ఒకరోజు సాయంత్రం అవ్వ, అమ్మ, బాబు చెరువు గట్టుమీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. చెరువులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. వాతావరణం చాలా బాగున్నది. "అవ్వా, అవ్వా! ఓ మంచి కథ చెప్పవూ?" అని అవ్వ దగ్గరికి వెళ్ళాడు బాబు. "ఇక్కడ కూర్చొని కథలు చెప్పుకుంటూంటే చీకటి పడిపోదూ? ఇంటికెళ్ళాక చెప్పుకుందాంలే" అంది అవ్వ. "కాదు, ఇప్పుడే ఓ చిన్న కథ చెప్పు, రాక్షసుడి కథ" అని పట్టు పట్టాడు బాబు. అమ్మ, బాబు చెట్టుకింద కూర్చొని కథ వింటుంటే, అవ్వ కథ చెప్పటం మొదలుపెట్టింది ఇలాగ-

"అనగనగా ఒక రాజ్యంలో ఒకరాజు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. ప్రజలకి సాయం చేస్తూఉంటాడు. ఒకరోజున ఆ రాజ్యంలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ప్రజలను తినడం మొదలుపెట్టాడు. రోజుకో ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వారిని తింటున్నాడు వాడు.

అట్లా ఒకరోజున వాడు రాజు గారి ఇంటికి వెళ్ళి "నాకు ఆకలిగా ఉంది- నీ కూతురు కావాలి" అన్నాడు. అంత పెద్ద రాక్షసుడిని చూసి రాజుకూడా భయపడ్డాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆయనకు. అప్పుడు రాక్షసుడే అన్నాడు- నీ బిడ్డని రక్షించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితే నీ కుమార్తెను వదిలివేస్తాను. తప్పు సమాధానం చెప్పిన వాళ్ళని నాకు ఆహారంగా ఇవ్వాలి నువ్వు" అని చెప్పాడు రాక్షసుడు.

రాజు "సరే ఆ ప్రశ్న ఏమిటో అడుగు" అన్నాడు.

"పొద్దున నాలుగు కాళ్లతో నడుస్తుంది, మధ్యాహ్నం రెండుకాళ్ళతో నడుస్తుంది, రాత్రి మూడు కాళ్ళతో నడుస్తుంది- ఏమిటది?" అడిగాడు రాక్షసుడు. రాజుకు ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు . తెల్ల మొఖం వేశాడు. రాక్షసుడు నవ్వాడు- "పో, మరి దీనికి సరైన సమాధానం చెప్పమని ఊరంతా దండోరా వేయించు" అన్నాడు.

రాజ్యంలో ఎవ్వరికీ ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు. తప్పు సమాధానం చెప్పినవాళ్లను అందరినీ రాక్షసుడు భోంచేసేడు. రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు, యువకులు సగం మంది రాక్షసుడికి భోజనం అయిపోయారు. "ఎలాగబ్బా, వీడిని ఓడించేది ఎవరు?" అని రాజు ఆలోచనలో పడ్డాడు.

చివరికి ఒకబాబు ముందుకు వచ్చాడు- "నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అది తప్పైతే నువ్వు ఎలాగూ నన్ను తినేస్తావు. మరి ఒకవేళ అది సరైన జవాబు అయితేనో?" అన్నాడు.

"నీలాంటి బుడతల్ని చాలా మందిని చూశానురా, దీనికి సరైన సమాధానం నువ్వు ఊహించలేవు. అయినా ఒకవేళ నీ జవాబు సరైనదే అనుకో, అప్పుడు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోతాను- సరేనా?" అన్నాడు రాక్షసుడు గర్వంగా.

ఆ బాబు చెప్పాడు: "నీ ప్రశ్నకు సమాధానం- 'మనిషి' " అని. "మనిషి తన జీవితం ప్రారంభంలో నాలుగు కాళ్లమీద పారాడతాడు. నడిమి వయసులో రెండు కాళ్లమీద నడుస్తాడు. ఇక ముసలితనం వచ్చేసరికి కట్టె పట్టుకొని మూడుకాళ్లతో మళ్ళాడుతాడు- అంతేగా?" అన్నాడు. ఆ సమాధానం సరైనదేగదా, మరి రాక్షసుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకని వాడు కొండపైకి ఎక్కి ఒక పెద్ద రాయికి తన తలని గుద్దుకుని చచ్చిపోయాడు. రాజు, రాజ్యంలోని వాళ్లందరూ ఆ బాబుని మెచ్చుకున్నారు.

అవ్వ కథ ముగించి చూసేసరికి చంద్రుడు వచ్చేశాడు- బాబు, వాళ్ళ అమ్మ ఇద్దరూ చందమామని చూస్తూ ఆ చెరువు గట్టునే నిద్రపోయి ఉన్నారు!