కొత్తపల్లి పుస్తకం చేతికి రాగానే మొట్టమొదట చదివేది సంపాదకీయాన్నే. కొన్నిసార్లు అది ఉన్నతంగా నిలబడ్డా, మరికొన్ని సార్లు నిరాశ పరుస్తుంటుంది- ఇదిగో, ఈ సారిలాగా. ఈసారి సంపాదకీయం చాలా క్లిష్టంగా ఉంది. "ఇదంతా ఏంటి, దేనికి చెబుతున్నారు?" అనేది అర్థం కావటానికి ఆ విషయం మీద లోతైన అవగాహన ఉంటే తప్ప సాధ్యం కాదు అనిపించింది. పెద్దవాళ్ళకి సైతం అది ఓ పట్టాన మింగుడు పడలేదు. నీలపు నీటిచుక్క కథకీ,కార్మిక దినోత్సవానికీ మధ్య సంబంధంపిల్లలకి నిజంగా అర్థం కాదు. చదివిన పిల్లలు స్ఫూర్తి పొందాలంటే వారికి విషయ పరిజ్ఞానం అవసరం. 'ఇంత గందరగోళంగా కాకుండా సరళంగా, తిన్నగా ఆ రోజు యొక్క విశిష్టతనీ, దాని చరిత్రనీ వివరించి ఉంటే బాగుండేది' అనిపించింది.

మా అభిమాన సంపాదకీయం మరింత స్ఫూర్తిదాయకంగా పిల్లలకు దగ్గరవ్వాలని మా కోరిక.

సంపాదకీయం కలిగించిన నిరాశనంతా పిల్లల కథలు తుడిచి పెట్టేశాయి. దాదాపుగా అన్నీ -"ఇవి నిజంగా పిల్లల కథలే- విషయం, కథ, అల్లిక, అన్నీ ఆ వాసనల్నే గుబాళిస్తున్నాయి" అనిపించేట్టుగా ఉన్నాయి.

  • 'గొప్పలు చెప్పకు' వ్రాసిన ముగ్గురమ్మాయిలూ భలే క్రొత్త ఐడియాతో‌ వ్రాసారు కథని. చిన్నదైనా ఎంత చక్కగా ఉందో, కథ!

*కాశ్యప్ వ్రాసిన కథలో ముగ్గురి మిత్రుల తెలివితేటలూ మరీ ఎక్కువగా ఉన్నాయనిపించినా, తను వివరించిన విధానం చాలా బాగుంది.

*కాలం విలువ కథలోని ఇన్స్పెక్టరు బొమ్మలో డాక్టరుగా అవతరించాడు!

*అమ్మమ్మ ఊరి గురించి ప్రవీణ ఎంత ఊరించి చెప్పింది! అది కథ కాదనే అనిపించలేదు అసలు.

*కుమారి వ్రాసిన 'సూరితోట" లాంటివి కల్పించటం సరదాగా ఉంటుంది- పెద్ద కష్టం కూడా‌కాదు!

ఇక బొమ్మకి కథల కోసం‌ ప్రత్యేకంగా ఓ పుస్తకమే వెయ్యాలేమో! ఒకదానికొకటి సంబంధం లేకుండా వైవిధ్యంతో ఉన్నాయి కథలు. 'గోపి కల' ఒక వెరైటీ ఆలోచన. 'తిరిగి కలిపిన బొమ్మ' సినిమా లెవెల్లో ఉంది. వికాస విద్యావనం పిల్లల పేరుతోబాటు రోల్‌నంబర్లు కూడా వ్రాయటం నవ్వు తెప్పించింది.

చిన్నప్పుడు ఎవరైనా ఏం చదువుతున్నావని అడగటం ఆలస్యం- "మాలతి, రోల్ నంబరు 24, మూడో తరగతి" అని చెప్పకపోతే తృప్తి కలిగేది కాదు నాకున్నూ!

'ఒక పిల్లి స్వగతాన్ని' చాలా ఎంజాయ్ చేశాం, అందరం. ముగింపు మరీ బాగుంది.

భయం-భక్తి కథలో లాగా, మనకు భక్తికంటే భయమే ఎక్కువన్నది పచ్చి నిజం. దేవుడంటే ఉన్న భక్తి వల్ల కలిగే నమ్మకం, దెయ్యమంటే కలిగే భయాన్ని పోగొట్టటంలో ఓడిపోతుందన్నది చాలామంది దగ్గర తెలుసుకున్న విషయం. నమ్మకాన్ని భయం జయించటం ఎప్పుడూ దురదృష్టకరమే.

మూర్తిగారి చిలిపి ప్రశ్నలలో మూడోది చాలా బాగుంది.

యోకేశ్వరన్ పరిచయం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. పిల్లలు వాళ్ల పరిసరాలను గమనించటం, వాటి గురించి ఆలోచించటం ఎంతో అవసరం. -మీకూ ఇలాగే అనిపించిందా?