మరాఠా సైన్యానికి బాజీరావు పీష్వా సర్వ సైన్యాధ్యక్షుడు. ఓసారి ఆయన యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు.

దారిలో అలసిపోయి ఓ చోట శిబిరం ఏర్పాటుచేసుకున్నాడు. అయితే అది ఊరికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం- తినడానికి తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయాయి. సైనికులకు ఆకలి వేస్తున్నది. "దగ్గరలో ఏదైనా తోటలో పండ్లు కోసుకుని రండి- అయితే దౌర్జన్యంగా కాదు- యజమాని సమ్మతితో కోసుకురావాలి" చెప్పాడు పీష్వా.

కొందరు సైనికులు పళ్లకోసం బయలుదేరారు. దగ్గరలోనే ఓ పెద్ద పండ్ల తోట కనబడింది. నిండ పండ్లతో భలే ఉంది ఆ తోట. అ తోటలో ఒక రైతుకూడా కనిపించాడు వాళ్లకు. సైనికులు అతని వద్దకు వెళ్ళారు; విషయం చెప్పారు.

"ఓహో! పీష్వా బాజీరావు మా ఊరికి వచ్చాడా!" అన్నాడు రైతు సంతోషంగా. "రండి రండి! మీకు ఒక మంచి పండ్ల తోట చూపిస్తాను. అందరూ పళ్ళు కోసుకొని తిందురు, రండి రండి" అని వెంట తీసుకువెళ్లాడు.

కొంతదూరం వెళ్ళాక అతను ఓ చిన్న తోటను చూపించాడు. "దీనిలో పండ్లు కోసుకోండి" అన్నాడు. ఆ తోట చిన్నదిగా ఉంది; అందులో‌ వీళ్ళకు సరిపడా పళ్ళు ఉన్నాయి; కానీ అది ముందు చూసిన తోటంత బాగా లేదు.

సైనికులకు బాగా కోపం వచ్చింది. "అంత పెద్ద తోటను వదిలి దీన్ని చూపిస్తావా?" అన్నారు. "ఇంకెవరిదో తోటను మాకు చూపించి, నీ తోటను మటుకు నువ్వు కాపాడుకుందామనుకున్నావు కదూ?" అంటూ అతడిని పీష్వా దగ్గరకు తీసుకువెళ్లారు.

సైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పీష్వా "ఎందుకిలా చేశారు?" అని అడిగాడు అతన్ని, మర్యాదగా.

'ప్రభూ...సైనికులు నన్ను కలిసిన తోట నాదికాదు. నాది కానిదాన్ని దానం చేసే హక్కు నాకు ఎక్కడ ఉంటుంది? ఇక రెండోసారి చూపించింది నాదే- అందుకే ఆ తోటలోని పళ్ళు కోసుకొమ్మని చెప్పాను. అదే కదా ధర్మం?" అన్నాడు రైతు , ధైర్యంగా.

పీష్వా అతన్ని మెచ్చుకున్నాడు. అతని పంటకు సమానమయిన బంగారాన్నిచ్చి పంపించాడు!