మనసులో ఏమున్నదో సరిగా తెలీనప్పుడు, త్వరపడి ఏదో‌ సాహస కార్యంలోకి దిగటం అంత మంచిపని కాదు. భూమికి రాజైనవాడు తన లోటుపాట్లు బయటపడకుండా‌ కాపాడుకుంటూ, శత్రు పక్షపు లోటు పాట్లను ముందుగానే జాగ్రత్తగా గూఢచారుల సహాయంతో తెలుసుకొనాలి.

ఇప్పుడు మనవైపునుండి వెళ్ళే గూఢచారి-తోబాటు వేరొకరిని కూడా‌ పంపించాలి: దీనికోసం అదను ఎరిగి, ఉపాయం తెలిసిన విశ్వాస పాత్రులను ఎవరినైనా ఎంపిక చేసుకోవాలి.

అతడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై మెలగుతూ, విరోధి ఇంటిలో జరిగే సంగతులన్నిటినీ ఎప్పటికప్పుడు మన చెవుల్లో వేస్తూ ఉండాలి.

ఇంతటి గొప్ప కార్యాన్ని నెరవేర్చటం దీర్ఘముఖుని వల్లనే అవుతుంది. అతడు నీళ్ళలోను, గాలిలో కూడాను సంచరించ-గలడు; ఇతరుల మనస్సులో ఏమున్నదో తెలుసుకోగల సమర్థత ఉన్నవాడతను. ఎన్ని రకాలుగా చూసినా ఈ పనిలో అతనికి సాటి రాగలవారు మరెవరూ ఈ సభలో కనబడటంలేదు నాకు. ఈ పనిలో అతనికి తోడుగా అతని తమ్ముడు ధవళాంగుడిని పంపుదాం. అతనికి కూడా ఇతరుల ఉద్దేశాలను తెలుసుకోవటం బాగా వచ్చు.

ఇతరులకు తెలియకుండా దీన్నంతా రహస్యం-గా నిర్వర్తించటం మంచిది. 'ఎట్లాగైతే పిడుగు అకస్మాత్తుగా వచ్చి మీద పడుతుందో, రాజుగారి ఆజ్ఞ కూడా అట్లా చివరి క్షణంలోనే అందాలి' అని చెబుతారు.

రాజుగారి మర్మం ఏమిటో ఎన్నడూ బయట పడకూడదు: ఒకవైపున ఆత్మరక్షణ ఎలా చేసుకుంటూ ఉండాలో, అలాగే మరొకవైపున రాజుగారి మనసులోని వ్యూహాన్ని కూడా బయటపడకుండా అలాగే కాపాడుకుంటూ పోవాలి. 'వ్యూహం మూడవనోట పడింది' అంటే ఇక పనులన్నీ నాశనమైనట్లే.

ఇదంతా‌ తెలిసిన రాజు 'తాను-తన మంత్రి' అన్నట్లు ఉండి, ఎంతవారికీ అర్థం కానట్లు తన నిర్ణయాలను ఎప్పటికప్పుడు వెలువరించు-కుంటూ రావాలి. అదే విజయానికి మూలం అవుతుంది. 'రాజుగారు ఏమారారు' అంటే ఇక రహస్యం బట్టబయలౌతుంది. అట్లా 'వ్యూహం బయల్పడటం వల్ల ఎదురయ్యే చిక్కులు తొలగటం చాలా కష్టం' అని పెద్దలు చెబుతుంటారు. నాకు తోచినంత వరకు తమరికి సర్వం విన్నవించాను. తమరు సర్వజ్ఞులు.

తమకు తెలియని ధర్మాలు ఈ లోకంలో లేనేలేవు. ఇక తమరి ఆనతి ఎలా ఉంటే అలా నడచుకుంటాను" అన్నది.

అప్పుడు ఆ హంసరాజు కరుణ,చిరునవ్వులు ఒలికే చక్కని అందమైన ముఖంతో దాన్ని చూస్తూ "బాపురే! నువ్వు నా మనసులో ఏమున్నదో దాన్ని చదివినట్లే చెప్పావే! నీకు వంద సంవత్సరాలు! నీ మాటలు విని నాకెంతో సంతోషం కలిగింది. నువ్వు చెప్పినదానిలో కాదనేందుకు ఏమీ లేదు. మనం పంపించేందుకు గూఢచారికూడా మంచివాడే దొరికాడు. తప్పని సరిగా చేయాల్సిన పనికి ఆలస్యం ఎందుకు? వెంటనే అమలు చేయండి" అన్నది.

అప్పుడు ఆ మంత్రి సవినయంగా "ప్రభూ! ఇలా 'మన ప్రయత్నం ఏమాత్రం లేకుండానే పనికి తగిన చారుడు దొరకటం' అనేది చాలా శుభ సూచకంగా తోస్తున్నది నాకు. 'భవిష్యత్తులో మనదే విజయం' అనేందుకిది సూచన కావచ్చును. సంకల్పంతోటే విజయాన్ని సాధించగల సమర్థులు మీరు" అని హంసరాజును మెచ్చుకున్నది.

సరిగ్గా ఆ సమయానికే కావలివాడొకడు లోనికి ప్రవేశించి- "ప్రభూ! జంబూద్వీపం నుండి ఎవరో- ఒక చిలుక అట, వచ్చి తమ దర్శనం కోసం వాకిట నిలబడి ఉన్నది. తమరి సెలవైతే దాన్ని లోనికి పంపమంటారా?" అని అడిగాడు.

ప్రభువులవారు మంత్రిగారి వైపు చూశారు. చక్రవాక మంత్రి ఆ చూపుల ఆంతర్యాన్ని పసిగట్టి "నువ్వు ఇప్పుడు ఆ చిలుకను తగిన చోట కూర్చోబెట్టు. ప్రభువులవారి ఆజ్ఞ అయినప్పుడు దాన్ని లోనికి ప్రవేశపెడుదువు. ఇక పో!" అని త్రిప్పి పంపింది.

అప్పుడా కావలివాడు భయభక్తులు కదలాడ-గా వెళ్ళి, బయట ఉన్న చిలుకతో "ప్రస్తుతం మా ప్రభువులవారు మంత్రి వర్యులతో ఏకాంతంగా మంత్రాలోచన చేస్తున్నారు. వారి సమావేశం ముగిసాక, వారే స్వయంగా పిలువనంపుతామన్నారు. అప్పుడు నువ్వు వెళ్ళి వారి పాదాల దర్శనం చేసుకుందువు- అప్పటివరకూ ఇక్కడ విశ్రమించు" అని దానికి తగిన ఆసనం ఒకటి చూపించింది.

సభాగృహంలో హంసరాజు ఉల్లాసంగా మంత్రికేసి చూసి, "ఆహా! మంచి సైనికులకు సంతోషాన్ని, పిరికివాళ్లకు భయాన్నీ కలుగజేసే యుద్ధం ఇక దగ్గరపడింది. యుద్ధంలో వెనుకంజవేయని మహాయోధులకు తమ శరీరాలను సఫలం చేసుకొనేందుకు, చిర-కాలం నిలిచే కీర్తిని సొంతం చేసుకునేందుకు తగిన అవకాశం వచ్చింది. 'బాగా సాన పెట్టబడిన మణి, అడిగినవారికి దానం ఇచ్చిన దాతలు, యుద్ధంలో మరణించిన వీరులు'- ధన్యులు. శక్తి తగ్గటం వల్లనే వీరందరికీ కీర్తి సంప్రాప్తిస్తుంది కదా! అందువల్ల, పిరికి కండ లేని- ఘనమైన ధైర్యం ఉన్న- యోధులనందరినీ యుద్ధానికి సన్నద్ధం అవ్వమనండి. యుద్ధ సమయం దగ్గర పడిందని ఉత్సాహంగా చాటించండి" అన్నది.

అప్పుడా చక్రవాక మంత్రి సంతోషంతో విప్పారిన మొహంతో "ప్రభువులవారు అన్నదంతా శూరజనులు ఇష్టపడేదే తప్ప వేరు కాదు. అయినా తమరి దగ్గర నాకున్న చనువు వల్ల, చిన్న హితవచనం ఒకదాన్ని- తమరికి విన్నవించుకొన బుద్ధి అవుతున్నది.

మీ మాటకు అడ్డు వస్తున్నానని వేరుగా భావించక, శ్రద్ధ నిండిన చిత్తంతో ఆలకించండి.

ముందుగానే కలహానికి కాలుదువ్వటం ఎవరికైనా మంచిది కాదు. పెద్దలు మెచ్చని అటువంటి పనిని తమబోటి శూరులు ఎలాగూ చేయరు.

'ఉపాయాలన్నిటిలోనూ 'దండోపాయం'- భౌతికంగా కొట్లాడటం- అతి నీచమైనది' అని నీతి తెలిసిన పెద్దలు ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉంటారు.

ఏమి చేయబోతే ఏమవుతుందో ఎవరికీ తెలియదు కదా! గెలుపు-ఓటమిలను నిర్ణయించటం ఎవరికి సాధ్యం? అందువల్ల శతృవులను జయించగోరే మహారాజు-లందరూ ముందుగా సామ-దాన-భేదాలు అనే మూడు ఉపాయాలనీ‌ ముందుగా ప్రయోగించి, తమ పనిని నెరవేర్చుకుంటారు; అవన్నీ విఫలమైనప్పుడు మాత్రమే వారు చివరి ఉపాయమైన 'దండ నీతి'ని ఉపయోగించ-బూనతారు. అయినా 'చివరికి అది ఎటు పోతుందో కదా' అన్న ఆలోచనతో, చివరికి యుద్ధంలో విజయం లభించేంతవరకూ వాళ్ళు 'పాలలో పడిన బల్లి మాదిరి' తల్లడిల్లుతూ ఉంటారు.

అందువల్ల, 'మనతో బాటు ఉన్నవాళ్లందరూ శూరాగ్రేసరులు' అని మురియటం మంచిది- కాదు. ఆపద ఎదురవ్వటానికి ముందు ఇండ్ల దగ్గర మనసులు చల్లగా పెట్టుకొని అందరూ శూరుల మాదిరే కనబడతారు గానీ, యుద్ధంలో మదమెక్కిన శత్రువు మీదికి ఉరికి వచ్చినప్పుడు బెదిరిపోక, ఉత్సాహంతో విజృంభించ గలిగే యోధులు లభించటం నిజంగానే కష్టసాధ్యం.

పరాక్రమం వల్ల, పోట్లాట వల్ల సాధించలేని పనులు అనేకం చిన్న ఉపాయంతో సాధించబడేవిగా ఉండొచ్చు.

అది తెలుసుకోకుండా‌ శ్రమిస్తే, పడిన పాట్లన్నీ వృధా అవుతాయి తప్ప వేరే ప్రయోజనం ఏదీ ఉండదు. 'దూర భీరుత-ఆసన్న శూరత మహాత్ముల సహజ గుణాలు' అని చెబుతారు. అంటే గొప్పవాళ్లు తాము పూనుకొననవసరం లేని పనుల పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తారు; తమ మీద పడిన కష్టాలను మటుకు ధైర్యంతో ఎదుర్కొంటారు అన్నమాట.

తక్కువ రకం వాళ్లలో ఈ గుణాలు వ్యతిరేకంగా ఉండటం కద్దు. వేలవేల శపధాలు చేయటం, పలుమార్లు చేతులెత్తి మ్రొక్కటం, మాటిమాటికీ అభివాదాలు చేయటం, మెత్తగా, ఇష్టంగా మాట్లాడటం- ఇవి దుర్మార్గుల లక్షణాలు. ఇక అబద్ధపు మాటలంటారా, వారికవి వెన్నతో‌పెట్టిన విద్యలే!
గొప్పవాళ్ళు ఆపదలు ఎదురైనప్పుడు కూడా‌తమ ధైర్యాన్ని విడచిపెట్టరు. ఆపదలలో ధైర్యం, సంపదలు ఒనగూరినప్పుడు సహనం, సభల్లో అందరినీ మెప్పించేట్లు చతురంగా మాట్లాడటం, యుద్ధం ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడటం- ఇవి మహానుభావులకు సహజ సిద్ధంగా లభించే గుణాలు.

అంతేకాదు. మరొక సంగతినీ గుర్తుంచుకోవాలి. చిత్రవర్ణుడు మహా బలవంతుడు; బలవంతుల తోడ్పాటు ఉన్న వాడు. అందువల్ల మనం ఇప్పుడు అతనితో తలపడటం అనేది అడవిలో రాజుకున్న మంటపైకి మిడుతలు ఉరికినట్లే అవుతుంది. ఎంతటి బలవంతుడైనా సరే, తనను ఎదిరించిన వాడితో‌ పోరాడతాడు తప్పిస్తే, అణగి ఉండే వాని మీద తన బలాన్ని ప్రయోగించడు. వేగంగా ప్రవహించే నదీజలాలుకూడా తమను నిలిపి ఎదిరించే వృక్షాలను పెకలించి వేస్తాయి గానీ, వంగి అడుగంటి ఉన్న గడ్డి పోసలను ఏమీ చేయవు! ఓర్పుతో సమానమైన మంచి ఉపాయాలు వేరేవీ లేవు.

అందువల్ల తొందరపడటం‌అనేది కీడుకు మూలం కావచ్చును.

'తగిన కోటను కట్టుకోవటం ' అనేది మనం ఇప్పుడు అతి త్వరగా చేపట్టవలసిన పని. కోటలో ఒక్కడున్నా సరే, కోట బయట ఉన్న నూరుగురితో పోరాడే శక్తి ఉంటుంది వానికి. కోటలేని రాజు కొండ నుండి జారి పడిన మనిషితో సమానం: కాబట్టి మనం నిర్మించబోయే కోట కూడా శత్రువులకు అందనిదీ, వాళ్ళు లోనికి చొరబడేందుకు అసాధ్యమైనదీ అవ్వాలి.

చక్కని జలాలతో సమృద్ధంగా నిండి ఉన్న కొలనొకటి ఆ కోటలోనే ఉండాలి. నేను చెప్పవలసినవన్నీ చెప్పాను. ఇక ప్రభువులవారు జరగవలసిన పనులన్నిటినీ నిర్వహించి, కార్యనిర్వహణా ధురంధరులు కావాలి. ఆలస్యం లేకుండా, ముందు ఈ పనికి ఎవరినైనా సమర్థులను నియోగించాలి" అన్నది.

అప్పుడు హిరణ్యగర్భుడు కూడా కొంచెం ఆలోచించి, "సరే, అలాగే కానివ్వండి. కోటను నిర్మించటం చేతనైన నిపుణులను పిలువనంపండి" అన్నది. వెంటనే ఆ చక్రవాక మంత్రి ఒక సేవకుడిని పంపి శిల్పకళలో నిపుణుడు అయిన సారస పక్షి(బెగ్గురు పక్షి)ని ఒకదాన్ని పిలువమన్నది. అది రాగానే, చక్రవాకం దాన్ని సగౌరవంగా కూర్చోబెట్టి "అయ్యా! సారసోత్తమా! ఈ సమయంలో మాకు నీతో చాలా ముఖ్యమైన పని పడి, నిన్ను ఇట్లా హడావిడిగా పిలువనంపాం.

మనకు తక్షణం ఒక కోట అవసరం ఔతున్నది. ఈ పని చేయటం వేరే వాళ్ళెవరికీ సాధ్యం కాదు- దీని భారం అంతా నీ మీదనే మోపవలసి వస్తున్నది. ఇది నీకూ మంచిదే; స్వామి అనుజ్ఞను కాదనక తలదాల్చు. శత్రువులకు దుర్గమం అయిన కోటను ఒకదాన్ని అతి త్వరగా నిర్మించు. నీ నైపుణ్యం ఎంత గొప్పదో చూపించు!" అన్నది.