పక్షులు తమ తిట్లను కొనసాగించాయి- "ఓరీ! స్వామిద్రోహీ! తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టినట్లు , మా దేశంలో తిరుగుతూ మా రాజులోనే తప్పులు ఎంచుతున్నావే?! అందుకుగాను నిన్ను తక్షణం చంపేయచ్చు. పాపీ! నీపట్ల కొంచెం కూడా దయ చూపించనవసరంలేదు. తిని కూర్చొని, ఉబుసుపోక, నోటి తీట కొద్దీ ఇంతవరకు తెచ్చుకున్నావు. చేసుకున్న పాపాన్ని అనుభవించక తప్పదు.

ఇప్పుడు ఎట్లాగైనా నీ ప్రాణాలు తీయకుండా వదలం, ఒక్క నిముషం తొందరపడ కుండా నిలు- నువ్వెన్ని కష్టాలు ఎదుర్కొంటావో నీకే తెలుస్తుంది" అంటూ ఎగిరి, ఆ పక్షులన్నీ వల్లమాలిన కోపంతో ఒళ్లు మరచిపోయి, గోళ్లతో రక్కుతూ, ముక్కులతో పొడుస్తూ , రెక్కలతో చరుస్తూ నన్ను నొప్పించాయి.

అటుపైన అవన్నీ‌ అన్నాయి- "మీ రాజ హంస చాలా మెత్తనిది. అట్లాంటి వాడికి రాజ్యాధికారం, పూజనీయత ఎక్కడిది? ఎప్పుడూ క్షమిస్తూ పోయే రాజును చూసి, పనివాళ్లు బెదరటం మానేసి ఎగతాళి చేస్తారు. క్షమాగుణాన్నీ, కోపంతో కూడిన స్ధిరత్వాన్ని సందర్భానుసారంగా ప్రయోగించటం రాజధర్మం. అట్లాంటి రాజే ప్రజలకు ఇష్టమౌతాడు.

ఎప్పుడూ కోపగించుకోవటం కూడా మంచిది కాదు. అట్లా కోపగించుకొనే రాజును ప్రజలు అతి క్రూరునిగా భావిస్తారు. వాడి సాంగత్యాన్ని పాముతో చెలిమిలాగా విడిచి పెడతారు.

కాబట్టి రాజన్నవాడు అవసరాన్నిబట్టి క్షమాగుణాన్ని, కాఠిన్యాన్నీ, రెండింటినీ కన బరచాలి. శౌర్యం, శాంతం మొదలైన గుణాలన్నిటితోటీ, తేనెటీగలతో కూడుకున్న తేనెపట్టు మాదిరి; ఒక వైపు కదిలించేందుకు భయంగొల్పేట్టు, మరొకవైపున చేరేందుకు ఇష్టంగొల్పేట్లు ఉండాలి రాజు ఎప్పటికీ. మెత్తగా ఉండేవాడు చేతిలో ఉన్న డబ్బునే దక్కించుకోలేడే, ఇంక ప్రజల్ని పరిపాలించి, రాజ్యభారాన్ని ఎట్లా మోయగల్గుతాడు? నీళ్లలో పడి ఉండే మెత్తటి తెల్లపిట్టనా, 'రాజు ' అన్నపేరుకి అర్హుడు?! ఆ పేరు మోసేవాడు ఎంత గొప్పగా ఉండాలి!! అట్లాంటి బలహీనుడికి పాదసేవకుడివే, నువ్వు?! నువ్వెన్ని భాగ్యాలు అనుభవించావని,ఇప్పుడు గొప్ప మేలుకోరే వాడిలాగా మాకు ఈ పెడబుద్ధులు నేర్పించాలని వచ్చావు?

లోకంలో ఎవరైనా బలం ఉన్నవాడి దగ్గర చేరతారు గానీ, బలహీనుడిని దగ్గరికి కూడా రానివ్వరే! ఎప్పుడైనా ఆశ్రయించాల్సివస్తే పండ్లతో నిండి గొప్పగా నీడనిచ్చే మహా వృక్షాన్నే ఆశ్రయించాలి గానీ, ఎండిన మ్రోడును పట్టుకొని వ్రేళ్లాడుతారా? ఖర్మ కొద్దీ పండ్లు దొరక్కపోతే పోనియ్యి, దాని నీడనైతే ఎవ్వడూ పీక్కుపోలేడు గదా! సింహం అనుగ్రహం లభిస్తే మేక కూడా అడవిలో నిర్భయంగా ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది-తెలీదా? అట్లా శౌర్యవంతులను చేరిన చిన్న ప్రాణులకు కూడా గౌరవం అబ్బుతుంది. స్వయంగా ప్రీతిపాత్రులు కానివాళ్లు కూడా సర్వ జగత్తుకూ గౌరవనీయులై పోయి కూర్చుంటారు. ఇంక స్వయంగా గొప్పదనం ఉన్న వాళ్ల గురించి ఏమని చెప్పాలి?

నీచుడిని ఎప్పుడూ సేవించకూడదు. అట్లా చేరితే వారిపై ముందు ఉన్న పాటి గౌరవం కూడా పోతుంది. కల్లు త్రాగినవాడి చేతిలో ఉన్న పాలకుండని కూడా జనాలు 'కల్లుముంత' అనే అంటారు. నీచుల్ని సేవించటాన్ని మించిన కుక్క బ్రతుకు వేరే ఏదీ లేదు. నీచసేవలో పడ్డ శ్రమ యావత్తూ నిష్ఫలమే అవుతుంది.

అంతేకాదు, దాని వల్ల మనసులోని కోరిక ఏమాత్రం ఈడేరదు. హీనులైన వాళ్లను ఆశ్రయించుకొని ఉంటే కొన్ని ఆపదలు కూడా ఎదురవుతాయి. అట్లాంటివాళ్ల బ్రతుకులో దు:ఖమే తప్ప, సుఖం ఏనాటికీ రాదు. ఎప్పుడైనా తప్పి జారి, అనుకున్న కోరికలు ఏవైనా నెరవేరినప్పటికీ, అవి నిలువవు, తక్కువ నీళ్లున్న చెరువులో చేరిన చేపలాగా, నీచుడిని చేరినవాడు కూడా ఆ నీచుడితో పాటే నశిస్తాడు. అట్లా నశించే ముందు కూడా సుఖాలేవీ ఒనగూరవు. ఖడ్గమృగానికి ఎదురయినట్లు వానికి అడుగడుగునా గండాలే ఎదురవుతాయి.

అట్లాంటి నీచులతో క్షణకాలమైనా కలిసి ఉండరాదు; నిలిచి మాట్లాడరాదు; మంచివాళ్లతో సహవాసం వల్ల కోరికలన్నీ ఎట్లా ఈడేరుతాయో, అట్లాగే చెడ్డవాళ్ల సహచర్యం వల్ల సకల కష్టాలూ వచ్చి చుట్టుకుంటాయి. పాత్ర ఆకారాన్ని నెయ్యి ధరించినట్లు, ఆధారం కొద్దీ అధారపడేది ఉంటుంది. అద్దంలో పెద్ద ఏనుగు కూడా చిన్నదై కనబడ్డట్లు, తక్కువ వాళ్లను ఆశ్రయించుకొని ఉన్న సమర్ధుడు కూడా తక్కువ వాడిగానే కనబడతాడు.

అందువల్ల తక్కువ వాళ్లను సేవించటంలో ఆవగింజంత మేలు కూడా జరగదు. పొట్ట కూటి కోసం అలాగ తక్కువ వాళ్ల కాళ్లు పట్టుకొని కష్టజీవనం సాగించేకంటే మానం, మర్యాద ఉన్న వాడు నిశ్చల చిత్తంతో అడవిలో ఉండి ఆకులు అలములు తింటూ సుఖంగా కాలం గడపటం ఎంతో మేలు. లేదా, గొప్పవాడెవరికైనా పాదదాసులమని పేరు పెట్టుకొని, గౌరవానికి భంగం కలుగకుండా బ్రతకటం అంతకంటే ఉత్తమం.

అంతేకాదు, లోకంలో ఎవరైనా రాజుని ఆశ్రయించుకొని ఉండేది ఎందుకు? 'తమకు ఏనాడైనా కష్టకాలం వచ్చినప్పుడు అతను తమను ఏదో ఒక విధంగా కాపాడతాడు' అనే గదా!? అట్లాంటి రక్షణ ఆ రాజువల్ల లభించక పోతే, ఇక వాడివల్ల ప్రయోజనం ఏముంది?

అట్లాంటి రాజు లేకపోతే ఏదో ఒక రకంగా, చివరికి మోసం‌ చేస్తూ అయినా- హాయిగా బ్రతుకవచ్చు. ఇది వరకు కుందేళ్లు అలాగే కదా, కోరికలన్నిటినీ తీర్చుకొని సుఖంగా బ్రతికింది? ఆ కథ చెబుతాము, విను-

కుందేళ్లు-ఏనుగు ల కథ గతంలో ఒకసారి తీవ్రమైన కరువొకటి వచ్చింది. వానలు లేకపోవటం వల్ల అడవిలోని చెరువులు, గుంతలు అన్నీ పూర్తిగా ఎండిపోయాయి.
అప్పుడా అడవిలోని ఏనుగులు అన్ని బాధలనూ అనుభవించి, చివరికి ఒకనాడు తమ గుంపుకు రాజయిన పెద్ద ఏనుగు దగ్గరికి పోయి దీనంగా "స్వామీ! ఏమని చెప్పమంటారు? ఈ దాపులలో మేం ఎల్లప్పుడూ స్నానాలు చేసి నీళ్లు త్రాగే పెద్ద చెరువులో కూడా ఈ ఏడాది కరువు వల్ల కేవలం కొంచెం బురద మాత్రమే మిగిలి ఉన్నది. ఇక చిన్న చెరువుల సంగతి తలచేటట్లే లేదు. తమరి పాదాలను సేవించుకుంటూ ఎప్పటికీ అలాగే సుఖంగా ఉండిపోతాం అనుకున్నాం; కానీ మా దురదృష్టం కరువు రూపంలో పీడిస్తుంటే, దానికి బలయ్యేకాలం సంప్రాప్తించింది. ఇట్లాంటి చెడ్డకాలం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడు ఏమోతుందో ఎవరు కనుక్కోగలరు, కాలంతప్ప?

ఈ కాలం లాంటిది వేరేదేదీ లేదుగదా! మేమంతా తమరి మీద ఆధారపడి జీవిచేవాళ్లం. ఈ ఆపత్కాలంలో మా దప్పికను దూరం చేసి, మా కష్టాలను దాటించి, ఆవలి తీరం చేర్చేందుకు తమరి పాదాలే తప్ప మాకు వేరే దారి ఏదీ కనబడటం లేదు. మా కష్టాలను విన్నవించుకొని, తమరి దయను అర్థించటం కోసం వచ్చాము. త్వరగా దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనవలసింది ప్రభూ! వేరే దారి లేదు, మమ్మల్ని ఇక ముంచినా, తేల్చినా తమరిదే భారం" అన్నాయి.

అది విని ఆ ఏనుగుల నాయకుడి మనస్సు చాలా పరితపించింది. అది కొంతసేపు ఆలోచిస్తూ ఊరికే ఉండిపోయింది. తర్వాత అది వేగంగా నడిచే ఏనుగు నొకదాన్ని పిలిచి, "నువ్వు ఇప్పుడే , వేగంగా పోయి వెతుకు. ఇక్కడికి దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్లతో నిండిన సరస్సు వేరేదేదైనా ఉన్నదేమో చూడు. ఇక్కడే ఉన్నట్లు తిరిగి రావాలి. సోమరితనంతో సరిగ్గా వెతకకుండానే తిరిగి వచ్చేవు, జాగ్రత్త" అని పంపించిందది.

ఆ ఏనుగు కూడా వినయంతోటీ, ఇష్టంతోటీ, భయంతోటీ తమ నాయకుడి ఆజ్ఞను శిరసావహించి, ఆ క్షణాన్నే బయలుదేరి అమిత వేగంతో పోయి వెతకటం మొదలుపెట్టింది. అట్లా అడవి అంతా వెతుకుతున్న ఆ ఏనుగుకు ఒక పెద్ద మంచినీటి చెరువు కనబడగానే, దాని సంతోషానికి హద్దులు లేనట్లయింది.

పరుగు పరుగున వెనక్కి తిరిగి వచ్చి అది తమ నాయకుడికి ఆ సంగతి విన్నవించింది. "ప్రభూ! తమరి యీ సేవకుడి ప్రయత్నం సఫలమైంది. అడవి మధ్యలో తియ్యని మంచినీళ్లతో నిండిన సరస్సొకటి కనబడింది. ఇక తమ యీ దాసులు అందరి తోటీ విచ్చేయటమే తరువాయి. అక్కడ మన వారందరూ తృప్తిగా కడుపునిండా నీరు త్రాగ వచ్చును" అన్నది.

దానికి ఆ ఏనుగుల నాయకుడు కూడా చాలా సంతోషపడ్డది. వార్త తెచ్చిన ఆ ఏనుగును అభినందించి, అది తన సహచరులనందరినీ వెంటబెట్టుకొని గబగబా ఆ మడుగు దగ్గరికి పోయింది. నీటిని చూడగానే ఏనుగులన్నీ పొంగిపోయి, ఆ నీటిలోకి దూకి, కడుపు నిండుగా నీళ్లు త్రాగి, మెడ లోతు ఉన్న ఆ నీళ్లలో మునిగి, తేలి, ఓలలాడటం మొదలుపెట్టాయి.
(..తరువాతది మళ్ళీ..)