అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి, వాళ్ళ మారుతల్లి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి పేరు రమ. రమ చాలా అమాయకురాలు. వాళ్ల మారుతల్లేమో అసలు మంచిదికాదు. ఆమెకు రమ అంటే చాలా కోపం కూడాను. రోజూ కచ్చెడన్ని బట్టలు తెచ్చి పడేసి రమను కుట్టమనేది. రమ అలసిపోతే కూడా "ఇంకా జోరుగా చేయి" అని ఒత్తిడి పెట్టేది. రమ ఇంకా చిన్నదే కదా, మరీ జోరుగా బట్టలు కుట్టటం రాదు.

అయితే ఒకరోజున మారుతల్లి రాణి దగ్గరికి వెళ్లింది. "నా కూతురు చాలా బాగా బట్టలు కుడుతుందమ్మా! ప్రతి రోజూ పది పది బట్టలు కుడుతుంది, ఇంకా కావాలని మారాం చేస్తుంది" అని అబద్ధాలు చెప్పింది. "ఓహో అట్లానా" అని రాణి స్వయంగా వాళ్ల ఇంటికి వచ్చి చూసింది. రమని వాళ్ల రాజ్యానికి తీసుకొని పోయింది. ఆమెకు కచ్చెడన్ని బట్టలు ఇచ్చి, "ఒకే రోజులో పదిబట్టలు కుట్టాలి" అని ఆజ్ఞాపించింది. "మరుసటి రోజునుండే పని మొదలుపెట్టాలంది. ఇంక పాపం, రమ ఏమి చేస్తుంది? ఏమీ చేయలేక, ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని బాగా ఏడ్చింది.

మరుక్షణం ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయినారు ఆమెముందు-

మొదటి దేవత చెయ్యి చాలా పెద్దగా ఉంది. మరొక దేవత కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. చివరదేవత పెదవులు చాలా పెద్దగా ఉన్నాయి.
ఆ ముగ్గురు దేవతలకు బట్టలు కుట్టడమంటే చాలా ఇష్టం. మొదటి దేవత గబగబా దారాలు వడికింది. రెండో దేవత గబగబా బట్టలు పరచింది. మూడో దేవత గబగబా బట్టలు కుట్టింది. పది బట్టలూ కేవలం పది నిమిషాల్లోనే కుట్టేశారు ముగ్గురూ. అటు తర్వాత వాళ్ళు ముగ్గురూ మాయమయ్యారు. తెల్లవారాక రాణి వచ్చి చూసింది. "అబ్బ అన్ని బట్టల్ని ఒక్క రోజులో కుట్టేశావే" అని ముచ్చట పడింది. బట్టల్ని చూసి చాలా సంతోషపడింది.

అయితే ఏమైందంటే, ఆ బట్టల్ని చూడగానే ఆ రాజ్యపు రాకుమారుడు రమని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాకుమారుడు మంచివాడే; కానీ ఎవరిమాటా వినడు; ఎవరి సలహాలూ తీసుకోడు.

అతను పెళ్ళి చేసుకుంటానని చెప్పిన రోజు రాత్రి దేవతలు తిరిగి వచ్చారు రమ దగ్గరికి. ఆ రోజున రమ చాలా సంతోషంగా ఉంది. "మీ కోసం ఏమైనా చేస్తాను" అని మాట ఇచ్చింది వాళ్లకు. అప్పుడు దేవతలు అన్నారు- "మేము ముగ్గురం నీ పెళ్లికి వస్తాం" అని . "సరే, దానిదేముంది, రండి" అన్నది రమ. “'అయితే మీరు ఎవరు' అని ఎవరైనా అడిగితే నేను ఏమి చెప్పను?" అని అడిగింది . "'మేము నీ బంధువులం' అని చెప్పు!" అని సలహాఇచ్చారు దేవతలు.

మరుసటి రోజు పెళ్లికి అందరూ హాజరయ్యారు; అందరితోబాటు ఆ దేవతలు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు. అందరూ వాళ్లను గురించి అబ్బురంగా చెప్పుకున్నారు. "వాళ్ళెవరు?" అని రమని అడిగారు అందరూ. "మా బంధువులు " అని చెప్పింది రమ. రాకుమారుడు వాళ్లకేసి మురిపెంగా చూస్తూ "ఎందుకు, ఒకరికి చేతులు పెద్దగా ఉన్నాయి, ఒకరికి కాళ్ళు పెద్దగా ఉన్నాయి, ఒకరికి పెదవులు పెద్దగా ఉన్నాయి?" అని అడిగాడు. "నేను గబగబా బట్టల్ని పరుస్తాను" అన్నది చేతులు పెద్దగా ఉన్న దేవత. "నేను చాలా బాగా పరుగెత్తి దారాలు వడుకుతాను" అని చెప్పింది రెండవ దేవత. "నేను దారాన్ని నా పెదవులతో సరి చేస్తూ వేగంగా బట్టలు కుడతాను" అన్నది మూడవ దేవత.

"ఓహో, అందుకేనన్నమాట, ఇంత త్వరగా, ఇంత చక్కని బట్టలు కుట్టగలిగింది రమ!" అనుకున్నాడు రాకుమారుడు. "అందరూ కలసి మెలసి ఉంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటే పనులు ఇంత బాగా నెరవేరుతాయా!" అని ఆశ్చర్యపోయాడు.

రాకుమారుడు, రమ అటుపైన ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలసిమెలసి కలకాలం జీవించారు.