తాంగ్ వంశస్థుడైన ముచంగ్ చక్రవర్తి చైనాను పరిపాలిస్తున్న కాలంలో చైనాలో బుద్ధుని అనుయాయులు అనేక మంది ఉండేవాళ్లు. వాళ్లంతా రకరకాల ఆరామాల్లో నివసిస్తూ, మతపరమైన సాధనలు చేసుకుంటూ ఉండేవాళ్లు. ప్రభుత్వం కూడా వాళ్లను చాలా గౌరవంగా చూసేది; ఆరామాలకు, వాటిలో నివసించే భిక్షువుల అవసరాలకు ప్రభుత్వం బాగా ధనసహాయం చేసేది.

ఆ సమయంలో ఒక మారుమూల గ్రామంలో శిష్యులకు ధర్మసూక్ష్మాలు బోధిస్తూ ప్రశాంత జీవితం గడిపేవాడు, 'వు-యే' అనే ఒక గురువుగారు. ధర్మంలో ఆయన చాలా ఎదిగిన వ్యక్తి. ధర్మం పట్ల ఉన్న ఆపేక్ష ఆయనకి డబ్బుమీదా, గౌరవాల మీదా, పదవుల మీదా ఉండేది కాదు. రాజులకు, చక్రవర్తులకు కాక సామాన్యులకు ధర్మం బోధించటం ఆయన తన పనిగా పెట్టుకొని చేస్తూ వచ్చాడు.

వు-యే గారి ఖ్యాతి చక్రవర్తి వరకూ ప్రాకింది. ఆయనను రాజధానికి రమ్మని, తనను కలవమని చాలా గౌరవంగా ఆహ్వానించారు చక్రవర్తులవారు. మామూలుగా ఇలాంటి ఆహ్వానాలు ఎక్కువ మందికి అందవు. చాలా ముఖ్యమైన వాళ్లకి తప్ప, సామాన్యులకైతే చక్రవర్తిగారి దర్శనం కూడా దొరకదు. కానీ వు-యేకు ప్రాపంచికమైన ఆకాంక్షలేమీ లేవు. చక్రవర్తి రమ్మన్న ప్రతిసారీ ఆయన ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టాడు.

ఇలా చాలా సార్లు జరిగేసరికి, చక్రవర్తికి కోపం వచ్చేసింది. "మీదే బాధ్యత! మీరు యీసారి గనక వు-యే గురువుగారిని ఊరు వదిలి వచ్చేందుకు ఒప్పించలేకపోతే , మీకందరికీ మరణశిక్ష తప్పదు" అని చెప్పి పంపిం కొందరు సైనికులను. వాళ్లు వచ్చి గురువుగారికి మొరపెట్టుకున్నారు-

"కనీసం మా ప్రాణాలు నిలిపేందుకైనా మీరు రాజధానికి రావాలి" అని కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.

ఇక కాదనలేకపోయారు, వు-యే గారు."సరే, నేను పోతాను!" అన్నారు.

శిష్యులందర్నీ పిలిచారు. అందరినీ కూర్చోబెట్టి అడిగారు- "నేను పోతున్నాను. చక్రవర్తిని కలిసేందుకు వెళ్లటం మీలో ఎవరెవరికి ఇష్టమో చెప్పండి!" అన్నారు.

ఒక శిష్యుడు చేయెత్తగానే గురువుగారు అడిగారు అతనిని -"నువ్వు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్ల దూరం పోగలవు?" అని.

"యాభై" అన్నాడతను.

"సరిపోదు, కూర్చో!" అన్నారు గురువుగారు.

రెండోవాడు చెయ్యెత్తాడు. అతన్నీ అదే ప్రశ్న అడిగారు.

'అరవై ఐదు!'అన్నాడతను, గట్టిగా.

"చాలదు, కూర్చో!" ఈసారి "డెబ్భై"అన్నాడు ఒకతను.

"ఊహుc సరిపోదు!" అన్నారు గురువుగారు- "అందరూ చెప్పండి- ఎవరు ఎంత వేగంగా రాగలరో చెప్పండి"

చివరికి ఒక శిష్యుడు అన్నాడు-"మీరు ఎటు వెళ్తే అటు, మీ అంత వేగంగా వస్తాను నేను, మీ వెనకే!" అని .

"సరే, అయితే!" అన్నాడు వు-యే తృప్తిపడుతున్నట్లు.

కూర్చున్నవాడు కూర్చున్నట్లే ధ్యానంలోకి వెళ్లాడు- అట్లా ధ్యానంలో ఉండగానే, ఒక్క క్షణంలో కూర్చున్నవాడు కూర్చున్నట్లు చనిపోయాడు!

పేరు తెలీని ఆ శిష్యుడు గబుక్కున నిలబడ్డాడు- "ఓహ్! మీరు వెళ్లారా?! నేనూ వస్తున్నాను, మీ వెంట!" అన్నాడు- నిలబడ్డవాడు నిలబడ్డట్లే చనిపోయాడు అతను!!

సైనికులు వెళ్లి చక్రవర్తి గారికి యీ సంగతి విన్నవించుకున్నారు.

వాళ్ల ప్రాణాలకు ఏమీ కాలేదు; చక్రవర్తికి మాత్రం తక్షణం ధర్మదీక్ష లభించింది.