మా బడిలో పిల్లలకు తెలుగు అంటే‌ చాలా ఇష్టం. రకరకాల పిట్టకథలు, పొడుపు కథలు, సామెతలు చెబుతూ, రాస్తూ ఉంటారు.

ఒక రోజు మా బడిలో సునీల్ ఒక వాక్యం చెప్పి, దానిమీద ఒక కథ అల్లమన్నాడు. ఆ వాక్యం - “పుటుక్కు జరజర డుబుక్కు మేమే". మేమంతా చాలా ఆలోచించాం; కానీ కథ కుదరడం లేదు. అందరమూ ఆలోచిస్తూనే ఉన్నాము. ఇలా మూడు రోజులు గడిచింది. చివరికి మా అమ్మను అడిగితే, చిన్న లంకె అందించింది. దానితో నేను కథను ఇలా అల్లాను:

మా ఇల్లు బోదగడ్డి కొట్టం. కొట్టం మీద నిండుగా గుమ్మడి తీగ అల్లుకుంది. దానికి ఒక లావుపాటి గుమ్మడికాయ కాసింది. కొట్టం చూరు కిందేమో, ఒక మేక కట్టేసి ఉంది.

అంతలో మా పిల్లి కొట్టంమీదికి ఎక్కి, పైనున్న గుమ్మడి తీగను పుటుక్కున కొరికేసింది. అది కొట్టం మీద నుండి జర జరా జారి, కింద ఉన్న మేక మీద డుబుక్కున పడింది. అప్పుడు మేక మేమే అని అరిచింది.

ఇలా కథను అల్లి సునీల్ కి చెప్పాను. సునీల్ కి తెలిసిందీ ఈ కథేనట! మా అమ్మ ఎంత తెలివైనదో చూడండి!!