డిసెంబరు నెల సంపాదకీయం బాగా నిరుత్సాహపరచింది. ముగింపు వాక్యాలకీ, కథాంశానికీ సంబంధ లోపం వున్నట్లు అనిపించింది. దేవుడే మనుష్యుల రాతను మార్చడం తనవల్ల కాదనేశాక, జరిగిన దాంట్లో పాపం రాము ప్రమేయం ఏమున్నట్లు? కొత్త సంవత్సరం సందర్భంగా సుఖ దు:ఖాల గురించి మాట్లాడడం పరిపాటే అయినా గానీ, పిల్లల పత్రిక కదా, ఉత్సాహ పరచే విషయం తీసుకుంటే బాగుండే దేమో! క్రిస్మస్, న్యూఇయర్- రెండూ పిల్లల్ని సంతోష పెట్టేవి కదా!

అట్ట మీద బొమ్మ ప్రతిసారీ, ఆ మాసపు విశిష్టతని సుసృష్టంగా గుర్తు చేస్తూ, ఓ స్ఫూర్తిని నింపేదిగా వుండడం అలవాటైపోయింది. అలానే వుండాలని లేదుగానీ, ఆ అలవాటులో ఈసారి పిల్లలకెంతో ఇష్టమైన క్రిస్మస్ తాతనో, జీసస్ స్ఫూర్తినో ఊహించి, ఎదురుచూసిన మాకు-కొంచెం 'అయ్యో!' అనిపించింది.

నీతిచంద్రిక కూడా ఈసారి పట్టు తగ్గింది. సంభాషణలు సాగదీసినట్లు, అక్కడక్కడా సందర్భానికి సంబంధం లేనట్లుగానూ వున్నాయనిపించింది. 'మాటల వల్ల విరిగిన మనసు మాత్రం ఇక చక్కబడదు', 'మాట తీరు బాగుండడం అవసరం' లాంటివి ఆయాసందర్భాలలో ఆయా పాత్రలకు ఎందుకు ఆపాదించారో అర్థం కాలేదు.

అతి సాధారణమైన అంశాలను కథా వస్తువులుగా ఎంచుకుని, కథ వ్రాయడానికి బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన పన్లేదని చెప్పి మెప్పించారు సుష్మ, శ్రీలత - పెద్దల మాట, కంచె కథల ద్వారా. కొడుకు లేని రాజులు యువరాణికి స్వయంవరం ప్రకటించి, యోగ్యుడైన అల్లుణ్ణి ఎంచుకోవడమే మనకి తెలుసు. భార్గవి యువరాణి చేతికే పగ్గాలప్పగించి మంచి ముగింపునిచ్చింది- 'స్త్రీ శక్తి' కథకి.

ధనుశ్రీ వ్రాసిన 'వారసుడు ' కథ మామూలుగానే వున్నా, భీముడు కష్టపడి పని చేస్తూ, నలుగురికి పని కల్పిస్తూ, ఆ తృప్తిలో తండ్రి వద్దకు వెళ్ళడాన్నీ, పదవినీ మర్చిపోవడం బాగుంది. మనం చేసే పని ద్వారా వచ్చే సంతృప్తి ముందు పదవి ఏ పాటీ చెయ్యదని చెప్పకనే చెప్పడం అంత చిన్నపిల్లకు సాధ్యమైందంటే ఆశ్చర్యం.

హైమావతి గారి చంటిగాడి కథ పరిసరాల విజ్ఞానం గురించిన మంచి పాఠంలా వుంది. అతి సరళమైన వస్తువుతో, చురుకుగా సాగిన కథనం ఆద్యంతం ఆపకుండా చదివించింది. తాను నమ్మిన విషయాన్ని ఎంతో ఇష్టంగా చెప్పినట్లుంది. 'రాక్షసుడే నయం' ప్లాట్ క్రొత్తగా వుంది. 'తెలివి-బలం'లో చాలా ప్రశ్నలొచ్చాయి. అంతమంచి స్నేహితులు - పిల్లల పెళ్ళి గురించి, ముందు ఇద్దరూ కలసి ఎందుకు మాట్లాడుకోలేదో, చలమయ్య మోసం తెలిసిన రామయ్య, స్నేహితుడి దగ్గరకే తిన్నగా వెళ్ళక గ్రామాధికారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో, అర్థం కాలేదు.

ఇక పంజరంలో పెరిగిన చిలుక బలహీనతని గ్రహించిన పులి దాన్ని వదిలేయడం, కృత్రిమ వాతావరణానికి అనుగుణంగా నేర్చుకున్న విషయాలేవీ నిజజీవితంలో పనికి రావని చెప్పడం బాగుంది. 'శబరి కథ' అగర్వాల్ గారు చెప్పినదే ఇంత వరకూ విన్నది. మరి అనలు రామాయణంలో ఎలా వుందో ? అనువాదం శబరి భక్తినీ, రాముడి ప్రీతినీ కళ్ళకు కట్టించింది.

మేథమేట్రిక్స్ చిన్ననాటి జ్ఞాపకాలను కదిలించింది. జైసీతారాం గారి చిట్టి పాటలు ముద్దుగా వున్నాయి. బొమ్మల విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తే బాగుండేదనిపించింది.

సరిక్రొత్త సంవత్సరానికి సంతోషంగా స్వాగతం చెబ్దాం. సంవత్సరమంతా అలరించిన కొత్తపల్లికి అభినందనలు. క్రొత్త సంవత్సరంలో - కొత్తపల్లి కావాలి మరిన్ని క్రొత్త కలాలకీ - కొంగ్రొత్త కథలకీ సరికొత్త వేదిక!