ఉజ్జయినీ నగరానికి వెళ్ళే దారిలో ఒక గొప్ప రావిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి, ఒక హంస రెండూ గూళ్ళు కట్టుకొని నివసించేవి. అవి అట్లా ఉంటూ ఉంటే, ఒక సారి ఎండాకాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఆ సమయంలో దారివెంబడి పోతున్న బాటసారి ఒకడు చాలా అలసిపోయి, రావి చెట్టు నీడన కాళ్ళు చాపుకొని పడుకున్నాడు. రక్షణకని వెంట తెచ్చుకున్న ధనుస్సును ఒకదాన్ని అలాగే ఎక్కుపెట్టి, ప్రక్కన పెట్టుకొని ఉన్నాడు వాడు.

అయితే కొంతసేపు గడిచేటప్పటికి, సూర్యుడు ముందుకు జరిగాడు; దాంతో నీడ కూడా ప్రక్కకు తొలగింది. బాటసారి ముఖంమీద ఎండ పడటం మొదలుపెట్టింది. చెట్టుమీద ఉన్న హంస ఆ బాటసారి అవస్థను చూసి జాలిపడింది. తన రెక్కలు చాపి, ఎండకు అడ్డం పెట్టి కదలకుండా కూర్చున్నది.

అలా హంస రెక్కల నీడన బాటసారి హాయిగా నిద్రపోతుంటే చూసింది కాకి. సహజంగానే దుష్టస్వభావి అయిన ఆ కాకికి వాడి సుఖాన్ని చూసి కళ్ళుకుట్టాయి. వాడిని అలా చూస్తూ ఊరుకోలేకపోయింది అది. గబుక్కున ఎగిరి వచ్చి అతని పైనున్న కొమ్మ మీద వాలింది. సరిగ్గా అతని ముఖం మీద పడేటట్లు రెట్ట వేసింది. తటాలున ఆ చోటును వదిలి ఆకాశానికి ఎగిరి మాయమైపోయింది.

దుష్టబుద్ధి అయిన ఆ కాకి, తన బుద్ధిని అందరికీ చాటి చెప్పటం కోసం‌ అట్లా చేసి ఉండవచ్చుగానీ, అంతకు మించి ఏమైనా లాభం ఉందా, దానికి? దుష్టులకు ఇతరులను హింసించటాన్నిమించిన పరమావధి మరొకటి కనబడదు.

సరే, ఇంకేముంది? బాటసారికి నిద్రాభంగమైంది. వాడు కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు. చెట్టుమీద రెక్కలు చాపుకొని కూర్చున్న హంస కనబడింది వాడికి. తన ముఖం మీద రెట్టవేసింది అదే అనుకున్నాడు వాడు. దాంతో వాడికి దానిమీద చాలా కోపం వచ్చింది. అప్పటికే ఎక్కుపెట్టి ఉన్న విల్లును తీసుకొని వాడు ఒక్క బాణంతో హంసను నేలకూల్చాడు. ఏ పాపం ఎరుగని ఆ అమాయకపు హంస తోటి హంసల ఆశలన్నిటినీ‌ బూడిద చేస్తున్నట్లు నేలరాలి ప్రాణం విడిచింది.

చూశారా, కాలం వక్రీకరిస్తే ఇలాగే అవుతుంది. దైవ నిర్ణయానికి తిరుగు ఉండదు కదా! అపరాధి అయిన కాకి హాయిగా ఎగురుతుంటే, ఏలాంటి తప్పూ చేయని హంస హింసింపబడింది చూడండి! 'పాపీ చిరాయు:' అని పెద్దలు చెప్పే మాటలో ఏమాత్రం అసత్యం లేదు. చెడ్డవాళ్లతో సహవాసం ఏనాటికైనా కష్టాలనే తెచ్చిపెడుతుంది.

చిలుక ఆ కథ చెప్పి ఆగగానే నేను దానివైపుకు తిరిగి - "మిత్రమా! నాకు మా ప్రభువైన హిరణ్యగర్భుడు ఎంతటివాడో నువ్వూ అంతే. మహాత్ములైనవారికి ఈ లోకంలో అందరూ ఆత్మ సమానులే- తనతో సమానమైనవారే! వారికి 'పరాయివాళ్ళు' అంటూ‌ఎవరూ ఉండరు. స్వ-పర భేదాలెంచేది మందబుద్ధులేగాని, మహానుభావులకు అట్లాంటి తేడాలేవీ ఉండవు. 'ఆత్మవత్ సర్వభూతాని'-

'ఎల్లప్రాణులూ‌తనలాంటివారే' అని వినలేదా? నా మనస్సు ఎంత లోతైనదో తెలియక, ఊరికే నిందలు మోపుతున్నావేల? ఒక్క నిముషంలో నశిస్తుందికదా, ఈ శరీరం?! అట్లాంటి ఈ శరీరాన్ని నమ్మి, నీ ఉసురు పోసుకొని, శాశ్వతమైన నరకకూపంలో పడి ఎవ్వరైనా పడరాని బాధలు ఎందుకు బాధలు పడతారు?

నా పట్ల నీకు విశ్వాసం ఎందుకు, ఉదయించదు? మహాత్ములతో కలిసి ఏడు అడుగులు నడిచినంత మాత్రాన వాళ్లతో చెలిమి ఏర్పడిపోతుందని వినలేదా? పండ్లను (అట్లాగే, పనులను) చెడగొట్టటం నీ సహజగుణం కదా, అందుకనే నీకు అందరూ అట్లా కనబడతారు కాబోలు. నీ అల్పబుద్ధిని ప్రక్కన పెట్టి, ప్రయాణమై రా, పోదాం" అన్నాను.

అప్పుడా చిలుక పక పకా నవ్వి, "ఓరీ, నువ్వు కప్ప చర్మం కప్పుకున్న పాములాంటిదానివి. నిన్ను చూస్తే ఎవరికన్నా నమ్మకం చిక్కుతుందా? ఏది ఏమైనా, ఆత్మ రక్షణ దగ్గరికి వచ్చేసరికి 'ఏమరపాటు' అనేది ఎవ్వరికీ పనికిరాదు. ఇప్పటి పగను నువ్వు మనసులో పెట్టుకొని, బయట పడకుండా, కొంచెం దారి సాగనిచ్చి, ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంలో ఎక్కడో నన్ను మోసగించి చంపుదామని ఇన్ని ఎత్తుగడలు వేస్తున్నావు. ఇంతసేపూ నన్ను, మా రాజును నోటి దురద తీరేట్లు తిట్టి, ఇంతలోనే ఏ నోరు పెట్టుకొని మళ్ళీ స్నేహం కోసం అర్రులు చాస్తున్నావు? 'పరమ దుర్మార్గులలోకెల్లా అతి దుర్మార్గుడివి నువ్వు'- అని నీ వాలకం చూడగానే తెలిసిపోతున్నది. 'అతివినయం ధూర్త లక్షణం'- అతి మర్యాద చూపటం దుర్మార్గుల లక్షణం అని పెద్దలు చెబుతారు. దుర్మార్గుల మాటలు ఇష్టంగాను, 'అవునవును' అనిపించేవిగాను ఉన్నప్పటికీ, కాలంగాని కాలంలో వచ్చే పువ్వుల మాదిరి అవి చివరికి లేనిపోని కష్టాలనే తెచ్చిపెడతాయి. నువ్వెంత దుర్మార్గుడివో నీ మాటతీరుతోటే తెలియవస్తున్నది. చిత్రవర్ణ-హిరణ్యగర్భుల మధ్య జరగనున్న మహోగ్ర యుద్ధానికి నీ మాటలేకద, కారణం? శత్రువైనవాడు చంపటం కోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాడు. భూమిమీద ఇంకొంతకాలం జీవిద్దాం అనుకుంటున్నవారెవ్వరూ అలాంటి మాటలకు తావు విడువరు. గతంలో ఒక మువ్వన్నె మెకం (మూడు రంగుల జంతువు- పెద్దపులి) అట్లానే కద, ఒక కొంగను అంతం చేసింది?! నీకు ఆకథ చెబుతాను- జాగ్రత్తగా విను:

మిత్రద్రోహం అనే పులి-కొంగల కథ జంబూ ద్వీపంలో గ్రామ్యకం అనే చాలా అందమైన అడవి ఒకటి ఉండేది. ఎల్లప్పుడూ వికసించి ఉండే అడవి మల్లె పూల తీగెల చేత కప్పబడ్డ పొదలు లెక్కకు మిక్కిలిగా ఉన్న పొదరుటడవి ఒకటి అందులో ఉన్నది. పూల సమూహాలు వెదజల్లే సువాసనలతో కలిసి జారిన మకరందపు బిందువులను ఆస్వాదించటంకోసం వచ్చిన తుమ్మెదల గుంపులతో ఆ పొదరుటడవి మరింత శోభిల్లేది. చెట్ల కొమ్మల గుబుర్లలో కూర్చొని ఎడతెరపిలేకుండా కూస్తున్న పక్షుల కిలకిలారావాలతో ఆ పొదరుటడవి నలు దిక్కులూ పిక్కటిల్లిపోతుండేవి. ఆ అడవి మధ్యలో ఒక చెట్టు క్రింద ఒక పొద ఉండేది. మిట్ట మధ్యాహ్నంకూడా సూర్యకిరణాలు చొరనంత దట్టంగా ఉండేది, ఆ గుబురుపొద. అట్లాంటి ఆ పొదలో నివసించేది, ఒక పెద్ద పులి. దానికి దగ్గరలోనే ఒక జువ్వి చెట్టు ఉండేది. ఆ చెట్టుమీద గూడు కట్టుకొని ఒక కొంగ కాపురం ఉండేది.

ఒక రోజున ఆ పెద్దపులి ఒక పొట్టేలును చంపి, దాని మాంసం తింటూ‌ ఉండగా, విధి వశాత్తు పొట్టేలు ఎముక, చిన్నది ఒకటి- దాని పళ్ళమధ్య సందులో ఇరుక్కుపోయి చాలా చికాకు పెట్టింది. పులి ఎంత ప్రయత్నించినా దాన్ని వెలికి తీసే మార్గం చిక్కలేదు. చివరికి అది ఎంత బాధకు గురైందంటే, తలను క్రిందికి వ్రేలాడ వేసుకొని, నేలమీద పడి పొర్లి, తీవ్ర వేదన అనే భరింపరాని యాతనను అనుభవిస్తూ, దిక్కులు పిక్కటిల్లేటట్లు అరుస్తూ ఉండింది.

ఆ ఆర్తనాదాలకు పైనున్న కొంగ హృదయం ద్రవించింది. అది రావి చెట్టు పైననే కూర్చొని, క్రింద అవస్థపడుతున్న పెద్దపులిని చూసి "ఓ పులీ! నిన్ను ఈ అడవిలో చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎన్నడూ నువ్వు నోరు తెరచి ఇంతగా బాధపడటం చూడలేదు. ఇప్పటి నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కల్గుతున్నది. ఇంత కష్టం ఏమొచ్చింది, నీకు? చెప్పు" అన్నది.

ఆ ఓదార్పుమాటలకు పులి కొంత సంతోషించింది. దాని బరువు కొంచెం తగ్గినట్లయింది. నాలుక తడబడుతుండగా అది కొంగతో "ఓ దయామయా! నా దురదృష్టం ఏమని చెప్పేది? నిన్న రాత్రి నేను ఒక పొట్టేలును చంపి, ఆ మాంసం తింటూ ఉండగా, ఏ పాపకర్మ ఫలితమో మరి, ఒక ఎముక నా పళ్ళ సందులో ఇరుక్కుపోయింది. దాన్ని తీసే ఉపాయం తోచక, అప్పటినుండీ ఈ విధంగా అంతులేని క్షోభను అనుభవిస్తూ ఉన్నాను. 'ఇక నన్ను ఈ ఆపదనుండి గట్టెక్కించగల నాధుడు ఎవ్వరు?' అని ఆందోళన పడుతుండగా నా పాలిటి భాగ్యదేవతే 'నీ సాంగత్యం' అనే ఆధారాన్ని కల్పించింది. నిజంగా చూస్తే నువ్వు మామూలు కొంగవా- కానే కాదు! ఎన్నో జన్మలలో నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే, నన్ను బ్రతికించటం కోసం- నీ రూపం ధరించి నా ముందుకు వచ్చి నిలచింది! నాకిక నువ్వు తప్ప వేరే శరణ్యం లేదు. నాకు సాయం చేసినా, చేయకున్నా నువ్వే గతి. నా కోరికను వ్యర్థం చెయ్యక, మంచి మనసుతో‌ కాస్తంత ప్రాణదానం చేసి పుణ్యం కట్టుకో. నాకింత మాత్రం మేలు చేశావంటే జీవితాంతం నీ మేలు మరచిపోను. ఇక ఆలస్యం చేయకు. ఆపదలో ఉన్న నన్ను రక్షించు" అని దీనంగా, పలు రకాలుగా‌ ప్రార్థించింది.

అప్పుడా కొంగకు పట్టరాని దయ పుట్టి, చెట్టు దిగి వచ్చింది. కోరల పులి నోరు తెరచుకొని ఉండగా అది తన ముక్కును చటుక్కున దాని నోటిలోనికి జొనిపి, ఉపాయంగా ఆ ఎముకను బయటికి లాగేసింది. అది మొదలుకొని ద్వీపంలో నివసించే ఆ పులి, గాలిలో విహరించే ఆ కొంగ- రెండూ మంచి మిత్రులైనారు- ఇద్దరూ స్నేహంలోని సుఖాన్ని చవిచూడటం మొదలు పెట్టారు.

(ఆ తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం...)