మూడేళ్ళ క్రితం నేను చాలా అల్లరి పిల్లవాడిని. అప్పుడోసారి మా ఇంట్లోవాళ్లందరం తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి గుడికి. నడిచి కొండ ఎక్కాలని మొక్కుకున్నది మా అవ్వ. అందుకని అందరం మెట్లు ఎక్కటం మొదలు పెట్టాం.

నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా, అక్కడినుండి కనబడే కొండలు, లోయలు అన్నీ నాకు చాలా‌ నచ్చాయి. సగం మెట్లు ఎక్కే సరికి ఆ ప్రకృతిని ఇంకా దగ్గరగా ఆస్వాదించాలని కోరిక పుట్టింది నాకు. ఎవ్వరికీ చెప్పకుండా మెట్లు దాటుకొని అడవిలోకి వెళ్లిపోయాను.

కొంత దూరం నడిచాక నా వెనక ఏదో అలికిడి అయ్యింది. వెనక్కి తిరిగి చూస్తే, అది ఒక ఎలుగుబంటి! భయంతో నా నోట్లోంచి అరుపు కూడా బయటికి రాలేదు. ఎట్లా పరుగెత్తానో నాకే తెలీదు. ఆయాసం వచ్చి ఆగి చూసుకునేసరికి నేను దారి తప్పి ఉన్నాను! ఎటు వెళ్తే ఏమి వస్తుందో తెలీదు. నేను వచ్చిన దారిని గుర్తుపట్టే వీలే లేదు!

అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలైంది. దట్టమైన ఆ అడవిలో మధ్యాహ్నం కూడా రాత్రి పూటలాగా అనిపిస్తోంది. అంత పెద్ద అడవిలో ఉన్నది నేను ఒక్కడినే.. భయంతో నాకు వణుకు పుట్టింది. అదృష్టవశాత్తు నా జేబులో ఒక చిన్న టార్చిలైటు ఉన్నది. దాన్ని వేసి అటూ ఇటూ చూశాను. దగ్గరలోనే నేలమీద ఒక అగ్గిపెట్టె పడేసి ఉన్నది. ఎవరో యాత్రీకులు ఇటువైపు వచ్చి, ఇక్కడ పడేసుకొని ఉండాలి..ఎందుకైనా మంచిదని నేను దాన్ని తీసి జేబులో వేసుకున్నాను. దూరంగా ఎక్కడో ఒక రోడ్డులాంటిది ఉన్నట్లు అనిపించింది. ఇక్కడ చీకట్లో నిలబడి ఉండేకంటే అక్కడికి వెళ్తే ఎవరో ఒకరిని సాయం అడగచ్చు అనిపించింది. అటు వైపుకు నడవటం మొదలు పెట్టాను.

అకస్మాత్తుగా కనిపించింది నాకు- నన్ను తరుముకుంటూ వచ్చిన ఎలుగుబంటి- నాకు కొంచెం ముందుగా కూర్చొని ఉన్నది! నేను వెంటనే వెనక్కి తగ్గి, ఒక పొదలో దాక్కున్నాను. 'ఎప్పుడు ఆ ఎలుగుబంటి వచ్చి మీద పడుతుందా' అని నా గుండెలు పీచుమంటున్నాయి. అంతలో నాకొక ఉపాయం తట్టింది. కొద్దిరోజుల క్రితమే టివిలో చూశాను- ఎలుగు బంటిని భయపెట్టేందుకని హీరో మంట వెలిగిస్తాడు- అగ్గిపెట్టె నా జేబులోనే ఉన్నది గద, ఇంక నాకేమి భయం?!

శబ్దం కాకుండా అక్కడి చితుకులన్నిటినీ ఒక దగ్గర పేర్చి అంటించాను. మెల్లగా మంట రాజుకున్నది. అయినా ఎలుగుబంటి అటువైపు చూడలేదు. నేను పులిలాగా అరుస్తూ మండుతున్న కట్టెనొకదాన్ని ఎలుగుబంటి మీదికి విసిరాను. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిందది- మరుక్షణం ఎటో పరుగెత్తింది; ఇంక కనిపించకుండా.

ఆ సరికి సాయంత్రం కావస్తున్నది. దగ్గరలోనే ఎత్తుగా కనిపిస్తున్నది రోడ్డు- నేను ఆ రోడ్డుకంటే కనీసం 200మీటర్ల లోతులో ఉండి ఉంటాను. క్రిందినుండి ఎంత అరిచినా రోడ్డు మీద పోయే వాహనాలకు నేను కనిపించే అవకాశం లేదు. మా ఇంటివాళ్ళు నాకోసం వెతుక్కుంటున్నారేమో..ఈపాటికి వాళ్ళు పోలీసులకు చెప్పిఉంటారు.. ఎలాగో ఒకలాగా పోలీసులను చేరితే బాగుండు.. ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.

అంతలో గుర్తుకొచ్చింది నా టార్చిలైటు. సాయంత్రపు మసక చీకటిలో దాని వెలుగు దారినపోయేవాళ్లను ఎవరినైనా ఆకర్షించకపోదు! నేను దాన్ని వెలిగించి అటూ ఇటూ ఊపాను..అరుస్తూ. లాభం లేదు..ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి..

చీకట్లు కమ్ముకుంటున్నాయి. అడవిలో చలి మొదలైంది. నాకు ఏడుపొస్తోంది..ఈ చలిలో ఏ పులో వచ్చి మీదికి దూకితే ఎలాగ?

అంతలో నాకు ఒక ఐడియా వచ్చింది. శబ్ద తరంగాలను ఎక్కువ దూరం పంపించాలంటే వాటి దిశను మనం నిర్దేశించాలి. కొమ్ము బూరలో జరిగేది అదేగద! నేను వెంటనే టేకు చెట్టు ఆకునొకదాన్ని తీసుకున్నాను. దాన్ని పొట్లంలాగా చుట్టి, దానిలోనుండి అరుస్తూ టార్చిలైటును అటూ ఇటూ ఊపటం మొదలుపెట్టాను. చివరికి నా శ్రమ ఫలించింది! అటుగా వచ్చిన పోలీసులు నన్ను గుర్తించారు!!

కొందరు పోలీసులు లోయలోకి దిగి, నన్ను మా అమ్మానాన్నల దగ్గరికి చేర్చారు. మా ఇంట్లోవాళ్ళంతా పోలీసుల్ని అభినందించారు- అందరూ తిడతారనుకున్నానుగానీ, ఎవ్వరూ ఏమీ అనలేదు నన్ను. అయితే ఆ రోజునే నేను నిశ్చయించుకున్నాను- 'పెద్దవాళ్లెవ్వరికీ చెప్పకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్ళను' అని! మీరూ వెళ్ళకండేం, మరి!