పూర్వం, భారత దేశానికి ఈశాన్య ప్రాంతంలో జనద్వీపం అనే కుగ్రామం ఉండేది. చుట్టూ పర్వతాలు ఉండి బయటి ప్రపంచంతో ఆ ఊరికి సంబంధాలు ఎక్కువ ఉండేవి కావు. తర తరాలుగా ఆ ఊరి ప్రజలు తమకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ, తమకు తెలిసినదే ప్రపంచంగా జీవించసాగారు. ఆ ప్రాంతం దాటి వెళ్ళి కొండలకి అవతల ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలోనూ, ఆ ఊరు వదిలి వెళ్తే జరగరానివి జరుగుతాయనే భయం పెద్దలలోనూ ఉండేవి. అందుకు కారణం లేకపోలేదు.
ఆ ఊళ్ళో నూట పదేళ్ళ ముసలి తాత ఉండేవాడు. అతని పేరు తలగుమ్మడి. అతని పేరు ఎంత విచిత్రమో, అతని తీరూ అంతే విచిత్రంగా ఉండేది. అతను ఒంటరిగా ఉండే వాడు. అతని కుటుంబం గురించి ఆ ఊళ్ళో ఎవరికీ ఏమీ తెలియదు. అతని ఇంట్లో ఎన్నో వింత వస్తువులుండేవి. అవన్నీ తన చిన్న తనంలో జనద్వీపం వదిలి దేశాటన చేసిన రోజులలో పోగు చేసినవి అని చెప్పేవాడు తలగుమ్మడి. వాటిని చూసి పిల్లలెవరైనా జనద్వీపం బయట ఏముందో తెలుసుకోవాలని కుతూహలం కనబరిస్తే, "బయటికెళ్తే మీ తలలు గుమ్మడి కాయలైపోతాయి. నాకు అదే జరిగింది. అందుకే నా పేరు "తలగుమ్మడి" అయ్యింది. నమ్మరా?" అంటూ తలకి ఉన్న టోపీ తీసి చూపించే వాడు. టొపీ కింద తలగుమ్మడికి బట్ట తల ఉండేది. ఆ బట్ట తల ఉన్న మేరా, అతని చర్మం గుమ్మడి కాయ రంగులో ఉండేది.
అది చూసి పిల్లలు కొంత భయపడే వాళ్ళు, కొంత ఆశ్చర్యపడే వారు. అక్కడ రంగేమన్నా పూసుకున్నాడేమో అని గీకి చూడడానికి సాహసించే వాళ్ళు కొందరు. మొత్తానికి ఎన్ని సార్లు చెప్పినా అడిగి మరీ అతని కథ చెప్పించుకునే వారు పిల్లలందరూ. ఆ కథ ఇది:
తలగుమ్మడి తల గుమ్మడి కాయ కాక ముందు అతని పేరు దిమ్మరి. దిమ్మరి ఒక సారి ఇంట్లో ఎవ్వరికీ చెప్ప పెట్టకుండా, తనకి తోచిన తిండీ, బట్టలూ మూట కట్టుకుని ఊరికి తూర్పున ఉన్న కొండ కనుమల గుండా దారి వెతుక్కుంటూ, కొండ అవతలి వైపుకి వెళ్ళాడు. అక్కడ తమ ఊరి కంటే పది రెట్లు పెద్దగా ఉన్న జనవాసం కనిపించింది. ఆశ్చర్యపోయాడు. తీరా వెళ్ళి వాళ్ళని పలకరిస్తే, వాళ్ళకి తన భాష తెలియదని అర్థమయ్యింది. కష్టపడి సైగలతో తను కొండకి అవతల వైపు నుంచీ వచ్చానని వాళ్ళకి చెప్పాడు. వింతగా చూస్తూనే అతనిని ఆదరించారు. మెల్లగా ఊరి వాళ్ళతో పరిచయాలు పెరిగి, వారి భాష కూడ నేర్చుకున్నాడు.
అలా ఉంటుండగా ఒక సారి ఆ ఊరికి ఒక గారడీ బృందం వచ్చింది. వాళ్ళంతా విచిత్ర వేషధారణతో, వింత చేష్టలు చేస్తూ ఊరి వారికి వినోదం కల్పించారు. దిమ్మరికి వారిని చూసి తానూ వారితో పాటు ఊళ్ళు తిరిగి వినోదం చేస్తూ జీవితమంతా సరదాగా గడిపేయ వచ్చునని ఆశ కలిగింది. అనుకున్నదే తడవు వారితో ఆ మాట చెప్పాడు. వాళ్ళు కూడా వెంటనే అతనిని తమ బృందంలో చేర్చుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పొంగిపోయాడు. ఆ గారడీ బృందంతో పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఊరు దాటాక కానీ అతనికి తెలియలేదు, తనెంత పొరపాటు చేశాడో. తనకి గారడీ నేర్పించే బదులు ఆ బృందం తన చేత పనులు చేయించుకోసాగారు. కడుపు నిండా తిండి దొరకక, క్షణం విశ్రాంతి దొరకక, చాలా కష్టపడసాగాడు దిమ్మరి.
ఆ కష్టాలు భరించలేక ఒక రాత్రి ఆ బృందం వేసుకున్న గుడారాలనించి పారిపోబోతుండగా పట్టుబడిపోయాడు. గారడీ బృందం నాయకుడు, 'నీకు వినోదం కావాలా? ఐతే, ఇదుగో చూడు!" అంటూ దిమ్మరి తలను గుమ్మడి కాయగా మార్చేశాడు. దిమ్మరికి తల దిమ్మెక్కి పోయింది. అప్పుడు గారడీ బృందం నాయకుడు, "ఈ రోజు నుంచీ నీ పేరు 'తలగుమ్మడి '. ఇక నుంచీ నువ్వు తలలు అమ్ముకుంటూ బతుకు!" అంటూ ఒక గుర్రమూ, ఒక మూటలో కొన్ని తలకాయలూ, కొంత డబ్బూ ఇచ్చి అక్కడ్నుంచీ పంపేశాడు. వెళ్ళే ముందు అతని చెవిలో ఒక రహస్యం చెప్పాడు. తలగుమ్మడి విధి లేక గుర్రమెక్కి బయలు దేరితే వెనకాల గారడీ వాళ్ళంతా గట్టిగా నవ్వడం వినిపించింది.

తలగుమ్మడి ఊళ్ళు తిరుగుతూ, "అందమైన ముఖం కావాలన్నా, తెలివితేటలు రెట్టింపవ్వాలన్నా, బట్టతల పోయి జుట్టు బాగా పెరగాలన్నా, కొనుక్కోండి, కొత్త తలకాయలు!" అంటూ అరుస్తూ తిరగ సాగాడు. ఆశ కొద్దీ ఒకరిద్దరు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి అతని దగ్గర తలలు కొనుక్కునే వారు. అవి పెట్టుకోగానే వారి తలలూ గుమ్మడి కాయలైపోయేవి. అప్పుడు వారికీ కొన్ని తలలిచ్చి, గారడీ బృందం నాయకుడు తనకి చెప్పిన రహస్యం వాళ్ళకీ చెప్పి అమ్ముకోమని పంపే వాడు తలగుమ్మడి. ఐతే ఒకసారి తలలు గుమ్మడికాయలౌతాయని ఒక చోట తెలిసిన తర్వాత ఇక ఆ ఊళ్ళో మనలేక పరుగు పరుగున ఇంకో ఊరికి వెళ్ళే వాడు.
ఆఖరికి విద్యాపురం అనే ఉరు చేరి, సంతలో, ఎప్పటిలాగే, "అందమైన ముఖం కావాలన్నా, తెలివితేటలు రెట్టింపవ్వాలన్నా, బట్టతల పోయి జుట్టు బాగా పెరగాలన్నా, కొనుక్కోండి, కొత్త తలకాయలు!" అని అరుస్తుంటే జనమంతా పోగయ్యి వింతగా చూడ సాగారు. అందులో ఒకరిద్దరు డబ్బులిచ్చి కొత్త తలకాయలు కొనుక్కోవడానికి సిద్ధమౌతుండగా, ఒక చిన్న పిల్లాడు, "ఓ తలలు అమ్మే తలలేని మనిషీ, నీ గుమ్మడి కాయ తల తీసి నువ్వే ఒక కొత్త తలకాయ పెట్టుకోవచ్చు కదా?" అని అడిగాడు. అంతే, తలగుమ్మడికి ఆ క్షణం గుమ్మడి కాయ తల పోయి, తన స్వంత తల వచ్చేసింది. ఆ గారడీ బృందం నాయకుడు తనకు చెప్పిన రహస్యం అదే: ఎవరైనా, తనకు గుమ్మడి కాయ తల తీసేసి అసలు తల పెట్టుకోమని సూచించగానే తనకి అసలు తల వచ్చేస్తుందని! అలా అసలు తల రాగానే, తలగుమ్మడి సంతోషంతో తన మూటలో ఉన్న డబ్బంతా ఆ పిల్లాడికిచ్చేసి, పరుగు తీశాడు. అలా పరుగు తీసిన వాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగాడో గుర్తు లేదు కానీ, కళ్ళు తెరిచి చూసే సరికి జనద్వీపంలో ఉన్నాడు.
ఐతే, ఒక ఆకతాయి పిల్లాడు వెంటనే అడిగాడు కదా, "తాతా, మరి అన్నీ వదిలేసి పరిగెత్తుకు వచ్చిన నీ దగ్గరకి, దేశ దేశాలనించీ తెచ్చిన వింత వస్తువులెలా వచ్చి చేరాయి?" అని.
“అబ్బో! అది ఇంకో పెద్ద కథ. మళ్ళీ ఎప్పుడైనా చెబుతానులే. అప్పటివరకూ ఈ గుమ్మడి కాయల కథ చాలు" అన్నాడు తలగుమ్మడి, తలనిండా ముసుగు కప్పుకుంటూ.
“ఒరే! ఈ తాతకి కథలు చెప్పటం బాగా వచ్చురా! అన్నీ కల్పితాలే" అని విరగబడి నవ్వాడు పిల్లవాడు.
"కల్పితం కథలతో మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. మనం వెళ్ళిపోతే ఈ‌ తాతకు పొద్దు ఎలా గడుస్తుంది?” అని నవ్వారు మిగిలిన పిల్లలంతా.
గడుసు తాత ముసుగులోంచే చూస్తూ ముసిముసిగా నవ్వాడు.