ఓఢ్ర రాజులు (గజపతులు) శ్రీ లక్ష్మీనారాయణ జగద్దేవ్ గారి కాలంలో- అంటే క్రీ.శ.1861లో- ప్రాధమిక పాఠశాలగా ప్రారంభించబడింది. రాజా మధుసూదనదేవ్ గారి కాలంలో ఉన్నత పాఠశాలగా మారింది. ప్రస్తుతం ఈ మహారాజావారికి 93ఏళ్ళు. ఒరిస్సాలోని బరంపురం లో నివాసం ఉంటున్నారు. బరంపురంలో పేరుపొందిన 'లింగరాజు లా కాలేజ్' వ్యవస్థాపకులు కూడా వీరే.

రొక్కం లక్ష్మీ నరసింహ దొర- శాసన సభ్యునిగా రెండుసార్లు టెక్కలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు; ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు గా పనిచేసిన ప్రముఖులు. ఈ పాఠశాలకు మౌలిక వసతులను సమకూర్చటంలో విశేష కృషి సలిపారు. వీరి హయాంలో పాఠశాల బోర్డు స్కూలు అయ్యింది.

ప్రధానోపాధ్యాయులు శ్రీ యల్లాపంతుల కృష్ణమూర్తిగారు ఈ పాఠశాలకు ఆత్మగౌరవాన్ని ఆభరణంగా అందించిన నియమ నిబంధనల తలమానికం. వీరి హయాంలో విదేశీయులు పాఠశాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా వచ్చేవారు.

ఆచార్య రోణంకి అప్పలస్వామి: ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్ర విస్మరింపజాలని కవి పండితుడు- ఈ బడిలోనే చదువుకున్నారు. టెక్కలి పాఠశాలకు మేథో వర్గాలలో స్థానం కల్పించిన ఉన్నత వ్యక్తి-

"దేశం గడప దాటకుండా 14యూరోపియన్ భాషలు మీరెలా నేర్చుకున్నారు?" అని అడిగితే-
"మా నాన్నగారు నాకు తెలుగు అంత బాగా నేర్పారు గనుక!" అని చెప్పిన పదహారణాల తెలుగు 'వాడి' రోణంకి.

మంత్రి ప్రగడ శేషగిరి రావు గారు- టెక్కలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఒకనాడు 'ఇంగ్లీషు గ్రామర్ చెబితే ఆయనే చెప్పాలి' అని విద్యార్థులు తపన పడేవారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి సత్తారు ఉమాపతి, విద్యుత్ ట్రాన్‌స్కో ఇంజనీరు వట్టికూళ్ళ సూర్యనారాయణ, పలాసలో డాక్టరుగారు విజయకుమార్, జిల్లా పంచాయతీ అధికారి-గజల్ గాయకుడు ప్రధాన ఆదినారాయణ, ఒకప్పటి టెక్కలి యంయల్‌ఏ హనుమంతు అప్పయ్యదొర, మాజీ శాసన సభ్యులు సత్తారు లోకనాధం- వీరంతా టెక్కలి పాఠశాల విద్యార్థులే; శేషగిరిరావు మాస్టారి శిష్యులే.

హనుమంతు వీరన్న: సెలవురోజులనికూడా బడిపిల్లలతో గడిపే పిల్లల అభిమాన మాస్టారు. 1979లో నాటి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించారు.

తెన్నేటి సత్యనారాయణ: ఏభై సంవత్సరాలు పనిచేసిన ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయులుగా రిటైరైనా, ఇంటివద్దనే పిల్లలకు ఆంధ్రా మెట్రిక్ పరీక్షలకు సిద్ధం చేయించిన మేటి.

జంధ్యాల లక్ష్మీ నారాయణ: మూడు దశాబ్దాల ఉపాధ్యాయులు- పాత్రికేయులు- స్వాతంత్ర్య సమర యోధులు.

ఆట్ల అప్పల రామయ్య: ప్రజాపోరాటాలకు జీవితాన్ని, జీతాన్నికూడా ఖర్చు చేసిన ఉపాధ్యాయుడు

భారత రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి ఈ పాఠశాల విద్యార్థే.

మాజీ డిజిపి హెచ్.జె.దొర, డా. కిల్లి రామమోహన రావులు ఈ పాఠశాల విద్యార్థులే.

ఇంకా ఎంతమందిని సామాజిక శక్తులుగా మలచిందో, ఈ బడి!