వనపర్తి అనే గ్రామంలో వరదయ్య అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉండేది; కానీ అతను మాత్రం పరమ పిసినారి- పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడుకాదు. అతని పిసినారితనాన్ని గురించి ఊళ్ళోవాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు.
ఓమారు ఆ గ్రామానికి మహిమ గల ఋషి ఒకాయన వచ్చాడు. హిమాలయాలనుండి తను తీసుకు వచ్చిన శివలింగాన్ని ఊరి శివాలయంలో ప్రతిష్ఠించాడు. నిత్యం పంచామృతాలతో అభిషేకం చేయసాగాడు. ఊళ్ళో జనాలందరూ తమ వంతుగా పాలు, పెరుగు, నెయ్యివంటివి తీసుకెళ్ళి అభిషేకంలో పాల్గొంటున్నారు.
శివాలయానికి వెళ్ళే దారి వరదయ్య ఇంటి ముందునుండే పోతుంది. అందరూ తన ఇంటి ముందునుండే వెళ్తున్నారు; తనని చూసి హేళనగా నవ్వుతున్నారు- వరదయ్యకు ఇది కంటగింపుగా ఉంది. అంతలో ఓ తుంటరి నలుగురికీ‌ వినబడేట్లు గట్టిగా "ఎంతమంది వచ్చినా వరదయ్యగారు మాత్రం ఆలయానికి రారు లేవోయ్! పాపం ఆ పాలు,పెరుగు అమ్ము కుంటే నాల్గు డబ్బులు వెనకేసుకోవచ్చు- శివలింగానికి అభిషేకం చేస్తే ఏం వస్తుంది చెప్పు?" అనటం, వాడి చుట్టూ చేరిన గుంపు మొత్తం వికవికమని నవ్వటం చూసి వరదయ్యకు రోషం వచ్చింది. 'తనుకూడా భక్తుడే' అని నిరూపించు-కోవాలనుకున్నాడు.
’ఐనా సేరు పాలని చూస్తూ చూస్తూ ఆ రాతి మీద పోయటం ఎలా?’ అని వరదయ్యకు రాత్రంతా నిద్ర పట్టలేదు. చివరికి ఒక ఉపాయం తట్టింది. ఇంట్లో చాలా కాలంగా మురిగిపోయిన పాత బియ్యపు పిండి ఎలాగూ ఉంది. దాన్నిండా పురుగులూ, చెత్తా చెదారమూనూ! ఇప్పుడు వరదయ్య కూర్చొని దాన్ని శుభ్రం చేశాడు. పలచటి బట్టలో వేసి వస్త్రకాయం పట్టాడు. కొంచెం పిండిని చాలా నీళ్లలో ముద్దలు లేకుండా కలిపి, కొద్దిగా కర్పూరం జత చేసాడు. ఇప్పుడు చూస్తే ఆ మిశ్రమం పాల లాగానే కనబడుతున్నది! ఇంకేమి? వరదయ్య ఆ పిండిపాలను ఓ చెంబులో పోసుకున్నాడు. విభూది పట్టీలు పెట్టుకున్నాడు. పాతకాలపు గావంచా కట్టుకున్నాడు. తను శివాభిషేకానికి వెళుతున్నట్లు అందరికీ తెలిసేందుకుగాను దారిన పోయే వాళ్ళనందరినీ పలకరిస్తూ శివాలయానికి బయల్దేరాడు. అట్లా అపర శివుడిలాగా తను గుడికి నడుస్తూ ఉంటే, ఊళ్ళో జనాలంతా గుడ్లు వెళ్ళ బెట్టుకుని చూడటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది.
అట్లా వరదయ్య పిండిపాలతో శివునికి అభిషేకం చేసాడు. తన తరువాతి భక్తులు ఎవరో అభిషేకం చేయగా వచ్చిన పాలను ప్రసాదంగా తెచ్చుకున్నాడు, అదే చెంబునిండా! ఆ పాలను కాచి, తోడుపెట్టి, ఆ పెరుగును చిలికి, వచ్చిన ఆ వెన్న కాచి, నెయ్యిని చక్కగా సీసాలో భద్రపరచుకున్నాడు. ఇట్లా ప్రతిరోజూ పిండి పాలతో శివుడికి అభిషేకం చెయ్యటం, మంచి పాలను ప్రసాదంగా తెచ్చుకొని నెయ్యిని జమ చేసుకోవటం-సంతోషంగా కొనసాగించేశాడు. నెల గడిచాక చక్కగా ఆ నెయ్యిని అమ్ముకోవచ్చు!
ఊరి జనాలకి అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఇదంతా శివపరమాత్ముని లీల అనుకున్నారు వాళ్ళు. అందరూ వరదయ్యను మర్యాదగా చూడసాగారు. అందరూ తనను ఇప్పుడు గౌరవంగా చూస్తుంటే వరదయ్య లోలోపల వాళ్ల అమాయకత్వాన్ని తలచుకొని ముసిముసిగా నవ్వుకునేవాడు.
కొన్నాళ్ళకు ఆ ఋషి గ్రామంవదలివెళుతూ, గ్రామస్తులను పిలిచి- "అయ్యలారా!మనం ఒకగుమ్మడి గింజను నాటితే అది మనకు ఎన్నో గుమ్మడికాయలు ఇస్తుంది. మనం ఒక మామిడి టెంకను నాటితే వందల, వేల మామిడికాయల్ని- మనమేకాక, మన తర్వాతి తరాలవాళ్ళుకూడా- తింటారు. రైతులు ఒక బస్తా విత్తనాలని పొలంలో చల్లితే, ఎన్నో బస్తాల ధాన్యం లభిస్తుంది. ఈ పూజలు పునస్కారాలు ఉన్నది మనకు త్యాగభావాన్ని నేర్పేందుకే: 'మనం కొంత ఇస్తే దానికి ప్రతిఫలంగా మనకు ఎన్నో రెట్లు లభిస్తాయి' అని చెప్పేందుకు! అంతేకాదు; వేప విత్తనం నాటితే వేప మొక్క, కరివేప విత్తనం నాటితే కరివేప మొక్క మొలుస్తాయి. మనం ఇచ్చిన దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈవిషయం తెల్సుకుని, మీ తోటి వారికి సాయపడండి. నిజానికి దేవుడు ఎప్పుడూ కానుకలు, ముడుపులు కోరడు. త్యాగభావంతో బ్రతకమనేదే ఆయన మనకిచ్చే సందేశం. మీరంతా ఈ 40 దినాలుగా భగవంతునికి ఏమేమి అర్పించారో అవే మీ ఇంట ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి పొందుగాక!" అని చెప్పి వెళ్ళిపోయాడు.

అంతా ఇళ్ళకు వెళ్ళారు. ఆ రోజునుండీ ఊళ్ళో వాళ్ళందరి ఆవులు, గేదెలు రెట్టింపు పాలిచ్చాయి. వరదయ్య పశువులు మాత్రం ముక్క కంపుగొట్టే పిండి పాలు ఇవ్వసాగాయి.
దేవుడికి టోపీ పెట్టబోయిన వరదయ్యకు తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్లంతా చెప్పుకున్నారు- వాళ్ళకెలా తెలిసిందో మరి, ఈ రహస్యం!