శ్రీనివాసులు పెద్ద వ్యాపారి, సమాజ సేవకుడూనూ. రాజుగారికి కూడా ఆయనంటే చాలా గౌరవం. రాజ్య సంరక్షణకు సంబంధించిన అనేక విషయాలలో ఆయన శ్రీనివాసుల్ని సంప్రతిస్తుంటారు. శ్రీనివాసులికి ముగ్గురు కొడుకులు. మొదటి వాడి పేరు సుధీరుడు. రెండవ వాడు ప్రతాపుడు. చివరివాడు చంద్ర. వాళ్లలో ఒకరిని సైన్యంలో అధికారిగా చేర్చమని రాజుగారి అభ్యర్థన.

ఒకరోజు శ్రీనివాసులు కొన్ని పత్రాలను చేతబట్టుకొని తన ముగ్గురు కొడుకులను పిలిచాడు. "చూడండి, నాయనలారా! నా సంపాదన అంతా ఒక ఎత్తు, పూర్వీకులనుండి వచ్చిన ఈ ఆస్తి ఒక ఎత్తు. దీన్ని పూర్తిగా సమాజ సేవకోసం వాడాలని నేను నిశ్చయించుకున్నాను. అయితే స్వార్థంలేని సమాజసేవ అందరూ చేయగలిగే పని కాదు- ఆ బాధ్యతను మీలో 'ఎవరికి ఇవ్వాలి' అని నేను ఆలోచిస్తున్నాను. ఇక రాజుగారేమో, మీలో ఒకరిని సైన్యంలోకి పంపమని బలవంతం చేస్తున్నారు. అందుకని, ఇవాళ్ళ మీరు మీకు నచ్చిన చోట్లకు పొండి. మీ మీ ఇష్టాల్ని బట్టి, 'మీరు మెచ్చే, నాకు నచ్చే' పని ఏదైనా, తలా ఒకటి చేసుకొని రండి. మీరు చేసిన పనులను చూశాక, వాటిని బట్టి మీకు బాధ్యతలను పంచుతాను" అని చెప్పాడు.

సుధీరుడు పోతూ ఉంటే వీధిలో కొందరు కుర్రవాళ్ళు అడుక్కుంటూ కనిపించారు. "ఇలా అడుక్కునే బదులు, ఏదైనా పని చూసుకోరాదూ?" అని వాళ్ళని మందలించాడు సుధీరుడు. "మేం పనిచేస్తాం అయ్యా! కానీ ఎవ్వరూ మాకు పని ఇవ్వట్లేదు. అందరూ 'కొత్త వాళ్ళని ఎలా నమ్ముతాం?' అంటున్నారు" అన్నారు వాళ్ళు. సుధీరుడు అప్పటికప్పుడు తమ చిన్న దుకాణంలో వాళ్లకి పని ఇవ్వటమే కాకుండా, వాళ్ళకి సాయం చేసేందుకు ఒక మనిషిని కూడా పెట్టాడు.

ప్రతాపుడు నగర శివార్లలో పోతుంటే ఒక ముసలమ్మ బావిలోకి దూకుతూ కనబడ్డది. అతను గట్టిగా అరుస్తూ ఆమెను వారించబోయేలోగా ఆమె బావిలోకి దూకేసింది! ప్రతాపుడు పరుగున పోయి, అక్కడున్న త్రాడు చివరను ఒక చెట్టుకు ముడివేసి, దాని రెండవ కొసను నడుముకు కట్టుకొని బావిలోకి జారాడు. అప్పటికే నీళ్ళు మ్రింగి కొసప్రాణంతో ఉన్నది ముసలమ్మ! ప్రతాపుడు ఆమెను పట్టుకొని త్రాడు సహాయంతో బయటికి వచ్చి, ఆమె చేత నీళ్లు కక్కించాడు. చాలా అప్పుల పాలైందట ఆ అవ్వ! ఆమె కథ విని ప్రతాపుడి మనసు కరిగిపోయింది. తన దగ్గరున్న డబ్బునంతా ఆమెకు ఇచ్చి, ఆమెను వాళ్ల బంధువులకు అప్పగించి, వెనక్కి తిరిగి వచ్చాడు.

ఇక చంద్ర అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక దొంగ అతని మీద పడి, కత్తితో పొడవబోయాడు. చంద్ర చటుక్కున అతని చేయి వడిసి పట్టాడు. ఆ పెనుగులాటలో జారి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాడు దొంగ! అతను పైకి వస్తాడని చంద్ర కొంచెం సేపు ఎదురు చూశాడు- గంట గడిచినా వాడి జాడ లేదు!

చివరికి చంద్ర తనే మెల్లగా లోయలోకి దిగి చూశాడు. దొంగ కాళ్ళు రెండూ విరిగాయి- అక్కడ ఒక పొదలో ఇరుక్కొని మూలుగు-తున్నాడు. బాగా శ్రమపడి అతన్ని లోయలోంచి పైకి ఎత్తుకొచ్చాడు చంద్ర. తనకు తెలిసిన ఆకు పసరులతో ప్రాధమిక వైద్యం చేసి కట్లు కట్టాడు. అటుపైన తనే పోయి, అతన్ని వాళ్ళ ఊరికి చేర్చి వచ్చాడు.

ఆరోజు రాత్రి ముగ్గురూ ఇంటికి చేరుకున్నాక, శ్రీనివాసులు వాళ్లని ముగ్గురినీ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, ఎవరు ఏం చేసారో కనుక్కున్నాడు.

"అడుక్కునే కుర్రవాళ్లను చిన్నదుకాణంలో పనికి పెట్టాను. వాళ్లను గమనించుకొమ్మని మన సూరయ్యను నియమించాను" అన్నాడు సుధీరుడు.

"బావిలోకి దూకి ముసలమ్మను కాపాడాను" అన్నాడు ప్రతాపుడు.

"నేను చేసింది మంచి పనో కాదో తెలీదు గానీ, కాళ్ళు విరిగి పడిపోయిన దొంగను లోయలోంచి పైకి తెచ్చి వాళ్ళ ఊరికి చేర్చాను" అన్నాడు చంద్రం. శ్రీనివాసులు ముగ్గురినీ మెచ్చుకొని, తన వ్యాపారాన్ని సుధీరుడికి అప్పగించాడు. ప్రతాపుడినేమో సైన్యంలో పని చేసేందుకు రాజాస్థానానికి పంపాడు. ఇక సమాజసేవా కార్యక్రమాన్ని చంద్రానికి అప్పజెప్పాడు. అట్లా ఎలా నిర్ణయించాడో చెప్పండి, చూద్దాం?!