అదొక కీకారణ్యం. దట్టంగా చెట్లు, చేమలు, పొదలు. తినేందుకు మాత్రం ఏమీ లేవు.

ఆ అడవిలో నడిచివెళ్తున్నారు గురువుగారు. ఆయన వెంట శిష్యులు మౌనంగా నడుస్తున్నారు.

కొంతసేపటికి వాళ్లంతా అడవిని దాటారు. అయితేనేమి, ఇసుక ఎడారిలో కాలుపెట్టారు! సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. భరించలేని వేడి. తల దాచుకోవడానికి ఎక్కడా చోటులేదు. కనుచూపు మేరలో చెట్టు అన్నది లేదు, ఆవగింజంత నీడకూడా లేదు.

'ఎక్కడైనా జనసంచారం కనిపిస్తుందేమో, కనీసం ఒక గుడిసె అయినా కనిపిస్తుందేమో'-అని శిష్యుల కళ్ళు ఆశగా వెతుకుతున్నాయి. గుక్కెడు మంచినీళ్ళు దొరికే మార్గం కూడా కనిపించడం లేదు.

ఎట్లాగో సూర్యాస్తమయందాకా నడిచారు అందరూ. సూర్యుడు అస్తమించాడు. చీకటి అలుముకుంటోంది. అప్పుడు గానీ శిష్యుల నీరసం చూడలేదు గురువుగారు- "విశ్రాంతి తీసుకుందామా?" అన్నారు.

ఆ మాట వినీ వినటంతోనే శిష్యులు అందరూ ఆకలీ దప్పికా మరచిపోయారు. ఎక్కడివాళ్ళు అక్కడ ఆగిపోయారు; నడుంవాల్చారు; మైమరచి నిద్రపోయారు.

అయితే గురువు గారు మాత్రం ఎప్పటిలాగే పడుకునే ముందు ధ్యానం చేశారు: "దేవుడా! ఈ రోజు మీరు అనుగ్రహించిన దానికంతా కృతజ్ఞతలు!" అని చెప్పారు చాలాసార్లు.

కాస్త మేలుకొని ఉన్న శిష్యుడు ఒకడు గురువుగారి ప్రార్థన విన్నాడు. కోపం పొంగుకొచ్చింది అతనికి. చటుక్కున లేచాడు: "స్వామీ! దేవుడు ఇవాళ్ళ మనకు ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు కదా! ఇక ఆయనకు కృతజ్ఞతలెందుకు చెప్పాలి, మనం?" అన్నాడు ఆవేశంగా.

గురువుగారు చిరునవ్వునవ్వారు. "ఏమీ ఇవ్వకపోవడమేమిటి? ఆకలంటే ఏమిటో అనుభవపూర్వకంగా చెప్పాడు కదా, ఆయన?! దాహమంటే ఏమిటో చెప్పాడు! అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను!" అన్నాడు.

సుఖం, దు:ఖం నాణానికి రెండు పక్కలు. వీటిలో ఒక దాన్ని మాత్రమే స్వీకరించి రెండోదాన్ని తిరస్కరించటంలో నిజానికి అర్థం లేదు. రెండింటినీ సమానంగా స్వీకరించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు.