ఆ రోజు నిండు పున్నమి. వెన్నెల రాత్రి. ఎప్పటి లాగే తాతయ్య చుట్టూ చేరి, చెట్టు కింద అరుగుపై కూచున్నారు పిల్లలందరూ!

'తాతయ్యా! ఈరోజు రాజకుమారి కథ చెబుతానన్నావు గదా! మరి చెప్పు తాతయ్యా!' వాసు అడిగాడు. సుశీ, శశీ, రేఖ, కళా అందరూ వంత పాడారు. పిల్లల ఉత్సాహాన్ని చూసి, తాతయ్య మెల్లగా గొంతు సవరించుకున్నాడు. ఆప్యాయంగా పిల్లలవంక చూసి, ఇలా చెప్పసాగాడు:

సిరిపురం రాజు గారికి నలుగురు మగ సంతానం ఉన్నారు. అయితే 'ఆడపిల్ల లేదే' అని దిగులు పడేవారు రాణి గారు. కొన్నాళ్ళకు ఆస్థాన జ్యోతిష్కులు చెప్పినట్లు రాణిగారు ఆడపిల్లను ప్రసవించింది. పాప బొటన వ్రేలిమీద శనగగింజంత పుట్టు మచ్చ ఉంది. ఆ పాపకు 'సుగుణ' అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు; ఆనందిస్తున్నారు. నలుగురు అన్నలకూ ఆ పాప ముద్దుల చెల్లి.

మెల్లగా సుగుణకు ఆరేళ్ళ వయసు వచ్చింది. తోటి పిల్లలతో ఆడుకుంటూ హాయిగా గడిపేది. ఒక సారి, హోళీ పండుగ వచ్చింది. పిల్లలంతా నగరానికి వెలుపలనున్న ఉద్యానవనానికి వెళ్తున్నారు- ఉయ్యాలలూగేందుకు. తానూ వెళతానని మారాం చేసింది సుగుణ. రాణి ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. పట్టుబట్టి, అమ్మా నాన్నలను ఒప్పించి, తానుకూడా పిల్లలవెంట వెళ్ళింది. ఆటపాటలతో, కేరింతలతో ఎంత సమయం గడిచిందో గమనించ లేదు. సూర్యుడు పడమటి కొండల్లోకి దిగి పోయాడు. క్రమంగా చీకటి పడుతోంది. పిల్లలందరూ తలోదారిన పోలోమని పరుగెత్తుతున్నారు.

సుగుణ ఎప్పుడూ బయటకు వచ్చింది కాదు గదా, ఆ సందడిలో తనకు తోచిన దారిన వెళ్ళింది. కాసేపట్లో దట్టమైన చెట్లు, పొదలు ఉన్న అడవి ప్రాంతం చేరుకున్నదామె. ఇంక ఆపైన ఎటు వెళ్ళాలో తెలీలేదు ఆ పాపకు. బిత్తరపోయి నిలబడింది. సమయం గడచిపోతోంది. ఇల్లు చేరే దారి తోచటం లేదు. అంతలో చీకటి పడ్డది. గాలికి చెట్లు ఊగుతుంటే నేలమీద వింతవింత నీడలు కదులుతున్నాయి. చిన్నారి సుగుణకు భయం వేసింది. ఒక చెట్టు క్రింద కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. భయంగాను, ఆకలిగాను ఉంది. బేలగా ఏడుస్తూ ఉంది.

అంతలో ఒక సాధువు అటుగా వచ్చాడు. బవిరి గెడ్డంతో, జడలు కట్టిన జుట్టుతో, మాసిపోయిన కాషాయ వస్త్రాలతో వింతగా ఉన్నాడు అతను. ఏడుస్తూ కూచున్న సుగుణను చూశాడు. అమ్మాయి ఒంటిమీది బంగారు నగలను గమనించాడు. నగలతో బాటు, అమ్మాయిని కూడా తీసుకొని పోతే తనకు ముందు ముందు లాభం ఉంటుందని లెక్కలు వేసుకున్నాడు.

పాప దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు. 'ఇంటికి చేరుస్తానులేమ్మా' అని చెబుతూ, తానుంటున్న ప్రాంతానికి తీసుకొనిపోయాడు. తెల్లారిన తరువాత నగరానికి వెళదామని చెప్పి, ఏడుపు మానిపించాడు. తన దగ్గర ఉన్న ఒక పండును ఇచ్చి తినమన్నాడు. తరువాత నిద్రపుచ్చాడు.

"అయితే తాతయ్యా! పాప వాళ్ళ అమ్మానాన్నలు కంగారు పడలేదా, పాప రాలేదని?" పిల్లలందరూ ఒకేసారి అడిగారు.

"ఎందుకు బాధపడరూ?! రాజకుమారాయె! అందునా లేక లేక కలిగిన అమ్మాయాయె! సుగుణ తల్లిదండ్రులు భటులతో నగరంలోను, చుట్టుపక్కల అంతటా వెతికించారు. కాని ఎవ్వరూ ఆ పాప జాడమాత్రం కనుక్కోలేకపోయారు. ఆ వార్త విని రాజుగారు,రాణిగారు దు:ఖ సముద్రంలో మునిగిపోయారు"

ఇక్కడ అడవిలో సాధువు ఆ పాపకు మాయమాటలు చెప్పి, భయపెట్టి, బెదిరించి, తనతోపాటే ఉంచేసుకున్నాడు. ఒకచోట అంటూ‌ నిలవకుండా తనతోబాటు ఆ పాపను కూడా వేర్వేరు ప్రాంతాలకు తిప్పుకుంటూ, భిక్షాటన చేయించటం మొదలు పెట్టాడు. తన జీవితానికి మంచి ఆసరా దొరికిందని ఆనందపడసాగాడు!

ఊళ్ళలో జనాలంతా పాప అందానికి ఆకర్షితులయ్యేవాళ్ళు. ఆ పాప ముద్దు మోము చూసి, తమ పిల్లలు వాడి వదిలేసిన పాత గుడ్డలు ఇచ్చేవారు. వాళ్ళు తనకు ఏమిచ్చినా సుగుణ సాధువు దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేది. సాధువంటే విపరీతంగా భయపడేదామె- ఊళ్ళోవాళ్ళు ఇచ్చిన తినుబండారాలనుకూడా తను తినేది కాదు. సాధువు పెడితే తినేది, లేక పోతే ఆకలితో మాడిపోతూ‌ అట్లానే ఉండేది.

అట్లా నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఈ నాలుగేళ్లలోనూ సుగుణ తన గురించి తాను పూర్తిగా మరిచిపోయింది. తను ఒక రాజకుమార్తె అని, తనకు అమ్మానాన్నలు,అన్నలు ఉన్నారని, చిన్నప్పుడంతా చాలా గారాబంగా పెరిగిందనీ- ఏమీ గుర్తులేదు, ఆ పాపకు.

అయితే అక్కడ రాణి మాత్రం సుగుణను తలచుకొని రోజూ ఏడుస్తూనే ఉన్నది. దాన్ని చూసి పిల్లలు నలుగురూ ఇక తట్టుకోలేకపోయారు. ఒక రోజున నలుగురూ కలిసి తల్లిదండ్రుల్ని ఒప్పించారు. చెల్లెల్ని వెతుక్కొని వచ్చేందుకుగాను దేశాటన మొదలు పెట్టారు. అట్లా దేశం అంతటా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు ఒక రోజున ఒక నగరం చేరుకున్నారు.

సరిగ్గా ఆ సమయానికే సాధువు, సుగుణ ఆ నగరంలోకి ప్రవేశించారు. 'సుగుణా, నేను అలసిపోయాను. ఇక్కడ పడుకుంటాను; నువ్వెళ్ళి నాకు కాసిని నీళ్ళు తెచ్చిపెట్టు. ఇక్కడికి దగ్గర్లో బావి ఎక్కడ ఉన్నదో వెతుక్కో, సరిగా" అని, ఊరి శివార్లలోనే ఒక చెట్టుక్రింద పడుకున్నాడు సాధువు .

సుగుణ వెళ్ళి వెతికితే దూరంగా ఒక చేద బావి కనబడింది. ఆ పాప బావి దగ్గరికి పోయి కాళ్ళు కడుక్కుంటుంటే అదాటుగా చూశారు వాళ్ల అన్నలు! సుగుణని చూడగానే 'ఆ పాప మా చెల్లెలు లాగా ఉందే' అని అనుమానం వచ్చింది అన్నయ్యలు నలుగురికీ. అంతలో ఆ పాప పాదంమీద పుట్టుమచ్చ కనబడింది వాళ్లకు. ఇంకేముంది, ఒకరితో ఒకరు గుసగుసలాడారు వాళ్ళు. 'ఆ పాప తమ చెల్లెలే' అని నిశ్చయానికి వచ్చారు. కానీ ఆ పాప మాత్రం వీళ్ళను గుర్తుపట్టనేలేదు! మరెలాగ?

అందుకని నలుగురూ వెళ్ళి ఆ సాధువుకు గౌరవంగా నమస్కరించారు. 'మీరు మాతోబాటు మా నగరానికి రావాలి, మమ్మల్ని పావనం చెయ్యాలి' అని మర్యాదగా మాట్లాడారు. వాళ్ల మర్యాదకు సాధువు మురిసిపోయాడు. పాపతో బాటు బయలుదేరి వాళ్ల నగరానికి పోయాడు. అక్కడి భవనాలు చూశాక అతనికి ఇంకా సంతోషమైంది. ఇంతటి రాజకుమారులు నాకు శిష్యులు అయ్యారు! అని సంబర పడ్డాడు. రాజకుమారులు సాధువును విశ్రాంతి మందిరంలో ఉంచి, అన్ని సౌకర్యాలూ కల్పించారు. "మీకేం కావలసినా కబురు చెయ్యండి" అని చెప్పి, సుగుణను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళారు.

సుగుణను చూడగానే రాజు రాణి ఆ పాపను గుర్తుపట్టారు. రాజకుమారులు వాళ్లకు విషయం అంతా వివరించారు. 'ఇన్నాళ్ళకు తన కూతురు తిరిగి వచ్చింది' అని రాణి ఎంత సంతోషపడిందో చెప్పలేను. సుగుణకు స్నానం చేయించింది; మంచి బట్టలు కట్టించింది; దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడింది; పాపనుండి అసలు విషయాలన్నీ తెలిసాయి. దాంతో సాధువు చేసిన మోసం తెలిసిపోయింది పాపకు కూడా. తనకు తల్లిదండ్రులు, అన్నలు ఉన్నారని, తనకోసమే పరితపిస్తూ ఉన్నారని తెలిసి ఆ పాపకు ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది.

మరునాడు పాపను, సాధువును సభలో‌విచారించారు. సాధువు స్వార్థబుద్ధి తేట తెల్లం అయ్యింది. తన నేరాన్ని ఒప్పుకున్నాడు సాధువు. రాజుగారు అతనికి కఠిన కారాగార శిక్ష విధించారు. అట్లా సుగుణ మళ్ళీ తల్లిదండ్రులను,అన్నలను చేరింది. సంతోషంగా ఉంది" ముగించాడు తాతయ్య.

"మరి అక్కకు పెళ్ళి చేశారా? లేదా?" అని‌శశి, రవి, వాసు, రేఖ అడిగారు.

"మీకు అన్నింటికీ‌తొందరేనర్రా! ఆమెకు తగిన వయస్సు వచ్చాక తమ పొరుగు దేశపు రాజకుమారుడితో వైభవంగా పెళ్ళి జరిపించారు. అతిథులందరికీ భోజన తాంబూలాలే కాకుండా కానుకలు కూడా ఇచ్చి పంపారు" అని నవ్వాడు తాతయ్య.

పిల్లలందరు ఆవలిస్తూ పడకలపై వాలారు. ఆరోజు రాత్రి వాళ్ళకొచ్చిన కలల్లో శశి, రేఖ, సుశీ, కళ అందరూ సుగుణలైపోయారు. అబ్బాయిలందరూ అన్నలైపోయి, తప్పిపోయిన చెల్లెళ్లందరినీ వెతికి పెట్టారు!