అనగా అనగా ఒక ఊళ్లో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా దయగలవాడు, భక్తిపరుడు; కానీ అతని భార్య మాత్రం లోకం తెలిసిన మనిషి.

ఒకరోజున ఆ రైతు తన పొలంలో దున్నుతూ ఉండగా ఒక మట్టికుండ దొరికింది. దానిని జాగ్రత్తగా పైకి తీసి తెరచి చూస్తే ఏముంది- దాని నిండా బంగారు నాణాలు!

రైతు కొంచెం ఆలోచించాడు- 'అవి తనవేనా, కాదా?' అని. కానీ ఆ ఆలోచన ఎంతకీ తెగేటట్లు లేదు. అందుకని అతను దానిని అలాగే మూసి చెట్టు క్రింద పెట్టేసి, తన పని తాను చూసుకుంటూ పోయాడు.

సాయంత్రం చీకటి పడే సరికి అతను బంగారు నాణాల కుండ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. మెల్లగా నడిచి ఇల్లు చేరుకున్నాడు.

ఆ రాత్రి స్నానం చేసి అన్నం తింటుండగా గుర్తుకు వచ్చింది, ఆ కుండ సంగతి! వెంటనే భార్యకు చెప్పాడు. ఆమె "అయ్యో! మీరు ఎంత పిచ్చివారండీ! దానిని తీసుకొచ్చి ఉండాల్సింది! అదృష్టం ఎప్పుడూ రెండుసార్లు తలుపు తట్టదట. రేపు మీరు వెళ్ళేంత వరకూ ఆ బంగారు నాణాల కుండ మీకోసం చెట్టుక్రింద ఎందుకు వేచి ఉంటుంది? ఇప్పుడైనా పోండి, పోయి ఆ కుండను తీసుకురండి" అని రాగం మొదలు పెట్టింది.

అయితే ఆ సరికి రైతు బాగా అలసిపోయి ఉన్నాడు. అదీగాక, వాళ్ల పొలం ఇంటినుంచి బాగా దూరంలో ఉన్నది; వానకూడా పడేటట్లున్నది. అందుకని అతను దేవుడి మీదే భారం వేయ నిశ్చయించుకున్నాడు. "చూడు, అది మనకు దేవుడు ఇచ్చిన సంపదే అయితే రేపు నేను వెళ్ళేంతవరకూ అది అక్కడే ఉంటుంది. ఎవ్వరూ దాన్ని ఎత్తుకు పోలేరు" అన్నాడు.

రైతు భార్యకు ఆ నిర్ణయం అస్సలు నచ్చలేదు- కానీ ఏం చేయగలదు? రైతు మొండితనం ఆమెకు తెలుసాయె! మరికొంత సేపు తిట్టి, చివరికి ఆమె ఊరుకున్నది.

అయితే ఆరోజునే రైతు ఇంటిని దోచుకునేందుకు వచ్చిన దొంగలు ఇద్దరు విన్నారు-ఈ కబుర్లన్నీ. "ఓహ్! మన పంట పండిందిరా! ఈ పిచ్చి రైతు పొలం ఎక్కడో తెలుసుగదా, నీకు? అక్కడికి పోదాం వెంటనే" అనుకున్నారు. తక్షణం బయలు దేరి పోయారు.

వాళ్లు పొలంలోకి వెళ్లే సరికి బాగా చీకటిగా ఉన్నది. ముందుగా అనుకొని రాలేదు కనక వాళ్ల దగ్గర దీపం లాంటిది ఏమీ లేదు. అయినా ఆ చీకట్లో కూడా వాళ్ళు తడుముకుంటూ పోయి చెట్టు క్రింద ఉన్న కుండను కనుక్కున్నారు. ఇద్దరూ ఉత్సాహంతో గంతులు వేస్తూ కుండకున్న మూతను విప్పబోయారు- అంతలో వాళ్లలో ఒకడికి అనుమానం వచ్చింది: "దీనిలో వాడు చెప్పినట్లు డబ్బులే ఉన్నాయో, లేకపోతే ఏ పామైనా దూరి కూర్చున్నదో, ఎలా తెలుస్తుంది?" అని. ధైర్యం చేసి ఇద్దరూ దాని మూత తీసి మెల్లగా కుండలో చేయి పెట్టారు- మెత్తమెత్తగా ఏదో తగిలింది చేతికి. చూడగా అది పామే!

దొంగలిద్దరికీ పై ప్రాణాలు పైనే పోయినట్లు అయ్యింది. వెంటనే కుండను అక్కడ వదిలి దూరంగా పారిపోయారు. అంతలోనే వాళ్లలో ఒకడికి మరో ఆలోచన తట్టింది: "రేపు ప్రొద్దునే ఆ రైతు వచ్చి దీనిని తెరుస్తాడు గదా; ఇందులోనే కూర్చున్న పాము వాడిని కాటు వేసి చంపేస్తుంది. ఆ తర్వాత మనం వాడి ఇంట్లో దొంగతనం చేయవచ్చు!" ప్రొద్దున్నే రైతు పొలానికి వెళ్ళాక చూస్తే బంగారం ఉన్న కుండ అక్కడే ఉంది: చెట్టు క్రింద. దాని పైన మూత మాత్రం కొంచెం ప్రక్కకి జరిగినట్లుంది. రైతు పెద్దగా ఏమీ ఆలోచించకుండా దాని మూతను సరిచేసి కట్టి పెట్టాడు. 'సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్లచ్చులే' అని దాన్ని అక్కడే పెట్టి పొలం పనిలో మునిగిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా ఇల్లు చేరుకున్నాడు అలవాటు ప్రకారం - మళ్ళీ కుండ సంగతి మరచి.

ఇంట్లో భార్య కుండకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది . భర్త కుండను తీసుకు రాలేదని ఆమె పెద్ద గొడవే చేసింది. 'రైతు చనిపోయి ఉంటాడులే' అని దొంగతనానికి వచ్చిన దొంగలిద్దరికీ కూడా‌ చాలా నిరాశ కలిగింది. వాళ్ళు 'ఇప్పుడేం చేద్దాం' అని ఆలోచిస్తూండగానే రైతు అన్నాడు భార్యతో- "చూడు, ఎక్కువ గొడవ చేయకు. జరిగిందేదో జరిగింది: ఆ సొమ్ము మనకు దేవుడిచ్చిందే అయితే అది మన ఇంటి దగ్గరకే వస్తుంది. మనది కాని సొమ్ము మనం ఎంత ఆశపడ్డా మనకు దక్కదు" అని.

దొంగలు ఈ మాట విని నవ్వుకున్నారు. "వీడి ఇంటికి వచ్చేది బంగారమో, పామో చూద్దాం" అని వాళ్ళిద్దరూ మళ్ళీ పొలానికి పోయి, కుండను వెతికి పట్టుకొచ్చారు. రైతు ఇంటి వాకిలి ముందు పెట్టారు. అప్పటికి తెల్లవార- వస్తున్నది. దొంగలిద్దరూ చెట్టు చాటున దాక్కొని చూస్తున్నారు- 'ఎప్పుడు రైతు లేచి బయటికి వస్తాడా, ఎప్పుడు కుండను చూసి మురిసిపోతాడా, మూత తెరిచి పాము కాటుకు గురౌతాడా'అని.

అంతలోనే రైతు లేచి వాకిలి తెరిచాడు- ఎదురుగుండా కుండ! కుండలో బంగారు నాణేలు! 'మన సొమ్ము మన ఇంటికి నడిచిరావటం అంటే మరీ‌ ఇంత ఇదిగానా?' అని ఆశ్చర్యపోయింది రైతు భార్య. ఇద్దరూ కలిసి ఆ సొమ్మును బ్యాంకులో దాచుకునేందుకు బయలు దేరారు.

దొంగలిద్దరూ జరిగిన దాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. 'నిజంగానే మనకు రాసి పెట్టి ఉన్న సొమ్ము మన దగ్గ రికి నడిచి వస్తుందా'అని వాళ్లకొక అనుమానం పట్టుకున్నది.