పసలపూడి అనే గ్రామంలో పద్మనాభాచారి అనే వడ్రంగి ఉండేవాడు. మంచికొయ్యని కొని, దానితో రకరకాల బొమ్మలు చేసి, సంతలో అమ్మేవాడు ఆచారి. కానీ అతని సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. వాళ్ళ కుటుంబ ఖర్చులకు బొటాబొటిగా సరిపోయేది. ఆచారికి ఇద్దరు కూతుళ్ళు- ఈశ్వరి, పార్వతి. పార్వతి ఎనిమిదవ తరగతి, ఈశ్వరి పదవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చాలా మంచి పిల్లలు.

ఒకరోజు రాత్రి ఆచారి భార్య వరమ్మ "ఏమండీ! వచ్చే నెలే తిరణాల. కొంచెం అప్పుచేసైనా సరే, ఎక్కువ బొమ్మలు తయారు చేయండి. తిరణాల్లో వ్యాపారం ఏ కొంచెం జరిగినా మన అప్పూ తీరుతుంది; వచ్చే సంవత్సరం ఈశ్వరిని కాలేజీలో చేర్పించేందుకు డబ్బూ సమకూరుతుంది" అంది. అప్పు చేయడం ఆచారికి ఇష్టం లేదు. కానీ పిల్లని కాలేజీకి పంపించాలంటే అంతకంటే మార్గం లేదు! అందుకని మర్నాడు ఆ ఊళ్ళో వడ్డీకి డబ్బులు ఇచ్చే బ్రహ్మయ్య దగ్గరికి వెళ్ళాడు. నెల రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. పత్రం మీద సంతకం చేసి డబ్బు తీసుకున్నాడు. అటునుండి అటే పట్నం వెళ్ళి కొయ్యను కొనుక్కొచ్చాడు.

ఇక ఆ రోజు నుండీ రాత్రింబవళ్ళూ కష్టపడి రకరకాల బొమ్మలు చెక్కటం మొదలు పెట్టాడు ఆచారి. శివపార్వతులు, సిద్ధి బుద్ధి వినాయకులు, స్త్రీ పురుషులు, జంతువులు, పక్షులు, గంటలు, గోపురాలు - ఇలా ఒకటేమిటి, అన్ని రకాల బొమ్మలూ అద్భుతంగా తయారవుతున్నాయి. ఈశ్వరి, పార్వతి కూడా తండ్రికి సహాయం చేస్తున్నారు. పార్వతి అయితే బడి పిల్లలందరినీ పిలిచి బొమ్మలు చూపించింది. అన్నన్ని బొమ్మలను చూసి పిల్లలందరూ మురిసిపోయారు. కొందరు పిల్లలైతే, రోజంతా అక్కడే ఉండి ఆచారికి సహాయం చేశారు. తిరణాల దగ్గరకు వస్తోంది. చెక్కిన బొమ్మలకు రంగులు వేయడం ప్రారంభించాడు ఆచారి. ఇప్పుడు అవి ఇంకా అందంగా మెరిసిపోతున్నాయి. బడి పిల్లలు రోజూ స్కూలు విడిచి పెట్టాక వచ్చి చూస్తున్నారు వాటిని. రంగులు ఏవేవి వెయ్యాలో, ఎలా వెయ్యాలో ఆచారికి చెబుతూ ఆనందపడిపోతున్నారు.

అయితే తిరణాల ఇంకా రెండు రోజులుందనగా వాన ముసురు పట్టుకుంది. అందరిలోనూ ఆందోళన మొదలైంది. తిరణాల రోజున కూడా ముసురు వదలనే లేదు. ఊరంతా బోసిపోయింది- వాన ముసురు కారణంగా తిరణాలకు అస్సలు జనమే రాలేదు. బొమ్మలన్నీ ఉన్నవి ఉన్నట్టు పడి ఉన్నాయి: వాటిని చూస్తూంటే ఆచారికి దు:ఖం ఆగట్లేదు. ఏం చేయాలో తోచడం లేదు.

నెల గడిచిందో లేదో, మనుషుల్ని వెంటబెట్టుకొని ఊడి పడ్డాడు బ్రహ్మయ్య. ఆచారి అతని కాళ్ళావేళ్ళా పడ్డాడు- మరొక్క నెల సమయం ఇవ్వమని వేడుకున్నాడు. బ్రహ్మయ్య వినలేదు. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అతనితోబాటు వచ్చిన మనుషులు ఆచారి ఇంట్లో ఉన్న సామానంతా ఎత్తి బయట పడేయసాగారు. అడ్డం వచ్చిన వరమ్మను బ్రహ్మయ్య ఒక్క త్రోపు తోశాడు. క్రింద పడిన వరమ్మకు కాలు విరిగింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు పిల్లలు. వాళ్లను కూడా తన్నుకుంటూ ఇంట్లో ఉన్న తట్టలు-బుట్టలు ఎత్తుకుపోయాడు బ్రహ్మయ్య.

సంగతి తెలిసి స్కూలు పిల్లలు, టీచరు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కలిసి వరమ్మని వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. విరిగిన కాలుకు మామూలు కట్టు సరిపోదు- ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు. ముఖం చేతులతో కప్పుకుని ఏడుస్తున్న ఆచారిని, ఈశ్వరిని, పార్వతిని పిల్లలు ఓదార్చారు. ఇంట్లో చెల్లా చెదరుగా పడి ఉన్న కొయ్య బొమ్మల్ని పిల్లలంతా కలిసి ఒక చోట కుప్ప పోశారు. క్రిందటి రోజు వరకూ మిలమిలా మెరిసిపోయిన ఆ బొమ్మలు ఇప్పుడు తెలవెలబోతున్నట్లు అనిపించాయి.

మర్నాడు పిల్లలందరూ ఆచారి ఇంటి ముందు గుమిగూడారు. అక్కడున్న రంగులను పూసుకుని అందరూ కొయ్యబొమ్మలలా తయారయ్యారు. మునసబు గారి అబ్బాయి రఘు, ధర్మయ్య గారి అబ్బాయి వేణు బండ్లు తెచ్చారు. బొమ్మలన్నింటినీ పిల్లలే బండ్లపైన ఎక్కించారు. డప్పుల దరువులు మొదలయ్యాయి. ఊళ్ళో వీధి వీధికీ తిరుగుతూ బొమ్మలను అమ్మటం మొదలు పెట్టారు పిల్లలు.

కొయ్యబొమ్మల్లాగా అలంకరించుకున్న పిల్లల్ని అందరూ ముచ్చటగా చూశారు. వరమ్మ ఆపరేషన్ గురించి తెలిసిన ఊళ్ళో వాళ్ళు చెప్పిన రేటు కంటే రెండు రూపాయలు ఎక్కువే ఇచ్చి బొమ్మలను కొనుక్కున్నారు. పిల్లలు చుట్టు ప్రక్కల ఊళ్ళల్లో కూడా తిరుగుతూ బొమ్మలు అమ్మారు. మర్నాటికల్లా ప్రక్క ఊళ్ళ పిల్లలు కూడా వీళ్ళతో చేరారు! రంగులు పూసుకొని, ఉత్సాహంగా ఎగురుతూ బొమ్మలు అమ్మటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కొంతమంది పెద్ద పిల్లలు ఆచారితో బాటు కూర్చున్నారు. మిగిలిన చెక్కతో మరిన్ని బొమ్మలు చెక్కించసాగారు. కొందరు వాటికి రంగులు వేశారు. అటు అవి ఆరాయో లేదో, మరికొందరు పిల్లలు వాటిని పట్టుకొని అమ్మేసేందుకు పరుగెత్తారు. మూడో రోజున బొమ్మలు అమ్మడానికి బ్రహ్మయ్య కూతురు, కొడుకు కూడా బయలుదేరారు! ఒకవైపున పిల్లలు ఊరూరా తిరిగి బొమ్మలు అమ్ముతుంటే, మరొక వైపున ఊళ్ళో పెద్దలంతా ఒకచోట చేరి చర్చించుకున్నారు. మామూలుగా కరకుగా ఉండే బ్రహ్మయ్య ఎందుకనో, బాగా మెత్తబడ్డట్లు అనిపించాడు. పెద్దవాళ్లంతా కలిసి డాక్టరు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, బ్రహ్మయ్య తనంతట తానే ముందుకొచ్చి, ఆపరేషన్ ఖర్చులన్నీ తనే భరిస్తానన్నాడు! డాక్టరు గారు కూడా, తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తానన్నారు. వెంటనే ఆపరేషన్ జరిపి కట్టు కట్టారు కూడాను.

సాయంత్రానికి బొమ్మలు అమ్మి ఇంటికి వచ్చిన బడి పిల్లలకి ఈ విషయం తెలిసింది. పట్టరాని సంతోషంతో అందరూ చిందులేశారు.

మిగిలిన కొన్ని బొమ్మల్నీ వరమ్మకు బహుమతిగా ఇచ్చారు పిల్లలందరూ.

ఆ పిల్లల నవ్వు ముఖాల్ని చూసిన ఆచారి తన కొయ్య బొమ్మలన్నీ ఒక్కసారిగా ఎలా ప్రాణం పోసుకున్నాయా, అని ఆశ్చర్యపోయాడు.