రామేశం అనే రచయిత తన వ్రాత బల్ల ముందు కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంకో వారం లోపు అతను నవల పూర్తి చెయ్యవలసి ఉంది. ఇన్నాళ్ళ నుంచి అవ్వనిది ఇంకో వారంలో ఎలా అవుతుందని ఆదుర్దాగా ఉంది. పబ్లిషరు వచ్చే సరికి కనీసం చిత్తు ప్రతి ఐనా సిద్ధం చేస్తే బావుంటుంది.. కానీ అతనికి ఆ ఆశ కూడా లేదు!

పట్నంలో తను అద్దెకున్న ఇంట్లో తనకి ప్రశాంతంగా ఉండట్లేదని ఊరికి దూరంగా ఇక్కడ ఈ ఇల్లు కొనుక్కున్నాడు రామేశం. ఇక్కడ మైలు దూరం నడిచినా మనిషి జాడ ఉండదు. ఊరికే వచ్చి తలుపు కొట్టి అల్లరి చేసే పిల్లలు కానీ, ఏ మందులో అవసరమైతే గబుక్కున తెచ్చి పెట్టమని అడిగే వయసు మళ్ళిన వారు కానీ, స్నేహం పెంచుకుని సినిమాలకో షికార్లకో కలిసి వెళ్దామనే కుర్రవాళ్ళు కానీ లేరు. అసలు చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. అసలు చీమలు కూడా ఉన్నాయో లేవో ఈ ఇంట్లో!

ఇక ఏ ఇబ్బందీ లేకుండా ఆపకుండా పేజీలకు పేజీలు వ్రాసెయ్యవచ్చు అనుకున్నాడు రామేశం. ఈ ఇంట్లోకి వచ్చిన క్రొత్తల్లో ఉత్సాహంగా వ్రాయడం మొదలు పెట్టాడు. కానీ కొన్నాళ్ళకు అతనికి విసుగు అనిపించసాగింది. ఏ సందడీ లేకుండా ఒక్కడే బిక్కు బిక్కుమంటూ రోజంతా గడపడంతో కథలు వ్రాయడానికి ఆలోచనలు సరిగ్గా వచ్చేవి కావు. సందడి కోసం ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుందామన్నా ఊరికి దూరంగా రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు.

కొన్ని రోజులుగా వ్రాయడానికి కూర్చున్నప్పుడల్లా ఏవో వింత వింత ఆలోచనలు వచ్చేవి. ఏవో చప్పుళ్ళు వినిపించేవి. తీరా చూస్తే ఏమీ ఉండేవి కావు. విసుగొచ్చి ఆ వచ్చిన చప్పుళ్ళన్నీ ఒక పుస్తకంలో వ్రాసుకోసాగాడు. వాటి గురించి ఏవేవో ఊహించి వ్రాసేవాడు. అది అతనికి ఒక వ్యసనం లాగా అలవాటయ్యింది. ఊహించి ఊహించి కథలు అల్లి పుస్తకాన్ని నింపేశాడు కానీ తను మాటిచ్చిన నవల మాత్రం పట్టుమని పది పేజీలు కూడా పూర్తి చెయ్యలేకపోయాడు.

ఆ రోజు ఇంక ఇలా కాదని తను వ్రాయవలసిన నవలకి సంబంధించిన పేపర్లు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఆ కథ గురించి తప్పితే ఇంకేమీ ఆలోచించకూడదనీ, వ్రాయకూడదనీ నిర్ణయించుకున్నాడు. తనకు వినిపిస్తున్న శబ్దాల గురించి ఊహించి వ్రాసుకున్న కథల పుస్తకాన్ని చెత్త బుట్టలోకి గిరవాటు వేశాడు. బల్ల ముందు కూర్చున్నపది నిమిషాలకే మళ్ళీ ఏదో చప్పుడయ్యింది. రామేశం విసురుగా లేచి నిలబడ్డాడు. "ఇది చివరి సారి. ఈ ఒక్క సారికి ఇల్లంతా పై నుంచీ కింది దాకా చూసి వస్తాను. లోపలా బయటా చూస్తాను. వచ్చి కూర్చుని ఇక సాయంత్రం వరకూ లేవకుండా కూర్చుని ఈ నవల ఎంతవరకూ ఐతే అంతవరకూ వ్రాస్తాను," అని నిర్ణయించుకుని గదినుంచి బయటకి వెళ్ళాడు. అతను వ్రాయడానికి ఏర్పరుచుకున్న గది మిగిలిన ఇంటికన్నా కాస్త క్రిందకు ఉన్నది. తలుపు తీసుకుని ముందు గదిలోకి వచ్చిన తరువాత కుడి చేతి వైపు తిరిగి మెట్లు దిగి లోపలికి వెళ్తే విశాలమైన గది. చుట్టూ పెద్ద కిటికీలు. మెట్లకి వీపు చేసి కూర్చునేలా కుర్చీ. దాని ముందు కిటికీని చూస్తూ బల్ల.

ముందుగా మెట్లెక్కి పైకి వెళ్ళి బయటి తలుపు తీసి చూశాడు. ఎవరూ తలుపు కొట్టలేదు. బెల్లు నొక్కలేదు. బయటకు వెళ్ళి చూశాడు. చుట్టు ప్రక్కల మనుషులే కాదు కుక్కలు, మేకల వంటి జంతువులు కానీ ఆఖరికి పురుగులాంటి ఏ ప్రాణి కానీ కనిపించలేదు. ఇంటి చుట్టూ ఓ సారి తిరిగి లోపలికి వచ్చాడు. ఇల్లంతా తిరిగి చూశాడు. అనుమానం కలిగించేలా ఏదీ కనిపించలేదు. లాభం లేదని బాత్రూములోకి వెళ్ళి చెవుల్లో పెట్టుకునే దూది తీసుకున్నాడు.

దూదిని చెవుల్లో పెట్టుకుని తన వ్రాత బల్ల దగ్గరికెళ్ళడానికి మెట్లు దిగబోయిన వాడల్లా ఆగిపోయాడు. అక్కడ అతని బల్ల దగ్గర ఎవరో ఉన్నారు! ఉన్నట్లుండి అతని కళ్ళ ముందు అంతా శూన్యమైపోయింది.

కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా తన పబ్లిషరు. కంగారుగా చుట్టూ చూసుకున్నాడు. అతను హాస్పిటల్లో ఉన్నాడు. వళ్ళంతా తడుముకుని చూసుకున్నాడు. వంటికి గాయాలు కానీ కట్లు కానీ ఏమీ లేవు. అయినా కంగారు తగ్గ లేదు. అప్పుడే నర్సు వచ్చి బ్లడ్ ప్రెషర్ చూసింది. ఇంకా ఏవేవో లెక్కలు తీసుకుంది. "మీకేమి కంగారు లేదు. ఏదో అనుకోని సంఘటన జరిగి తాత్కాలికంగా జ్ఞాపక శక్తి కోల్పోయారు. మిమ్మల్ని ఈయనే హాస్పిటల్కి తీసుకు వచ్చారు. వారం రోజులుగా మిమ్మల్ని రోజూ వచ్చి పరామర్శిస్తున్నారు. ఈయనను మీరు గుర్తు పట్టగలరా?" అని అడిగింది నర్సు.

"ఈయన...ఈయన పబ్లిషరు. ఈయనకి నేను పుస్తకం పూర్తి చేసి ఇవ్వాలి. అవునూ, ఈ రోజు తారీఖు ఏంటి?" అని అడిగాడు నర్సును.

"ఏప్రిల్ ఒకటి" అని చెప్పింది నర్సు.

"క్షమించండి. పుస్తకం పూర్తి కాలేదు. ఈ లోగా ఇది ఒకటి, నేను ఇలా హాస్పిటల్లో తేలాను. ఇంకొక నెల గడువు ఇవ్వండి. నేనా ఇల్లు వదిలేసి నగరం మధ్యలో ఒక గది అద్దెకైనా తీసుకుని అక్కడ ఉండి వ్రాస్తాను. ఈ ఖాళీ ప్రదేశంలో ఉంటూ నా బుర్రలో ఆలోచనలు కూడా ఖాళీ అయిపోయినట్లున్నాయి" అని అడిగాడు రామేశం. పబ్లిషరు వింతగా నవ్వి పక్కనే బల్ల మీద ఉన్న ఒక పుస్తకాన్ని తీసి చూపించాడు. ఆ పుస్తకం మీద రచయిత పేరు తనదే! పుస్తకం కవరు మీద బొమ్మ చూడగానే మళ్ళీ స్పృహ తప్పినంత పని అయ్యింది రామేశానికి. నర్సూ, పబ్లిషరూ కలిసి సాయం చేసి పైకి కూర్చోబెట్టారు అతనిని.

"ఇది మీరు వ్రాసిన కథే. మీ చిత్తు కాయితాల బుట్టలోంచి తీసుకున్న కథ," నవ్వుతూ చెప్పాడు పబ్లిషరు.

రామేశానికి ఆపుకోలేనంత నవ్వు వచ్చింది ఈ సారి. కాసేపయ్యాక తమాయించుకుని, "మీకు చాలా ధన్యవాదాలు." అని చెప్పాడు. పబ్లిషరు మాత్రం, "మేమే చెప్పాలి ధన్యవాదాలు. సరి క్రొత్త ఆలోచన. మీరు ఇంతవరకూ ఇటువంటి కథలు వ్రాయలేదు. ఈ పుస్తకాన్నిమీరు చెత్తబుట్టలో ఎందుకు పడేశారో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చి మీ కోసం ఎదురు చూసే సమయంలో చొరవ తీసుకుని మీ వ్రాత బల్ల దగ్గరకు వెళ్ళి ఉండకపోతే అక్కడ పేరుకున్న చిత్తు కాగితాలను చూసే వాడిని కాదు. ఈ కథ నాకు దొరికేది కాదు. అన్నట్టు ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇంటి తలుపు తెరిచే ఉన్నది. అందుకే చొరవగా మీరు లేకున్నా మీ గదిలోకి వెళ్ళి చూశాను. అది సరే కానీ, ఇక మీరు త్వరగా కోలుకోవాలి. రెండు వారాల్లో ఈ పుస్తకం విడుదల పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ సభకు మీరు రావాలి !" అని చెప్పి వెళ్ళిపోయాడు.

రామేశం త్వరలోనే కోలుకుని పుస్తక ఆవిష్కరణకు వెళ్ళాడు. తిరిగి వచ్చి తను నగరంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో బాల్కనీలో కూర్చుని ఆ పుస్తకం తీసి చూసుకున్నాడు. దాని మీద బొమ్మ చూసి అతనికి నవ్వాగలేదు మళ్ళీ. గట్టిగా నవ్వుతుంటే చుట్టు ప్రక్కల ఇళ్ళ వాళ్ళు కిటికీల్లోంచి చూడ సాగారు. అతను సర్దుకుని మళ్ళీ ఆ బొమ్మ చూశాడు. అది తను మెట్ల మీద స్పృహ తప్పిపోయినప్పటి దృశ్యంలానే ఉంది. ఆ రోజు తను వ్రాత బల్ల దగ్గర చూసుకుని దడపడినది తన పబ్లిషరుని చూసేనన్నమాట! మరోసారి చిన్నగా మనసులోనే నవ్వుకున్నాడు. ఇప్పుడు తన ఇల్లు ఆ పుస్తకం మూలాన ఒక పర్యాటక కేద్రంగా తయారయ్యింది. ఆ కథ ఆ ఇంట్లో నిజంగానే జరిగినద్ని నమ్మేసేంతగా అక్కడ నాటకీయంగా దృశ్యాలు అమర్చారు. పుస్తకం బాగా పేరు పొందాక, చుట్టూ ఎన్నో దుకాణాలూ ఇతర ఆకర్షణలూ వెలిశాయి. ఇప్పుడక్కడ ఎంతోమంది జనాలు- పగలూ రాత్రీ కూడా.

ఆ పుస్తకం మీద తనకు వచ్చిన ఆదాయంతో రామేశం ఇంకో కొత్త ఇల్లు కొనుక్కోబోతున్నాడు. ఆ ఇంటి చుట్టూనే కాదు, ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ సందడిగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అతని ఆలోచన. "ముందు గదిలో ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటాను. చుట్టు ప్రక్కల పిల్లలు ఎప్పుడైనా అక్కడికి వచ్చి తమకి నచ్చిన పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు. ఒక కుక్క పిల్లను పెంచుకోవడానికి తీసుకుంటాను..." ఇలా సాగుతున్నయి అతని ఆలోచనలు. ఆగకుండా సాగుతున్నాయి అతని కలం నుంచి కథలు!

ఈ హడావిడిలో అతని కలవరపాటుకూ, కథలకూ కారణమైన శబ్దం మరుగున పడిపోయింది. కొన్నాళ్ళకు ఆ శబ్దం ఆగిపోయింది. అది బ్యాటరీతో నడిచే బొమ్మ గడియారం. ఎలా వచ్చిందో రామేశం వ్రాత బల్ల ఉన్న గది కిటికీ ఒక దాని చూరు మీద చేరింది. ఆ ఏకాకి రచయిత ఒంటరి తనాన్ని దూరం చెయ్యడానికా అన్నట్టు ఏ కాకో, ఎక్కడ్నుంచో తెచ్చి అక్కడ పడేసింది దాన్ని!